Bramayugam: ‘భ్రమయుగం’ ఆఫర్‌.. రూ.150కే టికెట్‌.. మరి మల్టీప్లెక్స్‌లో ఎంతంటే?

మమ్ముట్టి కీలక పాత్రలో నటించిన ‘భ్రమయుగం’ మార్చి 23న తెలుగు రాష్ట్రాల్లో విడుదల కానుంది.

Updated : 21 Feb 2024 18:08 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రేక్షకులను థియేటర్‌కు రప్పించేందుకు ఉన్న అన్ని అవకాశాలను నిర్మాతలు పరిశీలిస్తున్నారు. ఇటీవల ‘హను-మాన్‌’ టికెట్‌ ధరలను తగ్గించి, మరింత మంది థియేటర్‌కు వచ్చేలా నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ‘భ్రమయుగం’ (Bramayugam) కూడా అదే బాటలో పయనిస్తోంది. మమ్ముట్టి (Mammootty ) కీలక పాత్రలో రాహుల్‌ సదాశివన్ రూపొందించిన డార్క్‌ ఫాంటసీ హారర్ థ్రిల్లర్‌ ఇది. ఇప్పటికే మలయాళంలో విడుదలై మంచి టాక్‌ తెచ్చుకున్న ఈ మూవీ మార్చి 23వ తేదీ నుంచి తెలుగు రాష్ట్రాల్లో విడుదల కాబోతోంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ఈ మూవీని విడుదల చేస్తోంది. ఈ క్రమంలో టికెట్‌ ధరలను తగ్గించింది. సింగిల్‌ స్క్రీన్‌ థియేటర్‌లలో రూ.150,  ఎంపిక చేసిన మల్టీప్లెక్స్‌లలో రూ.200లకే టికెట్‌లను కొనుగోలు చేసుకునే అవకాశం కల్పించింది.

మలయాళంలో ‘భ్రమయుగం’ ఇప్పటివరకూ రూ.30 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ క్రమంలో దర్శకుడు రాహుల్‌ సదాశివన్‌ పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ‘‘మమ్ముట్టి లెజెండరీ యాక్టర్‌. ఒకవేళ ఆయన ఈ మూవీలో కుడుమోన్‌ పొట్టి పాత్రను ఒప్పుకోకపోతే, అసలు సినిమానే తీసేవాడిని కాదు. ఆయన సెట్‌లో అడుగుపెట్టగానే కొద్దిసేపు అంతా నిశ్శబ్దమే. మమ్ముట్టి తేజస్సు అలాంటిది. కానీ, మరికాసేపటికే ఆ నిశ్శబ్దాన్ని బద్దలు కొడుతూ సెట్‌ అంతా సందడిగా మారేలా చేసేవారు. కొన్నిసార్లు మేము తీస్తున్నది హారర్‌ మూవీయా? లేక కామెడీ సినిమా అన్నట్లు ఉండేది. పీరియాడిక్‌ ఫిల్మ్‌ కావడంతో సినిమాలో పాత్రల మధ్య వచ్చే సంభాషణలు, వాడే పదాల్లో ఆధునికత కనిపించదు. సినిమా చూస్తున్న ప్రేక్షకులకు ఆ ఇబ్బంది కలగకుండా నటీనటులు వాటిని మరింత మెరుగుపరిచారు. ఇక ఈ విషయంలో మమ్ముట్టి గురించి చెప్పాల్సింది ఏముంది. పాత్రకు తగినట్లు ఆయన మారిపోయేవారు. తనని తాను కొత్తగా ఆవిష్కరించుకునేవారు’’ అని చెప్పుకొచ్చారు. ఈ  చిత్రంలో నటించిన అర్జున్‌ అశోకన్‌ మాట్లాడుతూ.. ‘భ్రమయుగం’ చేయడం ఒక కలలా ఉందని అన్నారు. నేను చదువుకుంటున్న రోజుల్లో మమ్ముట్టి ఫ్యాన్స్‌ అసోసియేషన్‌ సభ్యుడిగా ఉండేవాడినని, అలాంటిది ఆయనతో కలిసి స్క్రీన్‌ షేర్‌ చేసుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు.

ఇంతకీ భ్రమయుగం కథేంటో తెలుసా: తేవన్‌ (అర్జున్‌ అశోకన్‌) జానపద గాయకుడు. తన తల్లిని కలుసుకునేందుకు వెళ్తూ అడవిలో దారి తప్పిపోతాడు. ఆకలితో తిరుగుతూ చివరకు ఓ పాడుబడిన ఇంటికి చేరుకుంటాడు. ఆ ఇంట్లో మనక్కల్‌ కుడుమోన్‌ పొట్టి (మమ్ముట్టి), అతని కుమారుడు (సిద్ధార్థ్‌ భరతన్‌) మాత్రమే ఉంటారు. చాలా రోజుల తర్వాత ఓ అతిథి తన ఇంటికి రావడంతో కుడుమోన్‌ ఆనందంతో అతడికి అన్ని వసతులు కల్పిస్తాడు. అడవిలో అందునా పాడుపడిన ఇంట్లో ఉన్న పరిస్థితులు చూసి తేవన్‌కు అనుమానం కలుగుతుంది. తాను కుడుమోన్‌ ఉచ్చులో చిక్కుకుపోయానని అతడికి అర్థమవుతుంది. ఆ ఇంటి నుంచి తప్పించుకుపారిపోవాలని ఎన్నిసార్లు ప్రయత్నించినా కుడుమోన్‌ తాంత్రిక విద్య వల్ల తేవన్‌ మళ్లీ, మళ్లీ అక్కడికే వస్తాడు. మరి తేవన్‌ ఆ ఇంటి నుంచి ఎలా బయటపడ్డాడు? ఇంతకీ కుడుమోన్‌ ఎవరు? అన్నది మిగిలిన కథ.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని