Sridevi: శ్రీదేవి గురించి ప్రశ్న.. భావోద్వేగానికి గురైన బోనీకపూర్‌

తన తదుపరి చిత్రం ‘మైదాన్‌’ ప్రమోషన్స్‌లో బిజీగా పాల్గొంటున్నారు నిర్మాత బోనీ కపూర్‌ (Boney Kapoor). సినిమా విశేషాలతోపాటు తన కుటుంబం గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

Published : 01 Apr 2024 14:25 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ‘మైదాన్‌’ (Maidaan) ప్రమోషన్స్‌లో పాల్గొంటున్న నిర్మాత బోనీకపూర్‌ (Boney kapoor) ఓ ఇంటర్వూలో భావోద్వేగానికి గురయ్యారు. తన సతీమణి, దివంగత శ్రీదేవి (Sridevi) మరణం గురించి ప్రస్తావన రాగానే.. ఆమెను ఎప్పటికీ మర్చిపోలేనన్నారు. ‘‘ఇప్పుడు ఆ విషయం గురించి మాట్లాడొద్దు. ఇప్పటికీ ప్రతిరోజూ, ప్రతిక్షణం మిస్‌ అవుతూనే ఉన్నా. ఆమెను ఎప్పటికీ మర్చిపోలేను’’ అని పేర్కొన్నారు. వేరే టాపిక్‌ గురించి మాట్లాడుకుందామన్నారు.

‘‘ఇంగ్లిష్‌ వింగ్లిష్‌’ను మొదట ఐశ్వర్య రాయ్‌తో చేయాలనుకున్నారు. అదే చిత్రాన్ని దక్షిణాది భాషల్లో శ్రీదేవితో తెరకెక్కించాలని నిర్మాత బాల్కీ భావించాడు. అప్పుడు నేను అతడితో మాట్లాడా. ఈ కథకు శ్రీదేవి కంటే బాగా న్యాయం చేసేవాళ్లు ఎవరూ లేరని చెప్పాను’’ అని తెలిపారు.

తన కుమార్తె జాన్వీకపూర్‌ - శిఖర్‌ పహారియా రిలేషన్‌ గురించి స్పందిస్తూ.. ‘‘పిల్లల వ్యక్తిగత జీవితాల గురించి నేను కామెంట్‌ చేయాలనుకోవడం లేదు. శిఖర్‌ అంటే నాకెంతో ఇష్టం. కొంతకాలం క్రితం వాళ్లిద్దరి మధ్య మాటలు లేనప్పుడు కూడా నేను అతడితో ఫ్రెండ్లీగా ఉన్నా. వాళ్లిద్దరూ మళ్లీ కలిశారు. ఎప్పుడు ఏ అవసరం వచ్చినా మా ముందు ఉంటాడు. జాన్వీతోపాటు మా అందరితో స్నేహంగా ఉంటాడు. మాతో ఇలాంటి వ్యక్తి ఉన్నందుకు ఎంతో సంతోషిస్తున్నాం’’ అని తెలిపారు.

భారత ఫుట్‌బాల్‌ దిగ్గజ కోచ్‌ సయ్యద్‌ అబ్దుల్‌ రహీం జీవితాన్ని ఆధారంగా చేసుకుని తెరకెక్కించిన చిత్రమే ‘మైదాన్‌’. అజయ్‌ దేవ్‌గణ్‌ ప్రధాన పాత్రలో నటించారు. ప్రియమణి కీలకపాత్ర పోషించారు. అమిత్‌ శర్మ తెరకెక్కించారు. ఏప్రిల్‌ 10న విడుదల కానుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని