Ayalaan: సంక్రాంతికే గ్రహాంతరవాసి

తెలుగు, హిందీ, తమిళ, మలయాళ చిత్ర పరిశ్రమల నుంచి సంక్రాంతికి చాలా చిత్రాలు సందడి చేయనున్నాయి. ఇప్పుడు ఆ రేసులో ‘అయలాన్‌’  కూడా వచ్చి చేరింది.

Updated : 03 Jan 2024 12:20 IST

తెలుగు, హిందీ, తమిళ, మలయాళ చిత్ర పరిశ్రమల నుంచి సంక్రాంతికి చాలా చిత్రాలు సందడి చేయనున్నాయి. ఇప్పుడు ఆ రేసులో ‘అయలాన్‌’  కూడా వచ్చి చేరింది. కథానాయకుడు శివకార్తికేయన్‌, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ జంటగా నటించిన చిత్రమది. గ్రహాంతర వాసి నేపథ్యంతో, భారీ విజువల్స్‌తో రవి కుమార్‌ తెరకెక్కించారు. ఫాంటమ్‌ఎఫ్‌ఎక్స్‌ స్టూడియోస్‌, కేజేఆర్‌ స్టూడియోస్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఏలియన్‌ పాత్రకు హీరో సిద్ధార్థ్‌ గళాన్నిచ్చారు. సినిమా ఈ నెల 12న విడుదల కానున్నట్లు చిత్రబృందం సామాజిక మాధ్యమాల వేదికగా మంగళవారం అధికారికంగా ప్రకటించింది. దానికి సంబంధించిన వీడియోను పంచుకుంది. ‘అంతరిక్షం నుంచి మరికొన్ని రోజుల్లో ‘అయలాన్‌’ ల్యాండ్‌ కానుంది. గొప్ప ప్రాంతాల నుంచి మా సందర్శకులను స్వాగతించడానికి మీరు సిద్ధంగా ఉన్నారా?’ అంటూ వ్యాఖ్యల్ని జోడించింది. కొత్త కథలతో ప్రయోగాలు చేసే శివకార్తికేయన్‌ ఈసారి కూడా కొత్తదనం నిండిన కథాంశంతో, గ్రహాంతరవాసితో స్నేహం చేస్తూ అలరించేందుకు ముస్తాబవుతున్నారు.


సందేశమిచ్చే ల్యాండ్‌ మాఫియా

ప్రణయనాథ హీరోగా నటిస్తూ.. స్వయంగా నిర్మించిన చిత్రం ‘ల్యాండ్‌ మాఫియా’. బాబు వీఎన్‌ తెరకెక్కించారు. మధుబాల కథానాయిక. ఈ చిత్ర ట్రైలర్‌ను హైదరాబాద్‌లో ఇటీవల విడుదల చేశారు. ఈ సందర్భంగా హీరో, నిర్మాత ప్రణయనాథ మాట్లాడుతూ.. ‘‘ఓ మంచి కథతో ఈ చిత్రం తీశాం. ఫిబ్రవరిలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. ‘‘సందేశంతో పాటు అన్ని రకాల వాణిజ్యాంశాలున్న చిత్రమిది. ఖర్చుకు వెనకాడకుండా ఎంతో చక్కగా దీన్ని నిర్మించారు నిర్మాత. ఈ సినిమాని అందరూ ఆదరించాలని కోరుకుంటున్నాం’’ అన్నారు దర్శకుడు బాబు. ఈ కార్యక్రమంలో మధుబాల, కృష్ణ మండల, వెంకట్‌, సునీల్‌ కుమార్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


థ్రిల్‌ చేయనున్న వరుణ్‌సందేశ్‌

రుణ్‌సందేశ్‌ కథానాయకుడిగా.. ఎమ్‌3 మీడియా, మహా మూవీస్‌ సంస్థలు సంయుక్తంగా ఓ చిత్రాన్ని రూపొందిస్తున్నాయి. అద్యాన్త్‌ హర్ష దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. మహేంద్రనాథ్‌ కూండ్ల నిర్మాత. ఈ చిత్రం మంగళవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి  కథానాయకుడు వరుణ్‌సందేశ్‌ క్లాప్‌నివ్వగా, ఛాయాగ్రాహకుడు అజయ్‌ కుమార్‌ తెరకెక్కించారు. అనంతరం వరుణ్‌సందేశ్‌ మాట్లాడుతూ ‘‘ఇప్పటివరకూ నేను చేసిన సినిమాలకి భిన్నంగా, సరికొత్త కథ కథనాలతో రూపొందుతున్న చిత్రమిది’’ అన్నారు. ‘‘థ్రిల్లర్‌ కథతో రూపొందుతున్న ఈ సినిమాలో వరుణ్‌సందేశ్‌ పాత్ర, ఆయన లుక్‌ ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి’’ అన్నారు దర్శకుడు. ఈ చిత్రంలో రఘు కారుమంచి, ప్రమోదిని, బలగం జయరామ్‌, వైవా రాఘవ తదితరులు నటిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని