Ram Charan: రామ్‌చరణ్‌ సరసన జాన్వీకపూర్‌.. విషయం చెప్పేసిన బోనీకపూర్

రామ్‌చరణ్‌, జాన్వీకపూర్‌ కలిసి నటించేందుకు సిద్ధమయ్యారు. ఈ విషయాన్ని జాన్వీ తండ్రి బోనీకపూర్‌ స్వయంగా చెప్పారు.

Updated : 19 Feb 2024 14:01 IST

హైదరాబాద్‌: కొన్ని కాంబినేషన్స్‌ చూడటానికి చాలా బాగుంటాయి. వెండితెరపై ఆ జోడీ కనిపిస్తే ప్రేక్షకులు తెగ ఆనందపడిపోతారు. అలాంటి జోడీనే చిరంజీవి-శ్రీదేవి. ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ చిత్రంలో వీరి కెమిస్ట్రీకి ప్రేక్షకలోకం ఫిదా అయింది. ఇప్పుడు వారి వారసులు జోడీగా తెరపై సందడి చేయబోతున్నారు. రామ్‌చరణ్‌ (Ram Charan) కథానాయకుడిగా బుచ్చిబాబు దర్శకత్వంలో ఓ చిత్రం పట్టాలెక్కనున్న సంగతి తెలిసిందే. గ్రామీణ నేపథ్యంలో సాగే స్పోర్ట్స్‌ డ్రామాగా దీన్ని తీర్చిదిద్దనున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి నటీనటుల ఎంపిక జరుగుతోంది. హీరోయిన్‌ను కూడా చిత్ర బృందం ఫిక్స్‌ చేసింది. శ్రీదేవి, బోనీకపూర్‌ల తనయ జాన్వీకపూర్‌ (Janhvi Kapoor) చరణ్‌కు జోడీగా నటించనుంది. ఈ విషయాన్ని ఆమె తండ్రి బోనీకపూర్‌ (Boney Kapoor) స్వయంగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.

‘మా అమ్మాయి ఇప్పటికే ఎన్టీఆర్‌తో (NTR) కలిసి ‘దేవర’లో (Devara) నటిస్తోంది. సెట్‌లో ప్రతి క్షణాన్ని ఆస్వాదిస్తోంది. మరికొద్ది రోజుల్లో రామ్‌చరణ్‌ నటించబోయే మూవీ షూటింగ్‌లోనూ పాల్గొంటుంది. ఎన్టీఆర్‌, చరణ్‌ ఇద్దరూ ఇద్దరే. తన నటన, భాషను పెంచుకునేందుకు వీలు కుదిరినప్పుడల్లా జాన్వీ తెలుగు సినిమాలు చూస్తోంది. వారి పక్కన నటించడం జాన్వీకి లభించిన మంచి అవకాశం. ఆ రెండు సినిమాలు బాక్సాఫీస్‌ వద్ద అదరగొట్టాలని ఆకాంక్షిస్తున్నా. మరిన్ని చిత్రాల్లో నటించే అవకాశం జాన్వీకి రావాలి. సూర్యతో కూడా మరో సినిమా చేసేందుకు సిద్ధంగా ఉంది. నా భార్య శ్రీదేవి పలు భాషల్లో నటించారు. అలాగే నా కుమార్తె కూడా నటించాలి’’ అని బోనీకపూర్‌ చెప్పుకొచ్చారు.

‘ధడక్‌’ చిత్రంతో వెండితెరకు పరిచయమైన జాన్వీకపూర్‌ వరుస సినిమాలు చేస్తున్నారు. అయితే, ఇప్పటివరకూ ఆమెకు మంచి బ్రేక్‌ రాలేదు. కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్‌ నటిస్తున్న ‘దేవర’తో తెలుగు ప్రేక్షకులకు పరిచయం కాబోతున్నారు. ఈ మూవీ దసరా కానుకగా అక్టోబరు 10న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని