Jamuna: కళకు, కళాకారులకు మరణం ఉండదు.. జమున మృతిపై సినీ ప్రముఖుల సంతాపం..

అలనాటి నటి జమున(Jamuna) మృతిపై సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఆమెతో దిగిన ఫొటోలను పంచుకుంటూ ఆ నటిని గుర్తుచేసుకుంటున్నారు.

Updated : 27 Jan 2023 11:10 IST

హైదరాబాద్‌: అలనాటి నటి జమున (Jamuna) ఇక లేరు. తెలుగుతో సహా ఎన్నో దక్షిణాది భాషల్లో నటించిన ఆమె మరణంతో టాలీవుడ్‌లో విషాదఛాయలు అలముకున్నాయి. జమున మరణవార్త తెలిసిన పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. ఆమెతో దిగిన ఫొటోలను పంచుకుంటూ ఆ నటిని గుర్తుచేసుకుంటున్నారు. ఇటీవలే కృష్ణ, కృష్ణంరాజు, కైకాల సత్యనారాయణ, చలపతిరావు వంటి ప్రముఖుల మరణాలను మరవక ముందే జమున మృతిచెందడం చిత్ర పరిశ్రమకు తీరనిలోటు అంటూ నెటిజన్లు ట్వీట్‌ చేస్తున్నారు.

సీనియర్‌ హీరోయిన్‌ జమున గారు స్వర్గస్తులయ్యారనే వార్త ఎంతో విచారకరం. ఆవిడ బహుభాషా నటి. మాతృభాష కన్నడం అయినా ఎన్నో విజయవంతమైన చిత్రాలతో తెలుగు వారి మనసుల్లో చెరగని ముద్ర వేశారు. మహానటి సావిత్రి గారితో ఆవిడ అనుబంధం ఎంతో గొప్పది. ఆవిడ కుటుంబానికి నా ప్రగాఢ సంతాపం తెలియచేస్తున్నాను.

- చిరంజీవి(Chiranjeevi)


‘‘ప్రముఖ నటి, లోక్‌సభ మాజీ సభ్యురాలు జమున మృతి బాధాకరం. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో అలనాటి తరానికి ప్రతినిధిగా ఉన్నారు. వెండి తెరపై విభిన్న పాత్రలు పోషించిన ఆమె తెలుగు ప్రేక్షకులకు సత్యభామగానే గుర్తుండిపోయారు. ఆ పౌరాణిక పాత్రకు జీవం పోశారు. ఠీవీ, గడుసుతనం కనిపించే పాత్రల్లోనే కాకుండా అమాయకత్వం ఉట్టిపడే పాత్రల్లోనూ నటించి ప్రేక్షకుల మెప్పు పొందారు. ప్రజా జీవితంలో లోక్ సభ సభ్యురాలిగా సేవలందించారు. ఆమె కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను’’ - పవన్‌కల్యాణ్‌


‘అల్లరి పిల్లగా, ఉక్రోషంతో ఊగిపోయే మరదలిగా, ఉత్తమ ఇల్లాలిగా, అన్నిటికీ మించి తెలుగువారి సత్యభామగా మనల్ని జమున గారు ఎంతో మెప్పించారు. చిన్ననాటి నుంచే నాటకాల్లో అనుభవం ఉండటంతో నటనకే ఆభరణంగా మారారు. 195కిపైగా సినిమాల్లో నటించి నవరసనటనా సామర్థ్యం చూపారు. కేవలం దక్షిణాది సినిమాలకే పరిమితం కాకుండా ఆరోజుల్లోనే పలు హిందీ సినిమాల్లోనూ నటించి ఔరా అనిపించి అందరి ప్రశంసలు పొందిన బహుముఖ ప్రజ్ఞాశాలి. నాన్న గారు అన్నట్లుగా కళకు కళాకారులకు మరణం ఉండదు. జమున గారు భౌతికంగా మన మధ్య లేనప్పటికీ వారి మధుర స్మృతులు ఎప్పటికీ మన మదిలో మెదులుతూనే ఉంటాయి. వారి ఆత్మకు శాంతి కలగాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను. వారి కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి.

- బాలకృష్ణ(Balakrishna)


దాదాపుగా 30 సంవత్సరాలు తెలుగు సినిమా ఇండస్ట్రీలో మహారాణిలా కొనసాగారు. గుండమ్మ కథ, మిస్సమ్మ లాంటి ఎన్నో మరపురాని చిత్రాలతో, మరెన్నో వైవిధ్యమైన పాత్రలతో మా మనసుల్లో చెరగని ముద్ర వేశారు. మీ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను. జమున గారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి.

- జూనియర్‌ ఎన్టీఆర్‌(NTR)


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని