Chiranjeevi: ‘శక్తి’ బ్యాండ్‌కు చిరంజీవి విషెస్‌.. తండ్రిని తలచుకుంటూ వేణు ఎమోషనల్‌ పోస్ట్‌

సోషల్‌ మీడియా వేదికగా ప్రముఖ హీరో చిరంజీవి.. ‘గ్రామీ’ విజేతలకు విషెస్‌ చెప్పారు. నటుడు, దర్శకుడు వేణు యెల్దండి తన తండ్రిని తలచుకున్నారు.

Published : 08 Feb 2024 22:32 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: గ్రామీ అవార్డు (Grammy Awards) సొంతం చేసుకున్న ‘శక్తి’ (Shakti) బ్యాండ్‌కు టాలీవుడ్‌ అగ్ర హీరో చిరంజీవి (Chiranjeevi) శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ‘ఎక్స్‌’లో పోస్ట్‌ పెట్టారు. ‘‘గ్రామీ’ వేదికపై భారత జెండా రెపరెపలాడింది. ‘గ్లోబల్‌ మ్యూజిక్‌ ఆల్బమ్‌ ఆఫ్‌ ఇది ఇయర్‌’ అవార్డు అందుకున్న ‘శక్తి’ టీమ్‌కు అభినందనలు. జాకిర్‌ హుస్సేన్‌ (Jakir Hussain), శంకర్‌ మహదేవన్‌ (Shankar Mahadevan), సెల్వ గణేశ్‌, గణేశ్‌ రాజగోపాలన్.. మీరంతా మేం గర్వపడేలా చేశారు. మీ విజయం భారతీయులకు స్ఫూర్తి. శంకర్‌ మహదేవన్‌తో నాకు పరిచయం ఉండడం ఆనందంగా ఉంది. నేను నటించిన పలు చిత్రాల్లో ఆయన మంచి పాటలు పాడారు’’ అని పేర్కొన్నారు.

సంగీత ప్రపంచంలో ప్రతిష్ఠాత్మకంగా భావించే అవార్డుల్లో ‘గ్రామీ’ ఒకటి. కొన్ని రోజుల క్రితం.. అమెరికాలో 66వ గ్రామీ అవార్డుల ప్రదానోత్సహం అట్టహాసంగా జరిగింది. ‘శక్తి బ్యాండ్‌’ కంపోజ్‌ చేసిన ‘దిస్‌ మూమెంట్‌’ (This Moment) పురస్కారాన్ని సొంతం చేసుకుంది. ఈ పాటను జాన్‌ మెక్‌లాఫ్లిన్‌ (గిటార్‌), జాకిర్‌ హుస్సేన్‌ (తబలా), శంకర్‌ మహదేవన్‌(సింగర్‌), గణేశ్‌ రాజగోపాలన్‌ (వయోలిన్‌)సహా ఎనిమిది మంది రూపొందించారు.

అందరూ చూశారు నాన్న తప్ప..: వేణు

పలు సినిమాల్లో నటుడిగా నవ్వులు పంచి, ‘బలగం’ (Balagam)తో దర్శకుడిగా మారారు వేణు యెల్డండి (Venu Yeldandi). తొలి ప్రయత్నంలోనే మంచి విజయాన్ని అందుకున్నారు. ఆ సక్సెస్‌ను తన తండ్రి చూడలేకపోయారంటూ భావోద్వేగానికి గురయ్యారు. ‘‘నా బలగం సినిమా అందరూ చూశారు. మా నాన్న తప్ప. మిస్‌ యూ నాన్న’’ అంటూ సోషల్‌ మీడియాలో ఎమోషనల్‌ పోస్ట్‌ పెట్టారు. తండ్రి వర్ధంతి సందర్భంగా ఆయన్ను తలచుకున్నారు. తదుపరి సినిమా ప్రీ ప్రొడక్షన్‌ పనుల్లో బిజీగా ఉన్నారు వేణు. ఆ చిత్రంలో నాని హీరోగా నటించే అవకాశాలున్నాయంటూ సినీ వర్గాల్లో టాక్‌ వినిపిస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని