Priyanka Chopra: వేచి చూసినా.. ఆ స్టార్‌ హీరోయిన్‌ వేరే ప్రాజెక్ట్‌కు సంతకం చేశారు: బోనీకపూర్‌

‘మైదాన్‌’ ప్రమోషన్స్‌లో భాగంగా వరుస ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్నారు నిర్మాత బోనీకపూర్‌ (Boney Kapoor).

Updated : 12 Apr 2024 11:46 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ‘మైదాన్‌’ (Maidaan) ప్రమోషన్స్‌లో బిజీగా పాల్గొంటున్నారు నిర్మాత బోనీకపూర్‌ (Boney Kapoor). తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన లైఫ్‌స్టైల్‌, పలు చిత్రాల గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారాయన. ముఖ్యంగా ప్రియాంక చోప్రా (Priyanka Chopra) హీరోయిన్‌గా తాను ప్రకటించిన చిత్రం ఆగిపోవడానికి గల కారణాన్ని తెలియజేశారు. ఆమె మాట ప్రకారం వేచి చూసినప్పటికీ అది పట్టాలెక్కలేదన్నారు.

‘‘దిల్జిత్‌ మంచి నటుడు. అతడు నటించిన పంజాబీ, హిందీ చిత్రాలు చూశా. కామెడీ టైమింగ్‌ అద్భుతంగా ఉంటుంది. ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా అతడితో సినిమా చేయాలని గతంలో అనుకున్నా. దీనికి ‘సర్ధార్నీ’ అనే టైటిల్‌ ఫిక్స్‌ చేశా. ఇందులో యాక్ట్‌ చేయడానికి ప్రియాంక అంగీకరించారు. అయితే, అదే సమయంలో ఆమెకు హాలీవుడ్‌ నుంచి ‘క్వాంటికో’ ఆఫర్‌ వచ్చింది. ఆ షూట్‌ను దృష్టిలో ఉంచుకుని మమ్మల్ని కొంతకాలం వేచి ఉండాలని కోరారు. మేము దానికి అంగీకరించి.. ఎదురుచూశాం. ఆమె మాత్రం ‘క్వాంటికో 2’కు సంతకం చేశారు. ఆ తర్వాత ప్రియాంకకు అక్కడ వరుసగా అవకాశాలు వచ్చాయి. దీంతో ఆమె అక్కడే సెటిల్‌ కావాలని నిర్ణయించుకున్నారు. చేసేది లేక మా ప్రాజెక్ట్‌ నిలిపివేశాం’’ అని బోనీకపూర్‌ తెలిపారు.

అనంతరం ఆయన బరువు తగ్గడం గురించి మాట్లాడుతూ.. ‘‘గడిచిన ఎనిమిది నెలల్లో సుమారు 15 కేజీల బరువు తగ్గాను. ఆరోగ్యకరమైన ఆహారాన్ని మాత్రమే తింటున్నాను. సమయానికి నిద్రపోతున్నా. ఇప్పుడు నేను హెల్త్‌ పట్ల శ్రద్ధ తీసుకుంటున్నా. నా నలుగురు పిల్లలు ప్రతిరోజూ నాకు ఫోన్‌ చేస్తుంటారు. టైమ్‌కి అన్ని చేస్తున్నానా? లేదా? అని చెక్‌ చేస్తున్నారు’’ అని చెప్పారు.

భారత ప్రముఖ ఫుట్‌బాల్‌ కోచ్‌ సయ్యద్‌ అబ్దుల్‌ రహీమ్‌ జీవితాన్ని ఆధారంగా చేసుకుని ‘మైదాన్‌’ను తీర్చిదిద్దారు. అమిత్‌ శర్మ దర్శకుడు. అజయ్‌ దేవ్‌గణ్‌ ప్రధాన పాత్ర పోషించారు. అబ్దుల్‌ రహీమ్‌ సతీమణిగా ప్రియమణి నటించారు. జీ స్టూడియోస్‌, బోనీకపూర్‌ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి. అబ్దుల్‌ రహీమ్‌ పాత్రలో నటించడం గర్వంగా ఉందని అజయ్‌ గతంలో జరిగిన ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. గురువారం ఈ చిత్రం విడుదలైంది. అజయ్‌ నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని