Baby movie ott: ఓటీటీలో ‘బేబీ’ మూవీ.. స్ట్రీమింగ్‌ తేదీ ఫిక్స్‌.. వాళ్లకు స్పెషల్‌!

Baby movie ott: ఆనంద్‌ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్‌ అశ్విన్‌ కీలక పాత్రల్లో నటించిన ‘బేబీ’ఓటీటీలో స్ట్రీమింగ్‌కు సిద్ధమైంది.

Published : 18 Aug 2023 10:33 IST

హైదరాబాద్‌: చిన్న చిత్రంగా విడుదలై బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయాన్ని అందుకున్న ముక్కోణపు ప్రేమ కథ ‘బేబీ’ (Baby). సాయి రాజేశ్‌ దర్శకత్వంలో ఆనంద్‌ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్‌ అశ్విన్‌ కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమా జులై 14న థియేటర్‌లో విడుదలైన సంగతి తెలిసిందే. ఎలాంటి అంచనాలు లేకుండా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా యువతను విశేషంగా ఆకట్టుకుంది. ముఖ్యంగా వైష్ణవి, ఆనంద్‌ దేవరకొండల నటన అందరినీ కట్టిపడేసింది. అంతేకాదు, బాక్సాఫీస్‌ వద్ద రూ.80కోట్ల వసూళ్లను రాబట్టింది. ఇక  ఈ మూవీ ఎప్పుడెప్పుడు ఓటీటీలో వస్తుందా? (Baby movie ott) అని ఎదురు చూస్తున్న సినీ ప్రేక్షకులకు శుభవార్త వచ్చేసింది.

రివ్యూ: బేబీ.. ముక్కోణపు ప్రేమకథ మెప్పించిందా?

ప్రముఖ తెలుగు ఓటీటీ వేదిక ‘ఆహా’లో ‘బేబీ’ (Baby the movie On Aha) స్ట్రీమింగ్‌ కానుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ సదరు ఓటీటీ సంస్థ  ట్వీట్‌ చేసింది. ఆగస్టు 25 నుంచి ఈ సినిమా ఆహా వేదికగా స్ట్రీమింగ్‌ కానున్నట్లు తెలుపుతూ ఓ ప్రత్యేక పోస్టర్‌ను విడుదల చేసింది. ఇక ‘ఆహా గోల్డ్‌’ సభ్యత్వం కలిగిన వారు ఈ సినిమాను 12 గంటల ముందే చూడొచ్చు. అంటే ఆగస్టు 24 సాయంత్రం 6 గంటల నుంచి గోల్డ్‌ సబ్‌స్క్రైబర్లకు ఈ సినిమా స్ట్రీమింగ్‌ కానుంది. 

ఇంతకీ ‘బేబీ’ క‌థేంటంటే: వైషు అలియాస్ వైష్ణ‌వి (వైష్ణ‌వి చైత‌న్య‌) ఓ బ‌స్తీ అమ్మాయి. చిన్న‌ప్ప‌టి నుంచి త‌న ఎదురింట్లో ఉండే ఆనంద్ (ఆనంద్ దేవ‌ర‌కొండ‌)ను ప్రేమిస్తుంటుంది. ఆ ప్రేమ‌ను అత‌నూ అంగీక‌రిస్తాడు. వీరి ప్రేమ స్కూల్ డేస్‌లోనే ముదిరి పాకాన ప‌డుతుంది. అయితే ప‌దో త‌ర‌గ‌తి త‌ప్ప‌డంతో ఆనంద్ (Anand devarakonda) ఆటో డ్రైవ‌ర్‌గా స్థిర‌ప‌డ‌తాడు. వైష్ణవి (Vaishnavi chaitanya) మాత్రం ఇంట‌ర్ పూర్తి చేసి పేరున్న ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీలో చేరుతుంది. అక్క‌డ కొత్త ప‌రిచ‌యాల వ‌ల్ల వైషూ ఆలోచ‌నా విధానంలో మార్పులు మొద‌ల‌వుతాయి. ఈ క్ర‌మంలోనే ఆమె త‌న క్లాస్‌మేట్‌ విరాజ్ (విరాజ్ అశ్విన్)కు దగ్గరవుతుంది. స్నేహం పేరుతో మొద‌లైన ఆ బంధం ఆ త‌ర్వాత అడ్డ‌దారులు తొక్కుతుంది. ఈ క్ర‌మంలోనే అనుకోని ప‌రిస్థితుల వ‌ల్ల విరాజ్‌కు వైష్ణ‌వి శారీర‌కంగా ద‌గ్గ‌ర‌వ్వాల్సి వ‌స్తుంది. మ‌రి ఆ త‌ర్వాత ఏమైంది?  వీరిద్ద‌రి వ్య‌వ‌హారం ఆనంద్‌కు తెలిసిందా?  నిజం తెలిశాక త‌ను ఎలా స్పందించాడు?  అలాగే విరాజ్‌కు వైష్ణ‌వి - ఆనంద్‌ల ప్రేమ‌క‌థ తెలిసిందా? అస‌లు ఆనంద్ - విరాజ్‌ల‌లో వైష్ణ‌వి ఎవ‌ర్ని ప్రేమించింది?  (Baby movie review in telugu)అన్న‌ది తెర‌పై చూసి తెలుసుకోవాలి.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని