The Diary of West Bengal: మొన్నటివరకు ‘ది కేరళ స్టోరీ’.. ఇప్పుడు ‘ది డైరీ ఆఫ్ వెస్ట్‌ బెంగాల్‌’ వివాదం

తాజాగా విడుదలైన ఓ చిత్ర ట్రైలర్‌పై పశ్చిమ్ బెంగాల్(West Bengal) ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. వెంటనే ఆ దర్శకుడిపై చర్యలు ప్రారంభించింది. ఇంతకీ విషయం ఏంటంటే..? 

Published : 26 May 2023 18:24 IST

కోల్‌కతా: ‘ది కేరళ స్టోరీ’(The Kerala Story)సినిమా వివాదం సద్దుమణగక ముందే మరో సినిమాపై రగడ మొదలైంది. ఈసారి అందుకు పశ్చిమ్ బెంగాల్(West Bengal) వేదికైంది. అక్కడి ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకొని ‘ది డైరీ ఆఫ్‌ వెస్ట్ బెంగాల్‌’(The Diary of West Bengal) ట్రైలర్‌ విడుదలైంది. ఇది బెంగాల్ ప్రభుత్వ ఆగ్రహానికి దారితీసింది. దాంతో దర్శకుడిపై చర్యలు ప్రారంభమయ్యాయి. ఆ చిత్రం ద్వారా రాష్ట్రం పరువు తీసేందుకు ప్రయత్నిస్తున్నారంటూ పోలీసులు మిశ్రాకు నోటీసులు జారీ చేశారు. పలు సెక్షన్ల కింద ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. ఈ పరిణామాలపై భాజపా తీవ్రంగా స్పందించింది. 

‘‘ది కేరళ స్టోరీ’ని నిషేధించాలని విఫలయత్నం చేసిన బెంగాల్‌.. ఇప్పుడు ‘ది డైరీ ఆఫ్‌ వెస్ట్ బెంగాల్’ చిత్ర నిర్మాత, దర్శకుడిని అణచివేస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న వాస్తవ ఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించారు. ట్రైలర్‌లో చూపించినవి అక్కడి ప్రజల ప్రత్యక్ష అనుభవాలు. భావ ప్రకటన స్వేచ్ఛను అణచివేసే చర్యలను మమతా బెనర్జీ మానుకోవాలి. ఆమె విలువలు లేని ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. ప్రజలు టీఎంసీ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెబుతారు’ అని భాజపా నేత అమిత్‌ మాలవీయ విమర్శలు గుప్పించారు. 

ఇప్పటికీ ఇంకా ‘ది కేరళ స్టోరీ’(The Kerala Story) సినిమాపై వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. కేరళలో కొన్నేళ్లుగా కొందరు మహిళలు అదృశ్యమైనట్లు వస్తోన్న ఆరోపణలకు సంబంధించి వారి ఆచూకీ ఎక్కడనే ఇతివృత్తంతో దీన్ని రూపొందించగా.. ఈ చిత్రం శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా ఉందని బెంగాల్ దాని విడుదలను అడ్డుకుంది. దానిని నిషేధిస్తూ బెంగాల్ ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వగా.. ఆ నిషేధంపై స్టే విధిస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చిన సంగతి తెలిసిందే. వివాదాల మధ్యనే విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మాత్రం దూసుకెళ్తోంది. ఇక ప్రస్తుతం డైరీ ఆఫ్ వెస్ట్‌ బెంగాల్‌ ట్రైలర్‌లో చూపించిన ఘటనలను మమత ప్రభుత్వం తీవ్రంగా ఖండిస్తోంది. 

ది డైరీ ఆఫ్ వెస్ట్ బెంగాల్‌ చిత్రదర్శకుడు సనోజ్ మిశ్రా మాట్లాడుతూ.. ‘రాష్ట్రం పరువుకు భంగం కలిగించాలనేది మా ఉద్దేశం కాదు. ఎంతో పరిశోధన చేసి, మేం వాస్తవాలను మాత్రమే చూపించాం. సినిమా చిత్రీకరణ ఇంకా పూర్తికాలేదు. వచ్చేనెల మేం దీనిని సెన్సార్ బోర్డుకు సమర్పించే అవకాశం ఉంది’ అని తెలిపారు. జితేంద్ర నారాయణ్ సింగ్ త్యాగి.. ఈ సినిమాకు కథను అందించారు. నిర్మాణ బాధ్యతలు తీసుకున్నారు. ఆయన అసలు పేరు వసీం రిజ్వి. ఉత్తర్‌ప్రదేశ్‌లోని షియా వక్ఫ్‌ బోర్డుకు గతంలో ఛైర్మన్‌గా పనిచేశారు. 2021 డిసెంబర్‌లో ఆయన హిందూమతంలోకి మారి జితేంద్రగా పేరు మార్చుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని