Boney Kapoor: నేను బతికి ఉండగా శ్రీదేవి బయోపిక్‌కు అంగీకరించను: బోనీ కపూర్

శ్రీదేవి బయోపిక్‌ తీసేందుకు తాను అంగీకరించనని ఆమె భర్త బోనీ కపూర్‌ అన్నారు. 

Updated : 04 Apr 2024 19:40 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఒకప్పుడు భారతీయ చిత్రపరిశ్రమలో ఒక వెలుగు వెలిగారు అగ్ర కథానాయిక దివంగత నటి శ్రీదేవి (Sridevi). ఆమె బయోపిక్‌ రానున్నట్లు గతకొన్ని రోజులుగా వార్తలు వస్తోన్న సంగతి తెలిసిందే. తాజాగా దీనిపై ఆమె భర్త బోనీ కపూర్‌ స్పందించారు. ఆయన నిర్మించిన తాజా చిత్రం ప్రమోషన్స్‌లో ఈ బయోపిక్‌ గురించి మాట్లాడారు.

‘శ్రీదేవి నటించిన ‘‘ఇంగ్లిష్‌ వింగ్లిష్‌’’(English Vinglish) చిత్రాన్ని మొదట ఐశ్వర్యారాయ్‌తో తీయాలనుకున్నారు. ఐశ్వర్య ఒకప్పటి మిస్‌ వరల్డ్‌.. ఆమె ఇంగ్లిషు రాని పాత్రలో నటిస్తే ప్రేక్షకులకు నచ్చదని చెప్పాను. ఆ పాత్రకు శ్రీదేవి కచ్చితంగా సరిపోతుందని చెప్పడంతో దర్శకనిర్మాతలు అంగీకరించారు. ఆ చిత్రంలో ఇంగ్లిషు రాని గృహిణి పాత్రలో శ్రీదేవి జీవించింది. ఆ మూవీ మంచి విజయాన్ని అందుకుంది. నా భార్య చాలా ప్రైవేట్‌ పర్సన్‌. ఆమె వ్యక్తిగత విషయాలు బయటకు చెప్పడానికి ఇష్టపడేది కాదు. జీవితమంతా అలానే ఉంది. ఇప్పుడు ఆ పర్సనల్‌ విషయాలు బయటకు చెప్పడానికి నేను అంగీకరించను. నేను బతికి ఉన్నంతవరకు బయోపిక్‌కు అనుమతివ్వను’ అని బోనీ కపూర్‌ స్పష్టం చేశారు.

బాలనటిగా సినీ జీవితం మొదలుపెట్టి అగ్రహీరోలందరి సరసన నటించారు శ్రీదేవి (Sridevi). తన నటనతో అన్ని భాషల్లోని సినీప్రియులను అలరించి ఇండస్ట్రీలో తనకంటూ కొన్ని పేజీలు లిఖించుకొంది. ఆమె నటనకు ఎన్నో అవార్డులు, రివార్డులు వచ్చాయి. ఈ అగ్రకథానాయిక జీవితంలో చోటుచేసుకున్న కొన్ని ఆసక్తికర విషయాలపై ప్రముఖ పరిశోధకుడు, రచయిత ధీరజ్‌, శ్రీదేవి బయోగ్రఫీని రచించనున్నారు. ‘‘ది లైఫ్‌ ఆఫ్‌ ఎ లెజెండ్‌’’ (The Life Of A Legend) పేరుతో ఇది రానుంది. దీనికోసం శ్రీదేవి కుటుంబ సభ్యుల పర్మిషన్‌ తీసుకున్నట్లు వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని