Balakrishna: ఆ లోటును ‘సత్యభామ’ వేడుక భర్తీ చేసింది: బాలకృష్ణ

కొన్ని రోజులుగా కెమెరాకు దూరమయ్యాననే లోటును ‘సత్యభామ’ ఈవెంట్‌ భర్తీ చేసిందని బాలకృష్ణ అన్నారు.

Updated : 24 May 2024 23:05 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కాజల్‌ అగర్వాల్‌ (Kajal Aggarwal) పోలీసు ఆఫీసర్‌గా నటించిన చిత్రం ‘సత్యభామ’ (Satyabhama). సుమన్‌ చిక్కాల దర్శకత్వం వహించారు. జూన్‌ 7న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ట్రైలర్‌ విడుదల వేడుకను హైదరాబాద్‌లో శుక్రవారం నిర్వహించింది. ప్రముఖ హీరో బాలకృష్ణ (Balakrishna), దర్శకుడు అనిల్‌ రావిపూడి (Anil Ravipudi) ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

బాలకృష్ణ మాట్లాడుతూ.. ‘‘ఎన్నికలు పూర్తవగానే ఫుల్‌జోష్‌తో కొత్త సినిమా షూటింగ్‌ ప్రారంభిద్దామనుకున్నా. కానీ, ఇప్పటి వరకు మొదలుపెట్టలేదు (నవ్వుతూ). సుమారు 50 రోజులు కెమెరాను మిస్‌ అయ్యా. ఆ లోటును ఈ వేడుక భర్తీ చేసింది. కొన్ని పవర్‌ఫుల్‌ పేర్లు వినగానే ఓ వైబ్రేషన్‌ వస్తుంది. అలాంటి వాటిలో ‘సత్యభామ’ ఒకటి. ఈ సినిమాలో కాజల్‌ ఫైట్స్‌ అద్భుతంగా చేసింది. బిడ్డకు జన్మనిచ్చినా మళ్లీ ఇండస్ట్రీలోకి వచ్చి, సత్తా చాటింది. మా సినిమా ‘భగత్‌ కేసరి’లో నటించినందుకు ఆమెకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇలాంటి పాత్రలే చేయాలని ఆమె గీత గీసుకోలేదు. ఈ చిత్రంలో నవీన్‌ చంద్ర చక్కగా నటించాడు. ‘గూఢచారి’, ‘మేజర్‌’ చిత్రాల దర్శకుడు శశికిరణ్‌ తిక్కా దీనికి స్క్రీన్‌ప్లే అందించడం విశేషం. దర్శకుడు ఆలోచనకు ‘తెర’రూపం ఇచ్చేది కెమెరామ్యాన్‌ మాత్రమే. అంత ప్రాధాన్యం ఉంది కాబట్టి నేనూ ఆ క్రాఫ్ట్‌ (సినిమాటోగ్రఫీ)పై పట్టుసాధించాలనుకునేవాణ్ని’’

‘‘నేడు నారద జయంతి. కానీ, ఆయన గురించి ఎవరూ మాట్లాడుకోరు. ఎన్నో పాత్రలు పోషించిన నాన్న.. నారదుడిగా నటించలేదు. ఆ అదృష్టం నాకు దక్కింది. ‘శ్రీనివాస కల్యాణం’లో నేను నారదుడిగా యాక్ట్‌ చేశా. వారసత్వం అంటే నాన్న చిత్రాల గురించి, ఆయన పద్ధతి గురించి చెప్పుకోవడం కాదు. ఆచరిస్తున్నామా? అన్నది ముఖ్యం. ఆయన వారసులుగా మనమంతా (టాలీవుడ్‌ నటులు) ముందుకు దూసుకెళ్తున్నందుకు ఆనందంగా ఉంది’’ అని పేర్కొన్నారు.

‘‘హీరోయిన్‌గా పదిహేడేళ్లు ప్రయాణం చేయడం మామూలు విషయం కాదు. ఆమె సెకండ్‌ ఇన్నింగ్స్‌ మా ‘భగవంత్‌ కేసరి’తోనే ప్రారంభమైంది. మరిన్ని విజయాలు అందుకోవాలని కోరుకుంటున్నా’’ అని అన్నారు. ‘‘సత్యభామ’ నాకెంతోప్రత్యేకం. బాలకృష్ణ సర్‌ వేడుకకు రావడం నాకు ఓ భరోసా. ఆయనకు ఎమోషన్స్‌ తప్ప క్యాలిక్యులేషన్స్‌ ఉండవు’’ అని కాజల్‌ పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని