Bobby Deol: బాలకృష్ణ సినిమా కోసం బాబీ దేవోల్‌ న్యూలుక్‌!

బాలకృష్ణ హీరోగా బాబీ తెరకెక్కించనున్న సినిమా కోసం బాబీ దేవోల్‌ న్యూలుక్‌లో కనిపించనున్నట్లు తెలుస్తోంది.

Published : 10 Apr 2024 16:48 IST

ఇంటర్నెట్‌ డెస్క్: ‘యానిమల్‌’తో అన్ని భాషల వారికీ చేరువయ్యారు బాలీవుడ్‌ నటుడు బాబీ దేవోల్‌ (Bobby Deol). ఆ సినిమాలో హీరోకు సమానమైన ఫిట్‌నెస్‌తో కనిపించి ఆశ్చర్యపరిచారు. ఇప్పుడు వరుస సినిమాల్లో విలన్‌గా ఆకట్టుకోవడానికి సిద్ధమయ్యారు. బాలకృష్ణ (Balakrishna) కథానాయకుడిగా బాబీ దర్శకత్వంలో రానున్న సినిమాలో (#NBK109) అవకాశాన్ని అందుకున్నారు. ఇందులో ఆయన ప్రతి నాయకుడిగా కనిపించనున్నట్లు తెలుస్తోంది.

‘బాబీ ఈ సినిమాకు గతేడాదే సంతకం చేశారు. మరో రెండు నెలల్లో ఆయన పాత్రకు సంబంధించిన షూటింగ్‌ ప్రారంభం కానుంది. ఇందులో ఆయన ఇప్పటివరకు చూడని లుక్‌లో కనిపించనున్నారు. ప్రస్తుతం దాని కోసం వర్కవుట్స్‌ కూడా మొదలుపెట్టారు. అగ్ర కథానాయకుడి సినిమాలో అవకాశం రావడంతో ఎంతో ఆనందంగా ఉన్నారు. పూర్తిస్థాయి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం రానుంది’ అని సినీ వర్గాలు వెల్లడించాయి. దీంతో ఈ చిత్రంలో బాలకృష్ణతో పాటు బాబీ దేవోల్‌ ఎలా కనిపిస్తారా అని అందరిలో ఆసక్తి నెలకొంది. మాస్‌ యాక్షన్‌ కథాంశంతో రూపొందుతోన్న ఈ సినిమాలో బాలయ్య రెండు కోణాలున్న పాత్రలో కనువిందు చేయనున్నట్లు తెలుస్తోంది. చాలా సంవత్సరాల తర్వాత ఆయన క్లాసీ లుక్‌లో కనిపించనున్నారట. అలాగే దీనిలో పొలిటికల్‌ బ్యాక్‌డ్రాప్‌ నేపథ్యం ఉంటుందని టాక్‌. ఇందులో మలయాళం అగ్ర హీరో కూడా నటిస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.

ఇక ఈ చిత్రంతో పాటు బాబీ దేవోల్‌  ‘కంగువా’లో నటిస్తున్నారు. సూర్య కథానాయకుడిగా శివ తెరకెక్కిస్తోన్న చిత్రమిది. దిశా పటానీ కథానాయిక. ఇందులో భిన్నమైన ఆహార్యంతో కనిపిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు బాబీ. ఇప్పటికే ఆయన ఫస్ట్‌ లుక్‌ను విడుదల చేయగా దానికి విశేష ఆదరణ లభించింది. దీంతో బాలయ్య సినిమాలో ఎలా కనిపిస్తారా అని అందరూ ఎదురుచూస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని