Chandu Champion: ఎవరికీ లొంగని ఛాంపియన్‌

బాలీవుడ్‌లో ప్రస్తుతం బయోపిక్‌ల హవా నడుస్తోంది. ఇప్పుడీ బాటలోనే మరికొద్ది రోజుల్లో ‘చందు ఛాంపియన్‌’తో ప్రేక్షకులను పలకరించనున్నారు బాలీవుడ్‌ కథానాయకుడు కార్తిక్‌ ఆర్యన్‌.

Updated : 16 May 2024 09:40 IST

బాలీవుడ్‌లో ప్రస్తుతం బయోపిక్‌ల హవా నడుస్తోంది. ఇప్పుడీ బాటలోనే మరికొద్ది రోజుల్లో ‘చందు ఛాంపియన్‌’తో ప్రేక్షకులను పలకరించనున్నారు బాలీవుడ్‌ కథానాయకుడు కార్తిక్‌ ఆర్యన్‌. ఆయన ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రాన్ని కబీర్‌ ఖాన్‌ తెరకెక్కిస్తున్నారు. చిత్రీకరణ పూర్తి చేస్తున్న ఈ సినిమా పోస్ట్‌-ప్రొడక్షన్‌ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. తాజాగా ఈ సినిమాలోని తన ఫస్ట్‌ లుక్‌ను ఇన్‌స్టా వేదికగా విడుదల చేశాడు కార్తిక్‌. ‘‘ఛాంపియన్‌ వచ్చేస్తున్నాడు. నా కెరీర్‌లోనే ఎంతో సవాలుతో కూడిన చిత్రంలోని మొదటి పోస్టర్‌ను మీతో పంచుకుంటున్నందుకు చాలా ఉత్సాహంగా ఉంద’’ని వ్యాఖ్యలు జోడించాడు. ఇందులో కండలు తిరిగిన దేహంతో.. ధృడ సంకల్పంతో ముందుకు సాగుతున్న ఛాంపియన్‌లా కనిపిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు కార్తిక్‌. ‘‘ఎవరికీ లొంగని వ్యక్తి’’ అనే వ్యాఖ్యతో ఉన్న ఈ పోస్టర్‌ సినిమాపై అంచనాలను పెంచుతోంది. సాజిద్‌ నడియాడ్‌వాలా నిర్మిస్తున్న ఈ సినిమా జూన్‌ 14న విడుదల కానుంది.


విల్‌ యాక్షన్‌తో థ్రిల్‌

విత్‌ఔట్‌ రెమోర్స్‌’, ‘సికరియో: డే ఆఫ్‌ ది సోల్డాడో’ లాంటి చిత్రాలతో మంచి విజయాన్ని అందుకున్నారు ఇటాలీయన్‌ దర్శకనిర్మాత స్టెఫానో సొల్లిమా. ఇప్పుడీయన మరో యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘షుగర్‌ బండిట్స్‌’ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. ‘కింగ్‌ రిచర్డ్‌’, ‘అలీ’ సినిమాలో మంచి గుర్తింపు తెచ్చుకున్న విల్‌ స్మిత్‌ ఈ చిత్రంలో ప్రధాన పాత్రలో నటించనున్నారు. ‘ఈ సినిమా చక్‌ హోగన్‌ రాసిన ‘డెవిల్స్‌ ఇన్‌ ఎక్సైల్‌’ రూపొందుతోంది. ఇందులో బోస్టన్‌లోని మాదకద్రవ్యాల వ్యాపారాన్ని మట్టి కరిపించే ప్రత్యేక దళాల మాజీ సైనికుడి పాత్రలో విల్‌ కనిపించనున్నారు’ అని సన్నిహిత వర్గాలు తెలిపాయి. ర్యాన్‌ షిమాజాకి పర్యవేక్షణలో వెస్ట్‌ స్టూడియోస్‌ పతాకంపై జాన్‌ మోనేతో కలిసి విల్‌ స్మిత్‌ నిర్మించనున్నారు.


ఢీకొట్టే.. డేంజర్‌ లంక

డీసీపీ బాజీరావ్‌ సింగమ్‌ పాత్రలో అజయ్‌ దేవగణ్‌ని ఢీకొట్టే ప్రతినాయకుడిగా అర్జున్‌ కపూర్‌ సిద్ధంగా ఉన్నారు. మరి వారు తలపడేది దేని కోసమో తెలియాలంటే ‘సింగమ్‌ అగైన్‌’ చూడాల్సిందే. ఇందులో అక్షయ్‌ కుమార్‌, రణ్‌వీర్‌ సింగ్‌, దీపికా పదుకొణె, కరీనా కపూర్‌ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ని రోహిత్‌ శెట్టి తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈ సినిమాలోని తన పాత్రకు సంబంధించిన చిత్రీకరణను పూర్తిచేసుకున్నారు అర్జున్‌. ఈ విషయాన్ని తెలుపుతూ ఓ ఫొటోని పంచుకున్నారు. ‘రోహిత్‌ శెట్టి కాప్‌ ప్రపంచంలోని విలన్‌ని నేను. ‘సింగమ్‌ అగైన్‌’లో నా వంతు పని ముగిసింది. మాస్‌ సినిమాలకి బాస్‌ అయిన దర్శకుడితో నా 20వ సినిమా చేయడం గర్వంగా ఉంది. ఈ చిత్రం నా కెరీర్‌లో మైలురాయిగా నిలిచిపోతుందని ఆశిస్తున్నాను. భారతీయ సినిమాల్లో అత్యంత వినోదాత్మక ఫ్రాంచైజీలలో ఒకటైన ఈ ప్రాజెక్టులో భాగం కావడం అదృష్టంగా భావిస్తున్నా. త్వరలో వెండితెరపై గర్జించే ‘సింగమ్‌ అగైన్‌’ని మీ ముందుకు తీసుకొచ్చేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను’ అంటూ రాసుకొచ్చారు అర్జున్‌. విలన్‌గా కనిపించే అర్జున్‌ కపూర్‌ పాత్ర పేరు ‘డేంజర్‌ లంక’ అని ప్రచారం సాగుతోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని