ఎవరికీ తలవంచని మేరు పర్వతం దివికేగింది.. రామోజీరావుకు సినీ ప్రముఖుల నివాళి

ఈనాడు గ్రూప్‌ సంస్థల ఛైర్మన్‌ రామోజీరావు(88) మృతి పట్ల సినీ ప్రముఖులు నివాళులు అర్పించారు.

Updated : 08 Jun 2024 16:08 IST

హైదరాబాద్‌: ఈనాడు గ్రూప్‌ సంస్థల ఛైర్మన్‌ రామోజీరావు(88) మృతి పట్ల సినీ ప్రముఖులు నివాళులు అర్పించారు. సినీ రంగానికి ఆయన చేసిన సేవలను కొనియాడుతూ.. ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్నారు.

 

రామోజీరావు నా జీవితంలో గొప్ప ప్రేరణ, మార్గదర్శకులు

‘‘నా గురువు, శ్రేయోభిలాషి రామోజీరావు మరణవార్త నన్ను ఎంతగానో బాధించింది. జర్నలిజం, సినిమా రంగాల్లో ఆయన చరిత్ర సృష్టించారు. రాజకీయాల్లో ఆయన కింగ్‌ మేకర్‌’’- రజనీకాంత్‌

ఎవరికీ తలవంచని మేరు పర్వతం

‘‘ఎవరికీ తలవంచని మేరు పర్వతం దివికేగింది. ‘ఓం శాంతి’. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి’’-చిరంజీవి

తెలుగు పత్రికా రంగంలో మకుటం లేని మహారాజు

‘‘తెలుగు పత్రికా రంగంలో మకుటం లేని మహారాజు రామోజీరావు. తెలుగు నుడికారానికి ఒక కొత్త కళను తెచ్చారు. జర్నలిజానికి కొత్త సొబగును దిద్దారు. చిత్ర సీమలో అదే తీరున సాగి ఉషోదయ కిరణాలను ప్రసరింపజేశారు. ప్రపంచంలోనే అతిపెద్ద స్టూడియోగా రామోజీ ఫిల్మ్‌ సిటీని తెలుగు నేలపై నెలకొల్పారు. ఏది చేసినా తనదైన బాణీ కల్పిస్తూ సాగిన రామోజీరావు ఇక లేరు అన్న వార్త ఆవేదన కలిగిస్తోంది. మా తండ్రి నందమూరి తారక రామారావు గారితో ఆయన అనుబంధం ప్రత్యేకమైనది’’-బాలకృష్ణ

నూటికో కోటికో ఒకరు

‘‘మీడియా సామ్రాజ్యాధినేత రామోజీరావు లేని లోటు ఎప్పటికీ పూడ్చలేనిది. ఆయన మన మధ్య ఇకలేరు అనే వార్త బాధాకరం. ‘నిన్ను చూడాలని’తో నన్ను తెలుగు సినిమా పరిశ్రమకి పరిచయం చేసినప్పటి జ్ఞాపకాలు ఎప్పటికీ మరువలేను. ఆ మహనీయుడి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ, వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి’’- ఎన్టీఆర్‌ 

ఎంతో ముందు చూపు ఉన్న గొప్ప వ్యక్తి..

‘‘ఎంతో ముందు చూపు ఉన్న గొప్ప వ్యక్తి రామోజీరావు. ఆయన మృతి ఎంతో బాధ కలిగిస్తోంది. సినిమాపై ఆయనకున్న అభిరుచికి రామోజీ ఫిల్మ్‌ సిటీ ఓ నిదర్శనం. ఆయన మనందరికీ స్ఫూర్తి. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ వారి కుటుంబానికి సానుభూతి తెలియచేస్తున్నాను’’- మహేశ్‌ బాబు

జర్నలిజం రంగం దశదిశను మార్చారు

‘‘రామోజీరావు మరణం తీరని లోటు. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభతిని తెలుపుతున్నా. రామోజీరావు ఆత్మకు శాంతి చేకూరాలి’’-రవితేజ

ఆయన సేవలు మరువలేనివి

‘‘నేను గౌరవించే స్ఫూర్తిదాయక వ్యక్తుల్లో ఆయన ఒకరు. మీడియా, సినిమా, ఇతర రంగాలకు ఆయన చేసిన సేవలు మరువలేనివి. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా’’-అల్లు అర్జున్‌

రామోజీకి భారతరత్న సముచిత గౌరవం

‘‘ఒక మనిషి అనేక రంగాల్లో వివిధ సంస్థలు స్థాపించి వాటిని ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లారు. ఎంతోమందికి మార్గదర్శకంగా నిలిచారు. మరెంతో మందికి ఉపాధి కల్పించారు. అలాంటి వ్యక్తికి భారతరత్న ఇవ్వడమే సముచితమని రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నా’’- దర్శకుడు రాజమౌళి

తెలుగువారి చరిత్రలో ఒక అధ్యాయం ముగిసింది

‘‘రామోజీ రావు మృతితో తెలుగువారి చరిత్రలో ఒక అధ్యాయం ముగిసింది. నన్ను అత్యంత ప్రేమించిన వ్యక్తి రామోజీరావు’’- రాజేంద్రప్రసాద్‌

ఆయనతో మాట్లాడితే ఎంతో ఎనర్జీ వచ్చేది

‘‘శ్రీవారికి ప్రేమలేఖ’ నుంచి ఆయనతో నా అనుబంధం ప్రారంభమైంది. 40ఏళ్ల సుదీర్ఘ ప్రయాణం. నాకు మానసికంగా నాలుగు స్తంభాలు.. అమ్మ, కృష్ణగారు, జంధ్యాలగారు, రామోజీరావుగారు. నాకు ఎనర్జీ కావాలనుకున్నప్పుడు ఆయనతో మాట్లాడితే ఎక్కడలేని శక్తి వచ్చేది. ప్రపంచ సినిమా ఇక్కడకు తీసుకురావాలని రామోజీ ఫిల్మ్‌సిటీ నిర్మించారు. ఇండియాలో యూనివర్సల్‌ స్టూడియో నిర్మించిన గొప్ప వ్యక్తి. ఆయన ఆత్మకు శాంతి కలగాలని, వాళ్ల కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా’’ - సినీ నటుడు నరేష్‌

నాలాంటి ఎంతో మంది నటులను పరిచయం చేశారు

‘‘తొలి చూపులోనే’ సినిమాతోనే నా సినీ ప్రస్థానం మొదలైంది. నాలాగే ఎంతో మంది సినీతారలకు అవకాశం ఇచ్చారు. టెలివిజన్‌లోనూ రచయితలు, నటులను పరిచయం చేశారు. ఈనాడు, ఈటీవీల ద్వారా నమ్మకమైన వార్తలను అందించిన వ్యక్తి. సినిమా ఇండస్ట్రీకి రామోజీ ఫిల్మ్‌ సిటీ గొప్ప ఆస్తి. ఏ షూటింగ్‌ అయినా సులభంగా ఇక్కడ జరిగిపోతుంది. ఆయన మరణం కలచివేస్తోంది. ఆయన కుటుంబ సభ్యులకు ధైర్యం ప్రసాదించాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నా’’-నందమూరి కల్యాణ్‌రామ్‌

ఎంతో మందికి జీవితాలను ఇచ్చారు

‘‘రామోజీ ఫిల్మ్ సిటీని వరల్డ్ నెం.1 చేయాలన్నది ఆయన కోరిక. ఎన్నో సంస్థలతో ఎంతో మందికి జీవితాలను ఇచ్చారు. నేను ఎప్పుడు వచ్చినా ఆప్యాయంగా పలకరించేవారు. మహోన్నత వ్యక్తి రామోజీరావుగారు’’- మురళీ మోహన్‌

మహోన్నత వ్యక్తిని కోల్పోయాం

‘‘నేనెప్పుడూ చెబుతూ ఉంటా. అలెగ్జాండర్‌ ది గ్రేట్‌.. రామోజీ ది గ్రేట్‌. ఎంతో మందికి ఉపాధి కల్పించిన గొప్ప వ్యక్తి. నేను, రాజ్‌ ఉషాకిరణ్‌ మూవీస్‌ బ్యానర్‌లో చిత్రాలకు పనిచేశాం. ‘నువ్వే కావాలి’ చిత్రానికి సోలోగా అవకాశం ఇచ్చారు. సిల్వర్‌ జూబ్లీ ఫంక్షన్‌ రోజున నన్ను ఎంతో మెచ్చుకుని ఆశీర్వదించారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నా’’ - సంగీత దర్శకుడు కోటి

రామోజీరావు నాకు స్ఫూర్తి

‘‘రామోజీరావు నాకు ఎంతో స్ఫూర్తి. సొంత వ్యక్తిత్వంతోనే జీవించాలన్నది ఆయనను చూసే నేర్చుకున్నా. ప్రతి ఒక్కరూ నాయకత్వ లక్షణాలు ఆయన నుంచే నేర్చుకోవాలి. ఆయన మార్గంలో పయనిస్తే ఉన్నత శిఖరాలను చేరుకోవచ్చు. రామోజీరావుతో మాట్లాడి బయటకు వస్తే తెలియని శక్తి వచ్చేది.
ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా’’ - నిర్మాత సురేశ్‌బాబు

గొప్ప వ్యక్తి మనకు దూరమైపోయారు

‘‘ఒక మహానుభావుడిని మేం కోల్పోయాం. స్టూడియో కట్టేటప్పుడు కూడా మమ్మల్ని పిలిచి సలహాలు అడిగేవారు. అలాంటి గొప్ప వ్యక్తి మాకు దూరమైపోయారు. మయూరి డిస్ట్రిబ్యూషన్‌ ద్వారా చాలా సినిమాలు విడుదల చేశాం’’- సినీ దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి

రామోజీ ప్రజల మనిషి

‘‘రామోజీరావుగారితో నాకు 43 ఏళ్ల అనుబంధం ఉంది. కలిసినప్పుడల్లా ఎన్నో మంచి విషయాలు పంచుకునేవారు. క్రమశిక్షణతో ఎలా ఉండాలో చెప్పేవారు. తాను ప్రజల మనిషినని, వారి కోసమే బతుకుతున్నానని చెప్పేవారు. ప్రజల కష్టసుఖాలు తెలుసుకుని తనవంతు ఏం చేయగలరో చెప్పేవారు. ఆయన మరణం తెలుగువారికి తీరనిలోటు. ఇలాంటి స్టూడియోను నిర్మించటం ఒక్కడి వల్ల కాదు. కానీ, ఆయన స్థాపించి చూపించారు’’ -మోహన్‌బాబు

లక్షలాది కుటుంబాలకు అన్నం పెట్టారు..

‘‘కీర్తిని మాత్రమే వదిలేసి రామోజీ స్వర్గస్తులయ్యారు. మనవల్ల, మనం స్థాపించిన సంస్థల వల్ల పది మందికి ఉపాధి కల్పించడమన్నది సామాన్యమైన విషయం కాదు. లక్షలాది కుటుంబాలకు ఆయన అన్నం పెట్టారు. ఆ కీర్తిని మించింది లేదు. ఆయన మేరు పర్వతం. కారణ జన్ముడు. రామోజీరావు గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆయన సంస్థలో ఐదు సినిమాలు, ఒక వెబ్‌సిరీస్‌ చేశా. ఆయన చూపిన బాటలో నడుస్తూ పది మందికి సాయపడటమే మనం చేయాల్సింది’’ - నటుడు శివాజీ

దూరదృష్టి ఉన్న వ్యక్తి..

ఈనాడు గ్రూప్‌ ఛైర్మన్ రామోజీరావు మరణవార్త విని చాలా బాధపడ్డాను. రామోజీ ఫిల్మ్‌ సిటీ ఓ అద్భుతం. అది షూటింగ్‌ లొకేషన్‌ మాత్రమే కాదు.. ప్రముఖ పర్యాటక కేంద్రంగా కూడా ఆదరణ పొందుతోంది. అంత దూరదృష్టి, వినూత్న ఆలోచనాపరుడు మరణించడం భారతీయ సినీ పరిశ్రమకు తీరని లోటు. వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి - కమల్‌ హాసన్‌

ప్రతి రంగంలో విజయాలు అందుకున్నారు..

రామోజీరావు గొప్ప దార్శనికుడు, ఎంచుకున్న ప్రతి రంగంలోనూ విజయాలను అందుకున్నారు. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నా - నాగార్జున

ఈటీవీ, ఈనాడు, రామోజీ ఫిల్మ్‌ సిటీ, ఉషాకిరణ్‌ మూవీస్‌.. ఇలా ప్రతి చోట రామోజీ రావు జీవించే ఉంటారు. ఆయన ఓ లెజెండ్ - నాని

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని