Satish Raj: దర్శకుడిగా మారిన కొరియోగ్రాఫర్‌

తెలుగు తెరపై ఇప్పటి వరకు ఎంతో మంది కొరియోగ్రాఫర్‌లు దర్శకులుగా మారి వారి ప్రతిభను నిరూపించుకున్నారు.

Updated : 24 May 2024 01:34 IST

తెలుగు తెరపై ఇప్పటి వరకు ఎంతో మంది కొరియోగ్రాఫర్‌లు దర్శకులుగా మారి వారి ప్రతిభను నిరూపించుకున్నారు. ఇప్పుడీ బాటలోకే రాబోతున్నారు నృత్య దర్శకుడు సతీష్‌ రాజ్‌. ఆయన స్వీయ దర్శకత్వంలో ఓ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు. శిరీష కథానాయిక. ఈ నేపథ్యంలోనే ఎస్‌ఆర్‌ మూవీ జంక్షన్‌ పేరుతో ఓ బ్యానర్‌ను స్థాపించారు. తాజాగా సతీష్‌ ‘సబూరి..’ పేరుతో రూపొందించిన ఓ పాటను, బ్యానర్‌ లోగోను ప్రముఖ నటుడు మురళీ మోహన్‌ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘ఒక దర్శకుడు సినిమా మొత్తాన్ని మూడు గంటల్లో చూపిస్తే కేవలం మూడు నిమిషాల్లో కథ మొత్తం అర్థమయ్యేలా ఒక్క పాటలో చూపించగలిగిన దర్శకుడే కొరియోగ్రాఫర్‌. సతీష్‌ లాంటి కొరియోగ్రాఫర్లు దర్శకులుగా మారడం వల్ల చిత్రపరిశ్రమలో మంచి సినిమాలు వస్తాయ’’ని అన్నారు. కార్యక్రమంలో ఫిల్మ్‌ ఛాంబర్‌ కార్యదర్శి దామోదర్‌ ప్రసాద్, శేఖర్‌ మాస్టర్, విజయ్‌ బిన్నీ, సంగీత దర్శకుడు చరణ్‌ అర్జున్, నిర్మాత అర్చన తదితరులు పాల్గొన్నారు.


‘లవ్‌ మీ...’ ప్రయాణాన్ని  మరిచిపోలేం 

‘‘కొత్త సినిమాల్ని... కొత్త దర్శకుల్ని అందించాలనే ఈ నిర్మాణ సంస్థని ప్రారంభించాం. ‘బలగం’ తర్వాత ఇందులో రూపొందిన  ‘లవ్‌ మీ’ తప్పకుండా ప్రేక్షకులకు నచ్చుతుందని ఆశిస్తున్నాం’’ అన్నారు ప్రముఖ నిర్మాత దిల్‌రాజు. ఆయన నిర్మాణ సంస్థ దిల్‌రాజు ప్రొడక్షన్స్‌పై తెరకెక్కిన చిత్రం ‘లవ్‌ మీ’. ఇఫ్‌ యు డేర్‌... అనేది ఉపశీర్షిక. ఆశిష్, వైష్ణవి చైతన్య జంటగా నటించారు. అరుణ్‌ భీమవరపు దర్శకుడు. హన్షిత, హర్షిత్‌ రెడ్డి, నాగ మల్లిడి నిర్మాతలు. ఈ చిత్రం శనివారం ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్బంగా చిత్రబృందం గురువారం హైదరాబాద్‌లో విడుదలకి ముందస్తు వేడుకని నిర్వహించింది. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కథానాయకుడు మాట్లాడుతూ ‘‘విభిన్నమైన సినిమా చేశామనే పూర్తి విశ్వాసంతో ఉన్నాం.  ఈ సినిమా ప్రయాణాన్ని మరిచిపోలేం’’ అన్నారు. ఈ కార్యక్రమంలో  సంగీత దర్శకుడు కీరవాణి, దిల్‌రాజు, దర్శకుడు రవికిరణ్‌ కోలా, నిర్మాత శిరీష్, నటుడు రవికృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని