Bobby Deol: మా నాన్న ఎంతో సంతోషించారు: బాబీదేవోల్‌

సోషల్‌మీడియాలో వచ్చిన ప్రశంసలకు తన త్రండి ఎంతో సంతోషించారని నటుడు బాబీదేవోల్‌ అన్నారు.

Published : 20 Mar 2024 19:56 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: బాలీవుడ్ హీరో రణ్‌బీర్‌ కపూర్‌ (ranbir kapoor) ప్రధాన పాత్రలో సందీప్‌రెడ్డి వంగా తెరకెక్కించిన చిత్రం ‘యానిమల్‌’ (Animal ). రష్మిక కథానాయిక. త్రిప్తి దిమ్రి, అనిల్‌ కపూర్‌ కీలకపాత్రల్లో నటించారు. తండ్రీ కొడుకుల అనుబంధం నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రంలో బాబీదేవోల్‌ (Bobby Deol) ప్రతినాయకుడి పాత్ర పోషించారు. ఇందులో ఆయన తన నటనతో ఆకట్టుకుంటూ ప్రశంసలు అందుకున్నారు. ఇటీవల ఓ కార్యక్రమంలో తన తండ్రి ధర్మేంద్ర స్పందనను గుర్తుచేసుకున్నారు. ‘‘మా నాన్న సోషల్‌మీడియాను ఎక్కువగా ఇష్టపడతారు. యానిమల్‌ విజయం తర్వాత ఇంటికి వెళ్లినప్పుడు ఆయన నాతో ఇలా అన్నారు. ‘సోషల్‌మీడియాలో నీ క్రేజ్‌ మామూలుగా లేదు. వారంతా నిన్ను ఎంతో అభిమానిస్తున్నారు’’ అని అన్నారు. నాకు ఎంత క్రేజ్‌ వచ్చినా నేను ఎప్పటికీ మీ కొడుకునేనని అనడంతో ఆయన ఎంతో సంతోషించారు. ఆ మధురమైన క్షణాలు ఎప్పటికీ గుర్తుంటాయి. ‘యానిమల్‌’ విడుదల తర్వాత పరిశ్రమ నుంచి లభించిన ప్రేమ చాలా ప్రత్యేకమైనది. ఇందులో ఎంతోమంది మంచి వ్యక్తులు ఉన్నారు. వారంతా నన్ను గుర్తుంచుకుని ఫోన్‌ చేసి అభినందించాల్సిన అవసరం లేదు. ఇండస్ట్రీ ఎప్పటికీ అద్భుతంగా ఉంటుందని భావిస్తున్నా’’ అని బాబీదేవోల్‌ వెల్లడించారు.

బాక్సీఫీస్‌ వద్ద భారీ వసూళ్లు రాబట్టిన ఈ సినిమాకు సీక్వెల్‌గా ‘యానిమల్‌ పార్క్‌’ రానుంది. మరోవైపు బాబీదేవోల్‌ ‘కంగువా’ చిత్రంలో నటిస్తున్నారు. సూర్య కథానాయకుడిగా శివ తెరకెక్కిస్తున్నారు. దిశాపటానీ హీరోయిన్‌. తెలుగులో బాలకృష్ణ కథానాయకుడిగా తెరకెక్కుతోన్న చిత్రంలోనూ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాకు బాబీ దర్శకత్వం వహిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని