Rhea Chakraborty: సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ మృతి కేసు.. రియా చక్రవర్తికి ఊరట

రియా చక్రవర్తి, ఆమె కుటుంబ సభ్యులపై సీబీఐ జారీ చేసిన లుక్‌ అవుట్‌ సర్క్యూలర్‌ను బాంబే హైకోర్టు రద్దు చేసింది.

Published : 23 Feb 2024 02:13 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ (Sushant Singh Rajput) మృతి కేసులో నటి రియా చక్రవర్తి (Rhea Chakraborty), ఆమె కుటుంబ సభ్యులపై సీబీఐ జారీ చేసిన లుక్‌అవుట్‌ సర్క్యూలర్‌ (ఎల్‌ఓసీ)ను బాంబే హైకోర్టు గురువారం రద్దు చేసింది. ఈ మేరకు ద్విసభ్య ధర్మాసనం అదేశాలు జారీ చేసింది. సుప్రీం కోర్టులో అప్పీల్‌ చేసేందుకు నాలుగు వారాలపాటు ఈ ఆర్డర్‌పై స్టే విధించాలన్న సీబీఐ తరఫు న్యాయవాది విజ్ఞప్తిని కోర్టు తిరస్కరించింది.

సుశాంత్‌ 2020 జూన్‌ 14న ముంబయిలోని తన ఇంట్లో అనుమానాస్పద స్థితిలో మరణించారు. అది ఆత్మహత్యకాదంటూ ఆయన కుటుంబ సభ్యులు రియా చక్రవర్తి, ఆమె ఫ్యామిలీపై ఆరోపిస్తూ.. కేసు పెట్టారు. సుశాంత్‌ బ్యాంకు ఖాతా నుంచి రూ. 15 కోట్లు బదిలీ చేసుకున్నారని అతడి తండ్రి కేకే సింగ్‌ ఆరోపించడంతో ఈ కేసులో మనీలాండరింగ్‌ జరిగినట్లు భావించి ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) రియాను ప్రశ్నించింది. ఆ తర్వాత, కేసును సీబీఐకు అప్పగిస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలిచ్చింది. సుశాంత్‌కు రియా మాదకద్రవ్యాలు ఇచ్చారనేది మరో ఆరోపణ. ఇలా నటుడి మృతి కేసులో ఆరోపణలు ఎదుర్కొని రియా, ఆమె సోదరుడు షోవిక్‌ చక్రవర్తి జైలుకు వెళ్లిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే రియా, ఆమె సోదరుడు షోవిక్‌ చక్రవర్తి, తండ్రి ఇంద్రజిత్‌ చక్రవర్తి విదేశాలకు వెళ్లకుండా సీబీఐ ఎల్‌వోసీ జారీ చేసింది. దీంతో, ఇటీవల రియా బాంబే హైకోర్టును ఆశ్రయించగా.. తాజాగా తీర్పు వెలువడింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని