Bollywood: అగ్ర తారలే అదుర్స్‌

ఈ ఏడాది హిందీ చిత్రసీమలో బాక్సాఫీస్‌ రికార్డులను బ్రేక్‌ చేస్తూ వచ్చింది కొందరు హీరోలైతే, మరికొందరూ అసలు విజయమనే ఖాతాను తెరవనే లేదు.

Updated : 31 Dec 2023 12:00 IST

ఈ ఏడాది హిందీ చిత్రసీమలో బాక్సాఫీస్‌ రికార్డులను బ్రేక్‌ చేస్తూ వచ్చింది కొందరు హీరోలైతే, మరికొందరూ అసలు విజయమనే ఖాతాను తెరవనే లేదు. బాలీవుడ్‌లో విడుదలైన కొందరు అగ్రతారల చిత్రాలు తెలుగులోను మంచి వసూళ్లను సొంతం చేసుకున్నాయి. యువకథానాయకుల సినిమాలు ఎన్నో అంచనాల మధ్య విడుదలైనా... అనుకున్న స్థాయిలో ప్రేక్షకులను అలరించలేకపోయాయి. కొందరు సీనియర్‌ కథానాయకులైతే...అందుకున్న విజయాల్లోనూ వారి సీనియారిటీని చూపించారు. వారి బాటలోకి ఒకరిద్దరూ యువతారాలు వచ్చినా మరికొందరు మాత్రం విజయ భేరిని మోగించలేకపోయారు.


ముచ్చటగా మూడు

విభిన్నమైన పాత్రలు చేయడం ఆయనేకేం కొత్త కాదు. చేసిన ప్రతీ పాత్రను తనదైన శైలితో చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటారు కింగ్‌ ఖాన్‌ షారుక్‌ ఖాన్‌. ఈ ఏడాది ‘పఠాన్‌’ సినిమాతో ప్రేక్షకులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ తన అభిమానులకు మంచి ట్రీట్‌ అందించారు ఖాన్‌. ఆ సినిమాలో తన యాక్షన్‌తో బాక్సాఫీసును షేక్‌ చేసి భారీ విజయాన్ని అందుకున్నారు. సిద్ధార్థ్‌ ఆనంద్‌ దర్శకత్వంలో వచ్చిన ఆ సినిమాలో అతిథి పాత్రలో వచ్చిన సల్మాన్‌తో కలిసి చేసిన యాక్షన్‌ సన్నివేశాలు సినీప్రియులకు కనువిందు చేశాయి. అదలా ఉంటే ఈ ఏడాది ద్వితీయార్ధంలో విడుదలైన ‘జవాన్‌’ బాక్సాఫీసు కలెక్షన్లను తిరగరాసింది. ఆ సినిమాలో భిన్నమైన పాత్రలు చేస్తూ అందరి దృషిని ఆకర్షించారు షారుక్‌. తమిళ దర్శకుడు అట్లీ, తెలుగు అగ్రకథానాయిక నయనతారలకు హిందీలో అది తొలి సినిమానే అయినా షారుక్‌ చేయడం కలిసొచ్చింది. ఇక ఇప్పుడు మరో హిట్‌ దర్శకుడు రాజ్‌కుమార్‌ హిరాణీ దర్శకత్వంలో వచ్చిన ‘డంకీ’ సినిమాతో ముచ్చటగా మూడోసారి హిట్‌ అందుకున్నారు.  


చివరికి అందిన బ్లాక్‌బస్టర్‌

సీనియర్‌ హీరోలకు ఒక దశ దాటాకా వరుస ఫ్లాప్‌లు వస్తే నిలదొక్కుకోవడం కష్టం. ఒకవేళ విలన్‌గానో, చిన్న పాత్రలు చేసినా తరువాత పెద్దగా అవకాశాలు రాకపోవచ్చు. కానీ సరైన సమయంలో అదృష్టం తలుపుతడితే భాగ్యరేఖలు మారిపోతాయని నిరూపించింది ‘గదర్‌ 2’ చిత్రం. ‘బ్లాంక్‌’, ‘చుప్‌’లతో ప్రేక్షకులను మెప్పించలేకపోయిన సన్నీ దేవోల్‌ ఈ ఏడాది స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా విడుదలైన ‘గదర్‌ 2’తో జాక్‌పాట్‌ కొట్టేశాడంటున్నాయి ఆ సినిమా బాక్సాఫీసు కలెక్షన్లు. 2001లో ‘గదర్‌: ఏక్‌ ప్రేమ్‌ కథా’కు సీక్వెల్‌గా వచ్చిన ఆ చిత్రం భారీ విజయాన్ని సొంతం చేసుకొని సన్నీకి బ్లాక్‌బస్టర్‌ హిట్‌ని అందించింది. ఈ ఏడాదిలో ఆయన ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఒక్క సినిమాతోనైనా సరే అభిమానులకు గుర్తిండిపోయే సినిమాని అందించారు. అంచనాలు లేకుండా విడుదలైన ఆ సినిమా తెలుగులోనూ అలరించింది. ఆరు పదుల వయసులో కూడా యాక్షన్‌తో మెప్పించారాయన. ఈ ఏడాది ఆయనకు బాగానే కలిసొచ్చిందని చెప్పాలి.


అనుకున్నంత కాకపోయినా..

త రెండేళ్లలో వచ్చిన సినిమాలతో తన అభిమానులను అలరించలేకపోయారు సల్మాన్‌ ఖాన్‌. వరుస ఫ్లాపులతో ఉన్న ఆయన కెరీర్‌ కమ్‌బ్యాక్‌ ఎప్పుడా అని ఎదురు చూస్తోన్న సమయంలో ‘టైగర్‌ 3’తో థియేటర్లలో సందడి చేశారు. ఈ ఏడాది జనవరిలో విడుదలై శుభారంభం అందుకున్న ‘పఠాన్‌’లో అతిథి పాత్రలో మెరిసి ప్రేక్షకులకు మంచి అనుభూతిని కలిగించారు. తర్వాత వచ్చిన ‘కిసీ కా భాయ్‌ కిసీ కి జాన్‌’తో మళ్లీ ఫ్లాప్‌ బాట పట్టిన సల్మాన్‌కు మనీష్‌ శర్మ ‘టైగర్‌ 3’తో మంచి విజయాన్ని అందించారు. 2017లో సల్మాన్‌ నటించిన ‘టైగర్‌ జిందా హై’కు సీక్వెల్‌గా వచ్చిన ‘టైగర్‌ 3’ యాక్షన్‌ అభిమానులను మెప్పించింది.  ‘టైగర్‌ కా మెసేజ్‌’ అంటూ విడుదలైన ట్రైలర్‌, సినిమా పాటలు, కత్రీనాతో కెమిస్ట్రీ బాగానే పండాయి. ఈ చిత్రంతో అనుకున్నంత కలెక్షన్లను సొంతం చేసుకోకపోయినా సల్మాన్‌ ఈ ఏడాదికి మంచి ముగింపే పలికాడాంటున్నాయి చిత్రవర్గాలు.


యానిమల్‌ దూకుడు

సావరియా’తో చిత్రసీమకు పరిచయమయ్యారు కథానాయకుడు రణ్‌బీర్‌ కపూర్‌. కొత్తదనం నిండిన కథలతో భిన్నమైన పాత్రలతో అలరిస్తుంటాడీయన. గతేడాది ‘బ్రహ్మాస్త్ర’తో భారీ విజయాన్ని అందుకున్న  రణ్‌బీర్‌ ఈ ఏడాది ప్రథమార్ధంలో ‘తు జూతీ మేన్‌ మక్కర్‌’తో ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయారు. తర్వాత ఒక్క సినిమా లేని రణ్‌బీర్‌ తెలుగు దర్శకుడు సందీప్‌ రెడ్డి వంగా దర్శకత్వంలో వచ్చిన ‘యానిమల్‌’ సినిమాలో నటించి థియేటర్లలో సునామీ సృష్టించారు. ఆయన...రష్మిక జంటగా నటించిన ఈ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంటోంది. పాన్‌ ఇండియాగా ప్రేక్షకుల ముందు వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద ఇప్పటికీ కలెక్షన్ల వర్షం కురిపిస్తూనే ఉంది. ఈ నెల 1న విడుదలైన ఈ సినిమా తొలివారంలోనే మంచి కలెక్షన్లను సొంతం చేసుకుంది. సందీప్‌ రెడ్డి హిందీలో తీసిన ఈ తొలి సినిమా కాసుల వర్షం కురిపిస్తోంది. ఏడాది చివర్లో వచ్చినా తన నటనతో చెరిగిపోని ముద్ర వేసుకున్నారు. ‘యానిమల్‌’ పంజా ఎలా ఉంటుందో చూపించారు రణ్‌బీర్‌.


అదే మాదిరి..

ఏడాది ‘సెల్ఫీ’తో మొదలు పెట్టిన అక్షయ్‌ కుమార్‌ ప్రేక్షకుల మెప్పు పొందలేకపోయింది. ఆ తర్వాత వచ్చిన ‘ఓఎమ్‌జీ 2’ ఎన్నో విమర్శల మధ్య విడుదలైంది. అయినప్పటికి ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేకపోయింది. ఎన్నో సామాజిక అంశాలతో అభిమానుల ముందుకొచ్చిన ఆ సినిమా కొద్ది మందికే చేరువైంది. జస్వంత్‌ సింగ్‌ గిల్‌ జీవితం ఆధారంగా తెరకెక్కిన ‘మిషన్‌ రాణీగంజ్‌’ కూడా అక్షయ్‌కు చేదు ఫలితాన్నే మిగిల్చింది. మూడు ఫ్లాప్‌లతో ఈ ఏడాదిలో విజయ బోణీ కొట్టని అక్షయ్‌ తన అభిమానుల కోసం అరడజను సినిమాలతో బిజీగా ఉన్నారు. వరుస అపజాయలతో వస్తున్న రణ్‌వీర్‌ సింగ్‌కి ఎన్నో అంచనాలతో విడుదలైన ‘రాకీ ఔర్‌ రాణీ కీ ప్రేమ్‌ కహానీ’ సినిమా కాస్త ఊరట కలిగించింది. జయాబచ్చన్‌, షబానా అజ్మీ, ధర్మేంద్ర లాంటి సీనియర్‌ నటులు నటించిన ఆ సినిమా అనుకున్న స్థాయిలో ఆడలేదు. ఈ ఒక్క సినిమాతో సరిపెట్టుకున్న రణ్‌వీర్‌కు ఈ ఏడాది చేదు అనుభవమే మిగిలింది. ‘భోళా’తో అజయ్‌ దేవగణ్‌, ‘మిషన్‌ మజ్ను’తో యువ కథానాయకుడు సిద్ధార్థ్‌ మల్హోత్రా, ‘బీడ్‌’తో రాజ్‌కుమార్‌ రావ్‌లకు చేదు జ్ఞాపకాలే మిగిలాయి. కార్తిక్‌ ఆర్యన్‌కు ‘సత్య ప్రేమ్‌ కీ కథా’తో,  ‘డ్రీమ్‌ గర్ల్‌ 2’తో సందడి చేస్తాననుకున్న ఆయుష్మాన్‌ ఖరానాకు చేదు అనుభవాలే మిగిలాయి. ఇక విక్కీ కౌశల్‌ విషయానికొస్తే ఈ ఏడాది నాలుగు సినిమాలతో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఏదీ అనుకున్న విజయాన్ని అందించలేదు. సామ్‌ మానెక్‌షా బయోపిక్‌ ‘సామ్‌ బహాదుర్‌’కూడా అంతంత మాత్రం అనిపించింది. ఆయన కీలక పాత్ర పోషించిన ‘డంకీ’తో  విజయాన్ని అందుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని