Chiranjeevi: ‘విశ్వంభర’కు చిరు విరామం.. లేటెస్ట్‌ అప్‌డేట్ ఇదే!

Vishwambhara: అగ్ర కథానాయకుడు చిరంజీవి ‘విశ్వంభర’ షూటింగ్‌ నుంచి కాస్త విరామం తీసుకున్నారు.

Published : 14 Feb 2024 12:47 IST

హైదరాబాద్‌: చిరంజీవి (Chiranjeevi) కథానాయకుడిగా వశిష్ఠ దర్శకత్వంలో రూపొందుతున్న సోషియో ఫాంటసీ మూవీ ‘విశ్వంభర’ (Vishwambhara). శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటున్న ఈ మూవీ కోసం 13 భారీ సెట్‌లతో ఓ ప్రత్యేక ప్రపంచాన్ని సృష్టించారు. యాక్షన్‌ సీన్స్‌ కోసం రామోజీ ఫిల్మ్‌ సిటీలో భారీ సెట్స్‌ నిర్మిస్తున్నారు. ఇటీవల జరిగిన షెడ్యూల్‌లో చిరంజీవి, త్రిష ఇతర నటీనటులపై కీలక సన్నివేశాలు తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సినిమా నుంచి చిరంజీవి కాస్త విరామం తీసుకున్నారు. కుటుంబంతో కలిసి అమెరికా వెళ్తున్నట్లు తెలిపారు. తిరిగి రాగానే షూటింగ్‌లో పాల్గొననున్నట్లు తెలిపారు.

‘‘నా భార్య సురేఖతో కలిసి అమెరికా వెళ్తున్నా. నేను అక్కడి నుంచి తిరిగిరాగానే ‘విశ్వంభర’ చిత్రీకరణలో పాల్గొంటా. అందరికీ వాలంటైన్‌డే శుభాకాంక్షలు.. ప్రేమతో..’’అంటూ ట్వీట్ చేశారు. వచ్చే సంక్రాంతికి విడుదల చేయాలన్న లక్ష్యంతో చిత్ర బృందం తీవ్రంగా శ్రమిస్తోంది. ఇప్పటికే మారేడుమిల్లి అడవుల్లో కొన్ని థ్రిల్లింగ్‌ సన్నివేశాలను తెరకెక్కించారు. చిరంజీవి నటిస్తోన్న 156వ చిత్రం కావడంతో, సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అంతేకాకుండా, 18 ఏళ్ల తర్వాత చిరు- త్రిషలు కలిసి నటిస్తున్నారు. విజువల్‌ ఎఫెక్ట్స్‌కి ప్రాధాన్యం ఇస్తూ రూపొందిస్తున్న ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

‘విశ్వంభర’కు భారీ బడ్జెట్‌

ఇప్పటివరకూ చిరంజీవి నటించిన సినిమాలతో పోలిస్తే, అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానంతో ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. అంతేకాదు, దాదాపు రూ.200 కోట్ల భారీ బడ్జెట్‌తో ‘విశ్వంభర’ తీర్చిదిద్దుతున్నట్లు టాక్‌. చిరంజీవి కెరీర్‌లోనే అత్యధిక బడ్జెట్‌తో రూపొందుతున్న సినిమాగా ఇది నిలిచిపోనుంది. అంతేకాదు, సోషియో ఫాంటసీ మూవీ కావడంతో వీఎఫ్‌ఎక్స్‌పై ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నట్లు సమాచారం. ‘బింబిసార’తో అందరి దృష్టి ఆకర్షించిన వశిష్ఠ ఈ మూవీని ప్రతిష్టాత్మకంగా తీర్చిదిద్దుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు