Chiranjeevi: ఆమె మాట నాకు వెయ్యి ఏనుగుల బలాన్నిచ్చింది.. : చిరంజీవి

మహానటి సావిత్రి సినీ ప్రస్థానంపై సంజయ్‌ కిషోర్‌ రచించిన ‘సావిత్రి క్లాసిక్స్‌’ (Savitri Classics) పుస్తకాన్ని ప్రముఖ నటుడు చిరంజీవి (Chiranjeevi) ఆవిష్కరించారు.

Updated : 04 Apr 2024 13:14 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: మహానటి సావిత్రి సినీ ప్రస్థానంపై సంజయ్‌ కిషోర్‌ రచించిన పుస్తకం ‘సావిత్రి క్లాసిక్స్‌’ (Savitri Classics). అగ్ర కథానాయకుడు చిరంజీవి మంగళవారం సాయంత్రం దీనిని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమెతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు.

‘‘సావిత్రమ్మ గురించి నాకు తెలిసింది చాలా తక్కువ. ఆమెతో మంచి అనుబంధం ఉన్నందుకు గర్వపడుతున్నాను. ‘పునాదిరాళ్లు’లో నాకు అవకాశం కాకతాళీయంగా వచ్చింది. ఫిల్మ్‌ ఇన్‌స్టిట్యూట్‌లో కోర్సు పూర్తి కాకుండానే నటించా. ఆ సినిమా కోసం రాజమండ్రి వెళ్తున్నప్పుడు.. నువ్వు సావిత్రమ్మ సినిమాలో నటిస్తున్నావని చెప్పడంతో సంతోషపడ్డాను. చిత్రీకరణకు ముందు ఆమెను చూశాను. ఓసారి నేను డ్యాన్స్‌ చేస్తూ కిందపడ్డా. అయినా సరే ఆపలేదు. అది చూసిన ఆమె.. ‘భవిష్యత్తులో మంచి నటుడివి అవుతావు’ అని మెచ్చుకున్నారు. ఆ మాట నాకు వెయ్యి ఏనుగుల బలాన్ని ఇచ్చింది. కొన్నేళ్ల తర్వాత ‘ప్రేమ తరంగాలు’ కోసం పనిచేశాం. ఆమె నాకు తల్లిగా నటించారు. ఆ తర్వాత ఆమెతో నటించే అవకాశం రాలేదు. కళ్లతోనే హావభావాలు పలికించే గొప్ప నటి. ప్రపంచంలో ఆమెలా మరెవ్వరూ చేయలేరు. మా నాన్న అభిమాన నటి. అనుక్షణం ఆమెను ఆరాధిస్తుంటా’’ అని చిరంజీవి అన్నారు.

అనంతరం సావిత్రి కుమార్తె చాముండేశ్వరి మాట్లాడుతూ.. ‘‘చిరంజీవి నాకు అన్నలాంటి వ్యక్తి. అమ్మకు ఒక పెద్ద కొడుకు ఉంటే ఏం చేస్తారో ఈరోజు ఆయన అదే చేశారు. పుస్తకావిష్కరణ నిమిత్తం కొన్ని రోజుల క్రితం ఇంటికి వెళ్లి ఆయన్ని కలిశా. ఆయన ఇంట్లోనే పుస్తకం విడుదల చేద్దామని చెప్పా. కానీ, ఆయన మాత్రం ఫంక్షన్‌ చేయాలని ప్లాన్‌ చేశారు. ఇంతమంది సమక్షంలో దీనిని విడుదల చేస్తున్నందుకు ఆనందంగా ఉంది’’ అని చెప్పారు.  ఇదే కార్యక్రమంలో చిరంజీవి సతీమణి సురేఖ పాల్గొన్నారు. సురేఖ అడిగిన పలు ప్రశ్నలకు చాముండేశ్వరి సమాధానమిచ్చారు.

అమ్మ జీవితాన్ని ఆధారంగా చేసుకుని ఇప్పటికే పలు చిత్రాలు, పుస్తకాలు వచ్చాయి. ‘సావిత్రి క్లాసిక్స్‌’ తీసుకురావాలని ఎందుకు అనిపించింది?

చాముండేశ్వరి: ‘మహానటి’ గొప్ప విజయాన్ని అందుకుంది. నేటితరం యువత కూడా అమ్మ గురించి గొప్పగా చెబుతున్నారంటే ఆ సినిమా వల్లే సాధ్యమైంది. అమ్మ బాల్యం, సినిమా కెరీర్‌, సేవలు, మరణం ఇలా అన్నీ చూపించారు. ఆమె ఫిల్మోగ్రఫీపై ఒక పుస్తకం ఉండాలని భావించా. అలా వచ్చిందే ఈ పుస్తకం. ఇందులో కేవలం ఆమె యాక్టింగ్‌కు సంబంధించిన విషయాలు మాత్రమే ఉంటాయి.

ఇండస్ట్రీలో ఎంతోమంది అగ్ర నటీనటులు, దర్శకులు ఉండగా.. ఈయనతోనే (చిరంజీవి) విడుదల చేయించాలని ఎందుకు అనుకున్నావు?

చాముండేశ్వరీ: కొంతమంది చెప్పే మాటలకు, చేసే పనులకు సంబంధం ఉండదు. చిరంజీవి అలా కాదు. ఆయన మాటలు, చేతల్లో నిజాయతీ ఉంటుంది. అమ్మకు ఆయన ఎంతటి వీరాభిమానో నాకు తెలుసు. అందుకే ఆయనతో రిలీజ్‌ చేయించాలనుకున్నా.

చిన్నతనంలో అమ్మతో టైమ్‌ స్పెండ్‌ చేయడానికి వీలు ఉండేదా?

చాముండేశ్వరీ: స్కూల్‌ రోజుల్లో పేరెంట్స్‌ మీట్‌కు రావడానికి ఆమెకు ఖాళీ ఉండేది కాదు. అన్నం తినిపించడం, స్కూల్‌కు రెడీ చేయడం ఇలా.. చిన్నప్పుడు మా పనులన్నీ అమ్మమ్మ చేసేవారు. షూటింగ్స్‌లో ఎంత బిజీగా ఉన్నా అమ్మ మాకంటూ టైమ్‌ ఇవ్వడానికి చూసేవారు. షూట్‌ నుంచి ఇంటికి రాగానే నన్ను తీసుకువెళ్లి.. తన పక్కనే పడుకోబెట్టుకునేవారు. అమ్మ కూడా మమ్మల్ని ఎంతో మిస్‌ అవుతున్నారని అర్థమయ్యేది. మా కోసం కష్టపడింది. ఆస్తులు సంపాదించింది. ఎంతోమందికి సాయం చేసింది. అమ్మకు చింతచిగురు అంటే ఇష్టం. ప్రయాణంలో ఉన్నప్పుడు ఎక్కడైనా చింత చెట్టు కనిపిస్తే కారు ఆపి కాయలు కోసేవాళ్లం. పౌర్ణమి రోజున రాత్రి పూట బీచ్‌కు వెళ్లి సరదాగా గడిపేవాళ్లం. తిరుపతికి ఆమె కాలి నడకన వెళ్లేవారు. జంతువులంటే ఆమెకు చాలా ఇష్టం.

అమ్మ మీకోసం వంట చేసి పెట్టేవారా?

చాముండేశ్వరి: అమ్మమ్మ బాగా వంట చేస్తారు. అమ్మ షూటింగ్‌లో బిజీగా ఉంటే అమ్మమ్మ క్యారేజీలు కట్టి పంపించేవారు. నటీనటులందరూ కలిసి భోజనం చేసేవారు. వీలు కుదిరినప్పుడల్లా అమ్మ ఇంట్లో వంట చేసేవారు. కోడిగుడ్డు ఆమ్లెట్‌ కర్రీ, చికెన్‌ ఫ్రై చేసేవారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని