Bramayugam: మలయాళంలో హిట్‌ టాక్‌.. తెలుగులో విడుదల ఆ రోజేనా?

Bramayugam: మమ్ముట్టి నటించిన ‘భ్రమయుగం’ మలయాళంలో హిట్‌ టాక్‌ను అందుకుంది. దీంతో ఇతర భాషల్లో విడుదల చేసేందుకు మేకర్స్‌ రెడీ అవుతున్నారు.

Updated : 17 Feb 2024 11:28 IST

హైదరాబాద్‌: మలయాళ అగ్ర కథానాయకుడు మమ్ముట్టి (Mammootty) కీలక పాత్రలో నటించిన పీరియాడిక్‌ హారర్‌ థ్రిల్లర్‌ ‘భ్రమయుగం’ (Bramayugam). ఈ వారం మలయాళంలో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద మంచి టాక్‌ను సొంతం చేసుకుంది. మమ్ముట్టి వైవిధ్యమైన నటన, దర్శకుడు రాహుల్‌ సదాశివన్‌ టేకింగ్‌ సినిమాను మరోస్థాయికి తీసుకెళ్లాయంటూ అటు ప్రేక్షకులు, ఇటు సినీ విమర్శకులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ క్రమంలో తెలుగు వెర్షన్‌ ఎప్పుడు విడుదల చేస్తారా? అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

తొలుత అనుకున్న షెడ్యూల్‌ ప్రకారం ఫిబ్రవరి 15నే మలయాళంతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో విడుదల చేయాల్సి ఉంది. అయితే, సాంకేతిక సమస్యలు, డబ్బింగ్‌ వెర్షన్స్‌కు సంబంధించిన సెన్సార్‌షిప్‌ పూర్తవకపోవడం వల్ల సినిమా విడుదల వాయిదా వేశారు. ఇప్పుడు మలయాళంలో హిట్‌ టాక్‌ తెచ్చుకోవడంతో వీలైనంత త్వరగా ఇతర భాషల్లోనూ సినిమాను విడుదల చేయాలని మేకర్స్‌ చూస్తున్నారు. అందుకు సంబంధించిన అంశాలను దర్శకుడు రాహుల్‌ సదాశివన్‌ క్లియర్‌ చేసే పనిలో ఉన్నారు. ఫిబ్రవరి 22 లేదా 23 తేదీల్లో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే అవకాశం ఉంది. ఇక ఈ సినిమా మలయాళంలో తొలి రోజు రూ.3 కోట్లు వసూలు చేసింది. సినిమాకు హిట్‌ టాక్‌ రావడం, శని, ఆదివారాలు వీకెండ్‌ కావడంతో కేరళ వ్యాప్తంగా అదనపు స్క్రీనింగ్‌ ఏర్పాటు చేశారు. కొత్తగా మరో వంద స్క్రీన్‌లలో సినిమాను ప్రదర్శించేందుకు ఏర్పాట్లు చేశారు. అన్నట్లు ‘భ్రమయుగం’ ఓటీటీ రైట్స్‌ను సోనీలివ్‌ దక్కించుకుంది. థియేట్రికల్‌ రన్‌ ముగిసిన తర్వాత ఏడెనిమిది వారాలకు సినిమాను ఓటీటీలో విడుదల చేయనున్నారు.

ఇంతకీ భ్రమయుగం కథేంటో తెలుసా: తేవన్‌ (అర్జున్‌ అశోకన్‌) జానపద గాయకుడు. తన తల్లిని కలుసుకునేందుకు వెళ్తూ అడవిలో దారి తప్పిపోతాడు. ఆకలితో తిరుగుతూ చివరకు ఓ పాడుబడిన ఇంటికి చేరుకుంటాడు. ఆ ఇంట్లో మనక్కల్‌ కుడుమోన్‌ పొట్టి (మమ్ముట్టి), అతని కుమారుడు (సిద్ధార్థ్‌ భరతన్‌) మాత్రమే ఉంటారు. చాలా రోజుల తర్వాత ఓ అతిథి తన ఇంటికి రావడంతో కుడుమోన్‌ ఆనందంతో అతడికి అన్ని వసతులు కల్పిస్తాడు. అడవిలో అందునా పాడుపడిన ఇంట్లో ఉన్న పరిస్థితులు చూసి తేవన్‌కు అనుమానం కలుగుతుంది. తాను కుడుమోన్‌ ఉచ్చులో చిక్కుకుపోయానని అతడికి అర్థమవుతుంది. ఆ ఇంటి నుంచి తప్పించుకు పారిపోవాలని ఎన్నిసార్లు ప్రయత్నించినా కుడుమోన్‌ తాంత్రిక విద్య వల్ల తేవన్‌ మళ్లీ, మళ్లీ అక్కడికే వస్తాడు. మరి తేవన్‌ ఆ ఇంటి నుంచి ఎలా బయటపడ్డాడు? ఇంతకీ కుడుమోన్‌ ఎవరు? అన్నది మిగిలిన కథ.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని