Bharathanatyam: కథ రాస్తున్నప్పుడు నేను హీరో అనుకోలేదు

‘‘చిన్నప్పటి నుంచీ సినిమా రంగంలోకి రావాలి, దర్శకత్వం చేయాలనే కోరిక బలంగా ఉండేది.

Updated : 04 Apr 2024 09:45 IST

‘‘చిన్నప్పటి నుంచీ సినిమా రంగంలోకి రావాలి, దర్శకత్వం చేయాలనే కోరిక బలంగా ఉండేది. నా చదువులు పూర్తయ్యాక రచనపై మక్కువ పెరిగింది. అలా నేను రాసుకున్న కథే ‘భరతనాట్యం’. కానీ ఈ కథలో నేనే హీరోగా నటిస్తానని మాత్రం అనుకోలేదు. ఓ  రచయితగా, కథానాయకుడిగా ఈ సినిమా ఎన్నో అనుభవాల్ని పంచింది’’ అన్నారు సూర్యతేజ ఏలే. ప్రముఖ సినీ పబ్లిసిటీ డిజైనర్‌ ధని ఏలే తనయుడైన సూర్యతేజ  కథానాయకుడిగా... కె.వి.ఆర్‌.మహేంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘భరతనాట్యం’. పాయల్‌ సరాఫ్‌ నిర్మాత. ఈ నెల 5న చిత్రం ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా సూర్యతేజ బుధవారం హైదరాబాద్‌లో విలేకర్లతో ముచ్చటించారు. ‘‘ఇదొక కల్పిత కథే కానీ.. నిజ జీవితాల్ని ప్రతిబింబించేలా ఉంటుంది. ఎవరైనా సరే, అడ్డదారుల్లో వెళ్లాలనుకుంటే   ఏం జరుగుతుందనే అంశం ఇందులో కీలకం. దర్శకుడు కె.వి.ఆర్‌.మహేంద్ర చిత్రాన్ని చాలా బాగా తీశారు. ఆయనతో నాకు ముందు నుంచే పరిచయం ఉండేది.

కథలు రాయడం, తెలిసినవారికి వినిపించే క్రమంలోనే ‘భరతనాట్యం’ కథని కె.వి.ఆర్‌.మహేంద్రకి, ఈ చిత్ర నిర్మాతల్లో ఒకరైన హితేశ్‌కీ చెప్పా. వాళ్లకి బాగా నచ్చింది. అదే సమయంలోనే ఓ క్రైమ్‌ కామెడీ కథని రాసుకుని సినిమా తీసే ప్రయత్నాల్లో ఉన్నారు మహేంద్ర. నీ కథ బాగుందని ఆయన చెప్పాక, మీరే దర్శకత్వం చేస్తే ఇంకా బాగుంటుందని కోరా. ఆయన వెంటనే అంగీకారం తెలిపారు. అప్పటికి నేనే హీరోగా చేస్తానని అనుకోలేదు. అందరూ ఈ కథలో నువ్వు ఉన్నావని చెప్పారు. అలా సమష్టి నిర్ణయంతోనే నేను హీరోగా కెమెరా ముందుకు రావల్సి వచ్చింది’’ అన్నారు. తన భవిష్యత్తు ప్రణాళికల గురించి చెబుతూ ‘‘మా నాన్న ధని ఏలే పబ్లిసిటీ డిజైనర్‌. భవిష్యత్తులో నటనా లేక రచయితగానే కొనసాగాలా అనే విషయంపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఎలా అయినా సరే సినిమా రంగంలోనే ఉండాలన్నదే నా నిర్ణయం’’ అన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని