Cannes Film Festival: అదరగొట్టిన అనసూయ

ప్రతిష్ఠాత్మక కేన్స్‌ వేదికపై భారతీయ సినిమా ఘనంగా మెరిసింది. 77వ కేన్స్‌ చలనచిత్రోత్సవాల్లో ‘అన్‌ సర్టెయిన్‌ రిగార్డ్‌’ విభాగంలో భారతీయ నటి అనసూయ సేన్‌గుప్తాను ఉత్తమ నటిగా ప్రకటించారు.

Updated : 26 May 2024 03:46 IST

కేన్స్‌ చిత్రోత్సవాల్లో ఉత్తమ నటి పురస్కారం 
తొలి భారతీయురాలిగా చరిత్ర 

ప్రతిష్ఠాత్మక కేన్స్‌ వేదికపై భారతీయ సినిమా ఘనంగా మెరిసింది. 77వ కేన్స్‌ చలనచిత్రోత్సవాల్లో ‘అన్‌ సర్టెయిన్‌ రిగార్డ్‌’ విభాగంలో భారతీయ నటి అనసూయ సేన్‌గుప్తాను ఉత్తమ నటిగా ప్రకటించారు. ‘ది షేమ్‌లెస్‌’ అనే హిందీ సినిమాలో అత్యుత్తమ నటనకుగాను ఈ అవార్డుకు ఎంపికయ్యారు. దీన్ని బల్గేరియన్‌ దర్శకుడు కాన్‌స్టాంటిన్‌ బొజనోవ్‌ తెరకెక్కించారు. ఈ విభాగంలో పురస్కారం అందుకున్న తొలి భారతీయ నటిగా ఆమె చరిత్ర సృష్టించారు. ‘విధిలేని పరిస్థితుల్లో పడుపు వృత్తిని కొనసాగిస్తున్నవారు, తమ హక్కుల కోసం గళమెత్తుతున్న అణగారిన వర్గాలకు ఈ అవార్డు అంకితమిస్తున్నా’ అంటూ పురస్కారం స్వీకరిస్తున్న సందర్భంగా అనసూయ చెప్పారు. 


సినిమాలు వదిలేశాక.. అవకాశం

అనసూయ సేన్‌గుప్తాది కోల్‌కతా. జాదవ్‌పూర్‌ విశ్వవిద్యాలయం నుంచి ఆంగ్ల సాహిత్యంలో పట్టా అందుకున్నాక, తనకెంతో ఇష్టమైన సినిమా ప్రయత్నాలు మొదలు పెట్టారు. 2009లో అంజన్‌ దత్‌ తెరకెక్కించిన ‘మ్యాడ్లీ బంగాలీ’తో సహాయనటిగా తెరపైకి అడుగుపెట్టారు. తర్వాత బాలీవుడ్‌ కలల్ని వెతుక్కుంటూ 2013లో ముంబయిలో అడుగు పెట్టారు. కొన్ని చిన్నాచితకా పాత్రల్లో నటించినా.. చెప్పుకోదగ్గ అవకాశాలేమీ రాకపోవడంతో ప్రొడక్షన్‌ డిజైనర్‌గా మారారు. ‘సాత్‌ ఊంఛాకే’, ‘ఫార్గెట్‌ మి నాట్‌’, ‘మసాబా మసాబా’ చిత్రాలకు పని చేశారు. అనసూయకు నటనతో పాటు సాహిత్యం, చిత్రలేఖనం లాంటి ఇతర కళల్లోనూ ప్రావీణ్యం ఉండటంతో ఆ ప్రతిభకు ముగ్దుడై.. యశ్‌దీప్‌ ఆమెను ప్రేమించారు. తర్వాత వాళ్లు పెళ్లితో ఒక్కటయ్యాక గోవాలో స్థిరపడ్డారు. దాదాపు సినిమాలకు దూరంగా ఉన్న సమయంలో ఫేస్‌బుక్‌ ద్వారా దర్శకుడు కాన్‌స్టాంటిన్, అనసూయలు ఒకరికొకరు పరిచయమయ్యారు. 2020లో ఆయన అనసూయని ‘ది షేమ్‌లెస్‌’ ఆడిషన్‌కి పిలిచారు. ఆమె హావభావాలు పలికించిన విధానం చూసి ప్రధాన పాత్రకు ఎంపిక చేశారు. ‘ది షేమ్‌లెస్‌’ని మహారాష్ట్ర, దిల్లీ, నేపాల్‌లో చిత్రీకరించారు.


‘ది షేమ్‌లెస్‌’ కథేంటి?

‘ది షేమ్‌లెస్‌’ ఇద్దరు వేశ్యల కథ. దేవదాసీ వ్యవస్థలో సమిధగా మారిన రేణుక దిల్లీలోని ఒక వేశ్యావాటికకు చేరుతుంది. అక్కడ అనుకోని పరిస్థితుల్లో ఒక పోలీసుపై కత్తితో దాడి చేసి చంపుతుంది. అక్కడ్నుంచి వేరే రాష్ట్రానికి పారిపోయి మరో వేశ్యావాటికకు చేరుతుంది. అక్కడే దేవిక పరిచయవుతుంది. ముక్కుపచ్చలారని కౌమార ప్రాయంలో ఆ మురికికూపంలో బలవంతంగా రప్పించబడుతుంది తను. ఆ బాలికకు రేణుక ఎలా అండగా నిలబడింది.. ఒకరికొకరు ఎలా దగ్గరయ్యారో? ఇందులో చూపించారు. అనసూయ ఇందులో కీలకమైన రేణుక పాత్ర పోషించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని