Ram charan: జాన్వీతో రామ్‌ చరణ్‌ సినిమా.. ఏడేళ్ల క్రితమే కోరిక బయటపెట్టిన చిరంజీవి

రామ్ చరణ్‌- జాన్వీ కపూర్‌ కలిసి సినిమా చేయాలని చిరంజీవి ఏడేళ్ల క్రితమే కోరుకున్నారు. గతంలో ఓ ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాన్ని బయటపెట్టారు.

Updated : 27 Mar 2024 20:55 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: స్టార్‌ హీరో రామ్ చరణ్‌ వరుస సినిమాలతో అలరించేందుకు సిద్ధమయ్యారు. బుచ్చిబాబు దర్శకత్వంలో ఓ సినిమా లైనప్‌లో ఉన్న విషయం తెలిసిందే. అందులో చరణ్‌ సరసన జాన్వీ కపూర్‌ (Janhvi Kapoor) నటించనున్నారు. ఇటీవల జరిగిన పూజా కార్యక్రమంలో వీళ్లిద్దరినీ చూసి అభిమానులు తెగ ఖుషీ అయ్యారు. అయితే, వీళ్లిద్దరూ కలిసి నటించాలని ఏడేళ్ల క్రితమే చిరంజీవి కోరుకున్నారు. 

నేడు రామ్‌ చరణ్‌ పుట్టినరోజు సందర్భంగా అభిమానులు ఆయనకు సంబంధించిన ఆసక్తికర విషయాలను షేర్‌ చేస్తున్నారు. ఇందులోభాగంగానే గతంలో చిరంజీవి, రామ్ చరణ్‌లు వారి సినిమాలపై చేసిన వ్యాఖ్యలు బయటకు వచ్చాయి. నిహారిక వ్యాఖ్యతగా 2017లో వచ్చిన ఓ ఇంటర్వ్యూలో వీళ్లిద్దరూ పాల్గొన్నారు. చిరంజీవి (Chiranjeevi) నటించిన ఏ సినిమా రీమేక్‌ చేయాలని కోరుకుంటున్నారని రామ్‌ చరణ్‌ను (Ram Charan) అడగ్గా.. ఆయన వెంటనే ‘గ్యాంగ్‌ లీడర్‌’ అని సమాధానం చెప్పారు. అప్పుడు చిరంజీవి మాట్లాడుతూ.. ‘‘నేను నటించిన ‘జగదేకవీరుడు అతిలోక సుందరి’ చరణ్ రీమేక్ చేయాలని నా కోరిక. శ్రీదేవి కూతురు జాన్వీకపూర్‌తో కలిసి చేస్తే బాగుంటుంది’ అన్నారు. ఏడేళ్ల క్రితం ఆయన చెప్పిన మాట ఇప్పుడు నిజమైంది.

ఇక రామ్ చరణ్- బుచ్చిబాబు సినిమా విషయానికొస్తే.. ప్రస్తుతం దీని ప్రీ ప్రొడక్షన్‌ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. మాస్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనున్న ఈ చిత్రానికి ‘పెద్ది’ (#RC16) అనే పేరును ఖరారు చేసినట్లు తెలుస్తోంది. కోలీవుడ్ స్టార్‌ హీరో విజయ్‌ సేతుపతి ఇందులో విలన్‌గా కనిపించనున్నట్లు సమాచారం. గతంలో ఈ ప్రాజెక్ట్‌ గురించి దర్శకుడు బుచ్చిబాబు మాట్లాడుతూ.. ‘‘అందరూ ఇది స్పోర్ట్స్‌ డ్రామా అనుకుంటున్నారు. కానీ వాళ్లందరి అంచనాలకు మించి ఉంటుంది. నేను ఈ ప్రాజెక్ట్‌ కోసం నాలుగు సంవత్సరాలుగా వర్క్‌ చేస్తున్నాను. రా అండ్‌ రస్టిక్‌గా ఉంటుంది. దీనికి ఏఆర్‌ రెహమాన్‌ సంగీతం అందిస్తున్నారు’’ అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని