Akshara singh: ప్రశాంత్‌ కిశోర్‌ జన్‌ సూరజ్‌లో చేరిన భోజ్‌పురి నటి అక్షర సింగ్‌

ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌ ప్రారంభించిన జన్‌ సూరజ్‌ క్యాంపెయిన్‌లో భోజ్‌పురి నటి అక్షర సింగ్‌ చేరారు.

Published : 27 Nov 2023 21:18 IST

పట్నా: ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌ ప్రారంభించిన జన్‌ సూరజ్‌ క్యాంపెయిన్‌లో భోజ్‌పురి నటి అక్షర సింగ్ చేరారు. సోమవారం పట్నాలోని జన్ సూరాజ్ కార్యాలయంలో ఆమె ఈ ప్రకటన చేశారు.  తనను తాను ‘బిహార్‌ కీ భేటీ’ పేర్కొన్న ఆమె.. రాష్ట్రంలో మార్పు కోసం ప్రశాంత్‌ కిశోర్‌ కొనసాగిస్తున్న పాదయాత్రలో భాగమైనట్లు పేర్కొన్నారు.  జన్‌ సూరజ్‌ అనేది ఉద్యమం గనకే దాన్ని ఎంచుకున్నట్లు స్పష్టంచేశారు. తనకు ఒకవేళ రాజకీయపరమైన ఆశయాలు ఉంటే.. ఎన్నికల్లో టికెట్‌ కోసం ప్రయత్నించేదాన్నని చెప్పారు. అందుకోసం అన్ని రాజకీయ పార్టీల్లోనూ ఉన్న తన శ్రేయోభిలాషుల ద్వారా ప్రయత్నం చేసి ఉండేదాన్నని తెలిపారు. కానీ, తన కల బిహార్‌ అభివృద్ధిని చూడటమేనని.. అందుకోసం అవిశ్రాంతంగా కృషిచేస్తున్న ప్రశాంత్ కిషోర్‌తో కలవడం గర్వకారణంగా భావిస్తున్నట్లు ఆమె చెప్పుకొచ్చారు. 

నితిన్‌ గడ్కరీ తండ్రిలాంటివారు.. 

భాజపా అగ్రనేత,  కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీని అక్షర సింగ్‌ కలవడంపై అనేక ఊహాగానాలు చెలరేగాయి. ఆమె కూడా భోజ్‌పురి సినీ నటులు మనోజ్‌ తివారీ, రవి కిషన్‌, దినేశ్‌ లాల్‌ యాదవ్‌ వంటి సీనియర్ల బాటలోనే భాజపాలో చేరబోతున్నారంటూ చర్చ జరిగింది. ఈ నేపథ్యంలో విలేకర్లు అడిగిన ప్రశ్నకు ఆమె స్పందించారు. ‘నితిన్‌ గడ్కరీ నాకు తండ్రి లాంటివారు. ఆయన్ను ఎప్పుడు కలిసినా ఎంతో ఆప్యాయత చూపించేవారు. నాగ్‌పుర్‌లో ఒక స్టేజ్‌ షో కోసం వెళ్లిన సందర్భంలో నితిన్‌ గడ్కరీని కలిశాను. అంతకుమించి ఏమీ లేదు’ అని సమాధానమిచ్చారు.  తక్కువ బడ్జెట్‌ చిత్రాల్లో అత్యధిక పారితోషికం తీసుకొనే అక్షర సింగ్‌ను భోజ్‌పురి క్వీన్‌గానూ పేర్కొంటారు.

గతేడాది గాంధీ జయంతి రోజు  (అక్టోబర్‌ 2న) ప్రశాంత్‌ కిశోర్‌ ‘జన్‌ సూరజ్‌’ పేరుతో సుదీర్ఘ పాదయాత్రను మొదలుపెట్టిన విషయం తెలిసిందే. దాదాపు 3,500 కి.మీల మేర ఈ పాదయాత్ర కొనసాగనుంది. బిహార్‌లోని పశ్చిమ చంపారన్‌ జిల్లాలో మొదలైన ఈ యాత్ర ప్రస్తుతం ఉత్తర బిహార్‌లో కొనసాగుతోంది. ప్రజా సమస్యలను తెలుసుకునేందుకు చేపట్టిన ఈ జన్‌ సూరజ్‌ క్యాంపెయిన్‌ పూర్తయ్యాక.. దీన్నో రాజకీయ పార్టీగా మార్పు చేసే అవకాశం ఉందని ప్రశాంత్‌ కిశోర్‌ ఒక సందర్భంలో వెల్లడించారు. అయితే, ఆ పార్టీకి తాను సారథ్యం వహించడం గానీ, ఎన్నికల్లో పోటీ చేయడం గానీ జరగదని స్పష్టంచేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు