Akhanda2: ‘అఖండ2’ కాన్సెప్ట్‌ ఇదే.. హిట్‌ సినిమా సీక్వెల్‌పై బోయపాటి కామెంట్స్‌..

‘అఖండ2’లో సమాజానికి ఉపయోగపడే అంశాలన్నీ ఉంటాయని బోయపాటి శ్రీను అన్నారు.

Published : 16 Apr 2024 12:03 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: బోయపాటి-బాలకృష్ణ (Balakrishna) సినిమా వస్తుందంటే మాస్‌ ప్రేక్షకులకు పండగే. వీళ్లిద్దరి కాంబోలో వచ్చిన ‘సింహ’, ‘లెజెండ్‌’, ‘అఖండ’.. మూడు చిత్రాలు బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాయి. 2021లో ప్రేక్షకుల ముందుకొచ్చిన ‘అఖండ’ బాలయ్య కెరీర్‌లోనే బిగ్గెస్ట్‌ హిట్‌ల జాబితాలో చేరింది. దీంతో వీళ్లిద్దరి తర్వాత ప్రాజెక్ట్‌పై సినీ ప్రియుల్లో ఆసక్తి నెలకొంది.

తాజాగా దీనిపై బోయపాటి శ్రీను మాట్లాడారు. ‘ప్రస్తుతం ఎన్నికల హడావిడి ఉంది. ఇవి పూర్తయ్యాక ‘అఖండ2’ పై అధికారిక ప్రకటన ఉంటుంది. ‘అఖండ’లో పసిబిడ్డ.. ప్రకృతి.. పరమాత్మ.. కాన్సెప్ట్‌లనే చూపించాం. దీని సీక్వెల్‌లోనూ సమాజానికి కావాల్సిన ఓ మంచి విషయం ఉంటుంది. దైవత్వం మనందరిలో ఒక భాగం. దాన్ని తెరపై చూపిస్తే ప్రేక్షకులు ఆదరిస్తారు’ అని తెలిపారు. ఇప్పటికే దీని స్క్రిప్ట్‌ వర్క్‌ ప్రారంభమైనట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం బాబీ (Bobby)దర్శకత్వంలో బాలకృష్ణ ఓ ప్రాజెక్ట్‌ చేస్తున్నారు. శరవేగంగా దీని షూటింగ్‌ జరుగుతోంది. ఇటీవల దీనికి సంబంధించిన ప్రత్యేక వీడియోను విడుదల చేయగా భారీ ప్రేక్షకాదరణ వచ్చింది. తమన్‌ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్‌ నటుడు బాబీ దేవోల్‌ ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. మాస్‌ యాక్షన్‌ కథాంశంతో రూపొందుతున్న ఈ సినిమాలో బాలయ్య రెండు కోణాలున్న పాత్రలో కనువిందు చేయనున్నట్లు తెలుస్తోంది. చాలా సంవత్సరాల తర్వాత ఆయన క్లాస్‌ లుక్‌లో కనిపించనున్నారట. అలాగే దీనిలో పొలిటికల్‌ బ్యాక్‌డ్రాప్‌ నేపథ్యం ఉంటుందని టాక్‌. ఇందులో మలయాళం అగ్ర హీరో కూడా నటిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని