Adipurush: ‘ఆదిపురుష్‌’.. దానిని నేను అంగీకరించను: అలనాటి రాముడి పాత్రధారి

‘ఆదిపురుష్‌’ (Adipurush) సినిమా గురించి తన అభిప్రాయాన్ని వెల్లడించారు అలనాటి శ్రీరాముడి పాత్రధారి అరుణ్‌ గోవిల్‌.  

Updated : 18 Jun 2023 19:27 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: రామాయణాన్ని ఆధారంగా చేసుకుని రూపుదిద్దుకున్న ‘ఆదిపురుష్‌’(Adipurush)పై నెట్టింట తీవ్ర చర్చ జరుగుతోన్న విషయం తెలిసిందే. పాత్రల చిత్రీకరణ, సంభాషణలను వ్యతిరేకిస్తూ పలువురు సినీ రాజకీయ ప్రముఖులు, సినీ ప్రియులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ చర్చలో భాగమయ్యారు అలనాటి ‘రామాయణ్‌’ ధారావాహిక రాముడి పాత్రధారి అరుణ్‌ గోవిల్‌ (Arun Govil). ఓ ఇంటర్వ్యూలో భాగంగా ‘ఆదిపురుష్‌’పై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే, ఈ సినిమా టీజర్‌ విడుదలైనప్పుడు చిత్రబృందానికి తాను కొన్ని సూచనలు, సలహాలు ఇచ్చానని అన్నారు.

‘‘రామాయణం’.. మన విశ్వాసానికి సంబంధించిన విషయం. దాని రూపాన్ని తారుమారు చేయడం ఆమోదయోగ్యం కాదు. విజువల్‌ ఎఫెక్ట్స్‌ను పక్కన పెడితే పాత్రల చిత్రీకరణ ముఖ్యమైన విషయం. దాన్ని సీరియస్‌గా తీసుకోవాలి. ఈ చిత్రాన్ని నేనింకా చూడలేదు కానీ.. ఆన్‌లైన్‌లో వస్తోన్న వీడియోలు చూశా. ‘రామాయణం’లో ఇలాంటి భాషను నేనస్సలు అంగీకరించను. ఇన్నాళ్లుగా మనందరికీ తెలిసిన రామాయణ వర్ణనలో తప్పు ఏముంది? విషయాలు మార్చాల్సిన అవసరం ఏముంది? బహుశా, చిత్రబృందానికి సీతారాములపై సరైన అవగాహన లేదు. అందుకే ఈ మార్పులు చేశారు’’ అని ఆయన తెలిపారు.

రామానంద్‌ సాగర్‌ తీసిన ‘రామాయణ్‌’ ధారావాహికలో అరుణ్‌ గోవిల్‌ రాముడి పాత్ర పోషించారు. ఆ సీరియల్‌తో అంతటా విశేష ఆదరణ సొంతం చేసుకున్నారు. మరోవైపు, సినిమాలో వివాదానికి దారి తీసిన పలు డైలాగ్స్‌ను మార్చనున్నట్లు ‘ఆదిపురుష్‌’ టీమ్‌ తాజాగా ప్రకటించిన విషయం తెలిసిందే. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు