Waltair veerayya: ప్రేక్షకులకు కిక్‌ ఇవ్వడం కోసమే అలా చేశాం..: చిరంజీవి

చిరంజీవి(Chiranjeevi) నటించిన తాజా చిత్రం ‘వాల్తేరు వీరయ్య’ (waltair veerayya) సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా ఆయన మీడియాతో ముచ్చటించారు.  

Updated : 11 Jan 2023 15:58 IST

చిరంజీవి (Chiranjeevi) హీరోగా బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘వాల్తేరు వీరయ్య’ (Waltair veerayya). సంక్రాంతి కానుకగా జనవరి 13న సందడి చేయడానికి సిద్ధమయ్యాడు ‘వాల్తేరు వీరయ్య’. ఈ సందర్భంగా మీడియాతో చిరంజీవి కాసేపు ముచ్చటించారు. నాటునాటు పాటకు  ‘గోల్డెన్‌ గ్లోబ్‌’ (Golden Globe) అవార్డు వచ్చినందుకు ‘RRR’ టీమ్‌కు, కీరవాణికి అభినందనలు తెలిపిన చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’ విశేషాలు పంచుకున్నారు.

తెలుగు సినిమాకు ఇది స్వర్ణయుగం అంటారా?

చిరంజీవి: అసలు మన తెలుగు సినిమా ఎప్పటి నుంచో స్వర్ణయుగంలో ఉంది. అది ఇప్పుడు కొత్తగా వచ్చింది కాదు. దానిని నేటి దర్శకులు, హీరోలు కొనసాగిస్తున్నారు. 

‘వాల్తేరు వీరయ్య’ సినిమాలో మీ పాత్ర ఎలా ఉంటుంది?

చిరంజీవి: నా అభిమానులు ఏం కోరుకుంటారో దానిని ఇవ్వడానికి నేను తపన పడుతుంటాను. వైవిధ్యభరితమైన సినిమాలు, పాత్రలు చేయడాన్ని ఇష్టపడతాను. ఈ సినిమాలో పాత చిరంజీవిని మళ్లీ చూస్తారు. ‘రౌడీ అల్లుడు’, ‘ఘరానా మెగుడు’, ‘ముఠా మేస్త్రీ’ల్లో చిరంజీవి ఎలా ఉన్నాడో ‘వాల్తేరు వీరయ్య’లో కూడా అలా ఉంటాడు. ఈ సినిమా అందరినీ అలరిస్తుంది. షూటింగ్‌ను బాగా ఎంజాయ్‌ చేశాను. నా కాస్టూమ్స్‌ కూడా చాలా బాగుంటాయి. ఇప్పటి వరకు ఇంత మాస్‌గా కనిపించలేదు.

ఏదైనా సన్నివేశాన్ని మళ్లీ చేద్దామని దర్శకులు చెబుతారా? మీరు చేసిందే ఫైనల్‌ చేస్తారా?

చిరంజీవి: నేను దర్శకుడికి, ఫైట్‌ మాస్టర్‌కు, కొరియోగ్రాఫర్‌కు పూర్తి స్వేచ్ఛనిస్తాను. వాళ్లు సీన్‌ ఓకే అనే వరకూ స్పాట్‌ నుంచి కదలను. మొదటి సినిమా అప్పుడు ఎలా ఉన్నానో.. ఇప్పటికీ అలానే ఉన్నాను. దీనికి కారణం ప్రేక్షకుల ఆదరణ. అలాగే దర్శక నిర్మాతలు. ఒక సినిమా బాగా రావాలంటే చాలా మంది కష్టపడాలి. అమితాబ్‌ బచ్చన్‌గారు మా అందరికీ స్ఫూర్తి. ఆయన నేటికీ యంగ్‌ హీరోలతో పోటీపడి నటిస్తుంటారు.

మీరు, రవితేజ కలిసి ‘అన్నయ్య’ సినిమాలో చేశారు. మళ్లీ ఇన్నేళ్లకు కలిసి నటించారు.. ఎలా అనిపించింది?

చిరంజీవి: రవితేజ ఆరోజుల్లో ఎలా ఉన్నాడో ఈరోజూ అలానే ఉన్నాడు. తన ఎనర్జీతో ఈ సినిమాకు మరింత ప్లస్‌ అయ్యాడు. కథకు బలాన్ని చేకూర్చాడు. ఈ పాత్రకు రవితేజ అయితే బాగుంటుందని అందరం అనుకున్నాం. ఈ సినిమాలో ఇద్దరం డైలాగ్‌లు మార్చుకున్నాం. తన ఇడియట్‌లో డైలాగ్‌ నేను.. నా సినిమాలో డైలాగ్‌ తను చెప్పాడు. ఫ్యాన్స్‌కు కిక్‌ ఇవ్వడం కోసమే అలా డైలాగ్స్‌ మార్చుకున్నాం.

సంక్రాంతికి మీ సినిమా ఎప్పుడూ ముందే వస్తుంది. ఈసారి కాస్త వెనకబడ్డారా?

చిరంజీవి: ఈ సంక్రాంతికి మైత్రీ సంస్థ నుంచే రెండు సినిమాలు రావడం చాలా సంతోషంగా ఉంది. మంచి సినిమా ఎప్పుడైనా విజయం సాధిస్తుంది. బయ్యర్లను, ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నాం. సినిమాకు టెక్నాలజీ కంటే కంటెంట్‌ ముఖ్యం. నేను దాన్నే నమ్ముతాను. బాబీ కూడా ఈ విషయంలో నాలానే ఆలోచిస్తారు.

కమర్షియల్‌ సినిమాని ఇష్టపడతారా? బాబీ మీకు వాల్తేరు వీరయ్య కథ చెప్పినప్పుడు ఎలా అనిపించింది?

చిరంజీవి: కచ్చితంగా కమర్షియల్‌ సినిమాలపైనే దృష్టి పెడతాను. నాకేం కావాలి అనేదానికంటే ప్రేక్షకులకు ఏం కావాలి అనేదే ఎక్కువ ఆలోచిస్తా. అలాగే కంటెంట్‌ ఉంటే సీక్వెల్స్‌ చేయడానికి సిద్ధంగా ఉన్నా. కథలో ఎన్ని పాటలున్నాయి, ఎన్ని ఫైట్స్‌ ఉన్నాయని చూడను. అవ్వన్నీ అలంకారాలని భావిస్తాను. కథకు సహజ సౌందర్యం అంటే అది భావోద్వేగం. అందుకే కథలో ఎంత ఎమోషన్‌ ఉందో చూస్తా. అందరూ కథలు వింటారు కానీ నేను కథను చూస్తాను. కథ చెప్పేటప్పుడే విజువలైజేషన్‌ చేసుకుంటా. ప్రేక్షకులు రూ.100 ఇచ్చి సినిమాకు వస్తే మనం వాళ్లకు ఏం అందిస్తున్నాం అనేది చూస్తా. 

శ్రుతి హాసన్‌, దేవీశ్రీ ప్రసాద్‌ గురించి.. ?

చిరంజీవి: శ్రుతి హాసన్ నా పక్కన డ్యాన్స్‌ అలవోకగా చేసింది. చలిలో కూడా ఎంజాయ్‌ చేస్తూ చేశాం. తనతో మళ్లీ మళ్లీ నటించాలనుకుంటున్నాను. ఇక రవితేజ ఎంత ఎనర్జీతో ఉంటాడో దేవీశ్రీ ప్రసాద్‌ అంతకు డబుల్‌ ఎనర్జీతో ఉంటాడు. లిరిక్స్‌ కూడా తనే రాసేస్తాడు. ఈ సినిమాలోని అన్ని పాటలు నాకు నచ్చాయి. 

మీకు అతి మంచితనం అవసరమా అని మీ ఫ్యాన్స్‌ అనుకుంటున్నారు. మీరేమంటారు?

చిరంజీవి: కచ్చితంగా అవసరమే. ఏదైనా సంఘటన జరిగినప్పుడు ఎదరుతిరిగితే నా అహం చల్లారుతుందేమో కానీ, సినిమాకు భారీగా నష్టం వస్తుంది. అభిమానులు నిరాశ చెందుతారు. నా సంయమనం ఇంత మందికి మంచి చేస్తుందంటే నేను వెనక్కి తగ్గుతాను. అంతిమ ఫలితం చూస్తాను.

మీరు సినిమాల్లోకి వచ్చిన కొత్తల్లో ఎలా ఉన్నారో ఇప్పటికీ అలానే అణకువగా ఉన్నారు? కొత్త హీరోలు కూడా ఇలానే ఉంటున్నారనుకుంటున్నారా?

చిరంజీవి: కొందరికి ఇలా ఉండడం సహజంగానే వస్తుంది. మన కోసం కాకుండా ఇతరుల కోసం ఆలోచించాలి. ఆ ఇతరులలో దర్శకులు, నిర్మాతలు, టెక్నికల్ టీం అంతా ఉంటారు. మన ప్రవర్తన అన్నిటికంటే ముఖ్యం. అది బాగుంది కాబట్టే నాకు వరసగా సినిమాలు వచ్చాయి. నాకు పనిలేకుండా ఉండడం కానీ, పనిచేయకుండా ఉండడం కానీ ఇష్టం ఉండదు. నేను పెద్దగా చదువుకోలేదు. పుస్తకాలు కూడా చదవను. కానీ ప్రతి సంఘటన నుంచి నేర్చుకుంటాను. అలాగే యంగ్‌స్టర్స్‌ని చూసి కూడా కొన్ని విషయాల్లో స్ఫూర్తిపొందుతాను.

దర్శకత్వం చేయాలనే ఆలోచన ఉందా?టికెట్‌ ధరల విషయంలో ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయం ఎలా అనిపించింది?

చిరంజీవి: జీవితాంతం సినిమాతో మమేకం అవ్వాలనే ఉంది.  అలాంటి సందర్భం వచ్చి, దర్శకత్వం చేయగలననే నమ్మకం వస్తే చేస్తాను. ప్రభుత్వ నిర్ణయాలను మనం గౌరవించాలి. టికెట్‌ ధరల విషయంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వాలకు నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.

బాబీ సింహా గురించి చెప్పండి?

చిరంజీవి: బాబీ సింహా జాతీయ అవార్డు పొందిన నటుడు. నా సినిమాల్లో డైలాగులు, పాటలు అవలీలగా చెప్పాడు. తనది తమిళనాడు అనుకున్నాను. తెలుగువాడని తెలిసి ఆశ్చర్యపోయాను. తను కూడా నా అభిమాని. ఈ సినిమాలో అద్భుతంగా నటించాడు.

రీమేక్‌ సినిమాలు చేయడం రిస్క్‌తో కూడుకున్నదా? 

చిరంజీవి:  ఒక రీమేక్‌ కథ చేస్తున్నప్పుడు మన హీరో ఇందులో ఎలా ఉంటాడనే ఆత్రుత అందరికీ ఉంటుంది. ‘గాడ్‌ ఫాదర్‌’ విజయానికి కారణం కూడా ఇదే. ఆ సినిమా ఒరిజినల్‌కు కొన్ని మార్పులు చేసి తీశాం. ‘గాడ్‌ ఫాదర్‌’ ఒరిజినల్‌ చూసినప్పటికీ రీమేక్‌నూ ఆదరించారు. ఇప్పుడు మరో రీమేక్‌లో నటిస్తున్నా.

బాబీ గురించి చెప్పండి?

చిరంజీవి: తను నాకు పెద్ద అభిమాని. నా అభిమానిగా అతడిని ఇష్టపడ్డాను. దర్శకుడిగా దాసోహమయ్యాను. డైరెక్టర్‌గా ఎక్కువ మార్కులు సంపాదించాడు. చాలా కష్టపడ్డాడు. ఏదైనా సీన్‌ మార్చాలంటే తన టీంతో రాత్రంతా కూర్చొన్ని ఆలోచిస్తాడు. ముఖ్యంగా ఒక విషయం చెప్పాలి.. వాళ్ల నాన్న చిన్నదినం జరిగిన వెంటనే షూటింగ్‌కు వచ్చాడు. అంత కమిట్‌మెంట్‌తో పనిచేస్తాడు. అందుకే బాబీకి నేను అభిమానిని అయ్యాను. ఈ సినిమా హిందీలో కూడా ‘పుష్ప’లాగా ప్రేక్షకాదరణ పొందుతుందని అనుకుంటున్నాను.

గొప్ప నటుడుగా ఉండాలనుకుంటున్నారా?మంచి మనిషిగా ఉండాలనుకుంటున్నారా?

చిరంజీవి: మంచి నటుడు అనేది నాకు దక్కిన గొప్ప వరంగా భావిస్తా. అది నా అదృష్టం. కానీ అది శాశ్వతం కాదన్నది సత్యం. ఒక మంచి మనిషి అనేది శాశ్వతం. అది కాదనలేని సత్యం. మనం చనిపోయినా అది మాత్రం నిలిచిపోతుంది. రియల్‌ హీరోగా ఉంటూ రీల్‌ హీరోగా ఎక్కువకాలం కొనసాగాలని నా కోరిక.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని