ఆస్పత్రి బిల్లులు కట్టడానికీ డబ్బుల్లేవు.. సాయం కోరితే ట్రోల్‌ చేస్తున్నారు: నటి సోదరి

రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి.. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు నటి అరుంధతి నాయర్‌ (Arundhathi Nair). ఆర్థిక సాయం చేయమని కోరుతూ ఆమె సోదరి మీడియా ముందుకువచ్చారు.

Published : 20 Mar 2024 17:05 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: దాదాపు ఆరు రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు నటి అరుంధతి నాయర్‌. ఈ నేపథ్యంలో ఆర్థికసాయం కోరుతూ అరుంధతి సోదరి ఆర్తి మీడియా ముందుకువచ్చారు. ‘‘నా సోదరి తీవ్రంగా గాయపడింది. ఆస్పత్రి బిల్లులు చెల్లించడానికి కూడా మా వద్ద డబ్బుల్లేవు. దాంతో మేము ఫండ్‌ రైజింగ్‌ మొదలుపెట్టాం. ఇదొక పెద్ద స్కామ్‌ అంటూ చాలామంది ట్రోల్‌ చేశారు. ఆస్పత్రి చుట్టూ మేము పరుగులు పెడుతుంటే ఇలాంటి నెగెటివిటీ వస్తుందనుకోలేదు’’ అన్నారు.

అరుంధతి స్నేహితురాలు, సహనటి రమ్య మాట్లాడుతూ.. ‘‘కోలీవుడ్‌లో తెరకెక్కిన పలు చిత్రాల్లో అరుంధతి కథానాయికగా నటించారు. ఆమె తలకు తీవ్రంగా గాయమైంది. తమిళ చిత్ర పరిశ్రమకు చెందిన నటీనటులు, లేదా నడిగర్‌ సంఘం సభ్యులు ఒక్కరూ సాయం చేయడానికి ఆసక్తి చూపించలేదు. మమల్ని ఇంతవరకూ సంప్రదించలేదు. తన పరిస్థితి ఎలా ఉందో తెలుసుకోలేదు, ట్రీట్‌మెంట్‌ పూర్తయ్యేసరికి ఖర్చు ఎంత అవుతుందో చెప్పలేం. సహ నటీనటులు కొంతవరకు మాత్రమే సాయం చేయగలరు. ఎందుకంటే, మేము రూ.కోట్లలో సంపాదించడం లేదు’’ అని వాపోయారు.

తమిళ చిత్రం ‘పొంగి ఎజు మనోహర’తో తెరంగేట్రం చేశారు అరుంధతి. తర్వాత, విజయ్‌ ఆంటోనీ హీరోగా తెరకెక్కిన ‘సైతాన్‌’లో నటించి, మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ‘డోంట్‌ థింక్‌’, ‘పద్మిని’వంటి వెబ్‌సిరీస్‌ల్లోనూ ఆమె కీలక పాత్రల్లో నటించారు. ఓ యూట్యూబ్‌ ఛానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చిన అనంతరం తన సోదరుడితో కలిసి ద్విచక్ర వాహనంపై ఇంటికి వెళ్తుండగా ప్రమాదం చోటుచేసుకుందని సమాచారం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని