Prashanth Reddy: ప్రేక్షకుల్ని విసిగించకుండా అలరించడమే నా లక్ష్యం!

‘‘ప్రేక్షకులు రీల్స్‌ ట్రెండ్‌లోకి వచ్చారు. ఒక్క క్షణం బోర్‌ కొట్టినా రీల్‌ మార్చేస్తారు. ఇలాంటి తరుణంలో సినిమాలో చిన్న గ్యాప్‌ ఇవ్వకుండా ఆద్యంతం ఆసక్తిరేకెత్తిస్తూ ప్రేక్షకుల్ని సీట్లో కూర్చోబెట్టాలన్నది నా ఆలోచన.

Published : 29 May 2024 01:29 IST

‘‘ప్రేక్షకులు రీల్స్‌ ట్రెండ్‌లోకి వచ్చారు. ఒక్క క్షణం బోర్‌ కొట్టినా రీల్‌ మార్చేస్తారు. ఇలాంటి తరుణంలో సినిమాలో చిన్న గ్యాప్‌ ఇవ్వకుండా ఆద్యంతం ఆసక్తిరేకెత్తిస్తూ ప్రేక్షకుల్ని సీట్లో కూర్చోబెట్టాలన్నది నా ఆలోచన. అలా దాన్ని అనుసరించి రూపొందించిన చిత్రమే ‘భజే వాయు వేగం’’ అన్నారు ప్రశాంత్‌ రెడ్డి. ఆయన దర్శకత్వంలో కార్తికేయ, ఐశ్వర్య మేనన్‌ జంటగా నటించిన చిత్రమే ‘భజే వాయు వేగం’. యు.వి కాన్సెప్ట్స్‌ సంస్థ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 31న విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే మంగళవారం హైదరాబాద్‌లో విలేకర్లతో చిత్ర విశేషాలు పంచుకున్నారు ప్రశాంత్‌ రెడ్డి. 

  • ‘‘మనమంతా ఊర్ల నుంచి ఏదో సాధించాలనే లక్ష్యంతో సిటీకి వస్తుంటాం. అలా వచ్చిన క్రమంలో కొన్ని పోగొట్టుకుంటాం. కొన్ని సంపాదిస్తాం. ఏదేమైనా ఆఖరికి మన లక్ష్యం సాధించామా?లేదా? అనేది చూసుకుంటాం. ఈ చిత్రంలో హీరో కార్తికేయ కూడా అలా ఓ లక్ష్యంతోనే ఊరి నుంచి సిటీకి వస్తాడు. తన లక్ష్య సాధన కోసం ప్రయత్నిస్తున్న తరుణంలో వేరే సమస్యలు చుట్టుముడతాయి. దీంతో తన లక్ష్యాన్ని పక్కకు పెట్టి ముందు వాటిని పరిష్కరించుకోవాల్సి వస్తుంది. మరి ఈ క్రమంలో తనకెలాంటి సవాళ్లు ఎదురయ్యాయి? వాటిని అధిగమించి తన లక్ష్యాన్ని ఎలా నెరవేర్చుకున్నాడన్నది ఆసక్తికరం’’. 
  • ‘‘ఈ చిత్ర ట్రైలర్‌లో సినిమాలోని ఫాదర్‌ సెంటిమెంట్‌ను మాత్రమే బయట పెట్టాం తప్ప ఇంకెలాంటి ట్విస్టులు చూపించలేదు. దీంట్లో ఆఖర్లో ‘మీ నాన్న కాదు.. మా నాన్న’ అని కార్తికేయతో రాహుల్‌ చెప్పడం చూసి కథ తెలిసిపోయిందని కొందరు కామెంట్‌ చేశారు. కానీ, ట్రైలర్‌లో చూపించిన దానికి రేపు థియేటర్లలో చూసే కథకు చాలా వేరియేషన్స్‌ ఉంటాయి’’
  •  ‘‘మాది మెదక్‌. రాజమౌళి ‘సై’ సినిమా చిత్రీకరణ మా ఊరిలోనే జరిగింది. అప్పటి నుంచే నాకు చిత్రసీమలోకి రావాలన్న కోరిక ఏర్పడింది. రాజమౌళి స్ఫూర్తితో ఇండస్ట్రీలోకి వచ్చానని చెప్పేందుకు ఇప్పుడు నాకున్న అర్హత సరిపోదు. సినిమా విడుదలై.. అందరికీ నచ్చాక ఆయన పేరు చెప్తా. తన సినిమాల్లో హీరో పాత్రలు సాధారణంగా ఉంటాయి. కానీ, అవి అసాధారణమైన సమస్యల్ని ఎదుర్కొంటాయి. నా చిత్రాల్లోనూ హీరో పాత్రలు అలా ఉండాలని భావిస్తా. ప్రేక్షకులు ఎన్నో సమస్యలతో థియేటర్‌కు వస్తారు. వాళ్లని విసిగించకుండా కాసేపు అలరించేలా నా చిత్రాలు ఉండాలనుకుంటా’’.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు