Family Star: తెలుగు సినిమాకి కావల్సింది సహజత్వమే!

భారతీయ ప్రముఖ ఛాయాగ్రాహకుల్లో కె.యు.మోహనన్‌ ఒకరు. బాలీవుడ్‌లో షారుక్‌ఖాన్‌, ఆమిర్‌ఖాన్‌, అక్షయ్‌ కుమార్‌ తదితర అగ్ర కథానాయకులతో సినిమాలు చేశారు. కెమెరాతో  ప్రేక్షకుల్ని ముగ్ధుల్ని  చేస్తున్న ఆయన తెలుగులో ‘మహర్షి’ తర్వాత  ‘ఫ్యామిలీస్టార్‌’ చిత్రానికి పనిచేశారు.

Updated : 28 Mar 2024 12:17 IST

భారతీయ ప్రముఖ ఛాయాగ్రాహకుల్లో కె.యు.మోహనన్‌ ఒకరు. బాలీవుడ్‌లో షారుక్‌ఖాన్‌, ఆమిర్‌ఖాన్‌, అక్షయ్‌ కుమార్‌ తదితర అగ్ర కథానాయకులతో సినిమాలు చేశారు. కెమెరాతో  ప్రేక్షకుల్ని ముగ్ధుల్ని  చేస్తున్న ఆయన తెలుగులో ‘మహర్షి’ తర్వాత  ‘ఫ్యామిలీస్టార్‌’ చిత్రానికి పనిచేశారు. విజయ్‌ దేవరకొండ కథానాయకుడిగా పరశురామ్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం  ఏప్రిల్‌ 5న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా కె.యు.మోహనన్‌ బుధవారం హైదరాబాద్‌లో విలేకర్లతో ముచ్చటించారు. ఆయన చెప్పిన విషయాలివీ...

‘ఫ్యామిలీ స్టార్‌’ కథపై మీ అభిప్రాయమేమిటి? ఓ ఛాయాగ్రాహకుడిగా దీనికి మీరెలాంటి విజువల్స్‌ని అందించే ప్రయత్నం చేశారు?

కుటుంబ విలువల గురించి చెప్పే ఓ అందమైన, తీయనైన కథ ఇది.  హృదయాల్ని సునిశితంగా స్పృశిస్తుంది. మంచి ప్రేమకథ కూడా ఉంది. మన కుటుంబ వ్యవస్థ గురించి ఓ బలమైన సందేశాన్నిస్తుంది. దర్శకుడు పరశురామ్‌ ఈ కథని మధ్య తరగతి నేపథ్యంలో మలిచాడు. ఆ కథ అంతే సహజంగా తెరపై కనిపించేలా నేను జాగ్రత్తలు తీసుకున్నా.  కమర్షియల్‌ సినిమా కదా అని లార్జర్‌ దేన్‌ లైఫ్‌ తరహా ఆలోచనలతో ఈ సినిమా తీయలేదు. కథానాయకుడి ఇల్లు చూస్తే, ఇది మన ఇల్లులాగే ఉందని ప్రేక్షకుడు అనుకోవాలి. అలాంటి సహజత్వమే ఇప్పుడు తెలుగు సినిమాకి కావాలి. చాలా తెలుగు సినిమాల్లో కనిపించని సహజత్వం ఇందులో ఉంటుంది.

మీ కెరీర్‌లో రకరకాల చిత్రాలు చేశారు. కమర్షియల్‌ చిత్రాలకి పనిచేస్తున్నప్పుడు మీ ఆలోచనలు, మీ పనితీరు ఎలా ఉంటుంది?

ఇండీ సినిమాలతో నా ప్రయాణం మొదలైంది. వాటిని ఆర్ట్‌ సినిమాలు  అంటుంటారు. ఇప్పటికీ ఆ చిత్రాలకి పనిచేయడాన్ని ఇష్టపడతాను. సినిమా అనేది వ్యాపారం కంటే ముందు కళారూపం అని నమ్ముతాను. సినిమా అనేది ఓ భాష, భావ వ్యక్తీకరణ.  ఫిలిం ఇన్‌స్టిట్యూట్‌లో నేను చదువుకున్నది కూడా అదే. అయితే  చిన్నప్పటి నుంచి వాణిజ్య ప్రధానమైన సినిమాలు చూస్తూ పెరుగుతాం. ఆ ప్రభావం సహజంగానే ఉంటుంది. దానికి ఫిలిం ఇన్‌స్టిట్యూట్‌లో నేర్చుకున్న కళ కూడా తోడవుతుంది. ఆ కళని వాణిజ్య ప్రధానమైన సినిమాలకి మేళవించే ప్రయత్నం చేస్తువంటా. ఒకే స్టైల్‌తో పనిచేయడం నాకు ఇష్టం ఉండదు. ప్రతి సినిమాకీ ఓ ప్రత్యేకమైన స్టైల్‌ ఉండాల్సిందే. అది దర్శకుడి నుంచి, స్క్రిప్ట్‌ నుంచే వస్తుంది. 2004లో ఫర్హాన్‌ అక్తర్‌ ‘డాన్‌’ కోసం నన్ను సంప్రదించాడు. నేను అందరిలా కమర్షియల్‌ సినిమా భాషలో కాకుండా నాదైన శైలిలో ఆ సినిమాకి  పనిచేశాను. చాలా పేరొచ్చింది. కమర్షియల్‌ సినిమా అంటే ఇలాగే ఉండాలని కాపీ తరహాలో పనిచేయకూడదు. ప్రతి సినిమా విషయంలో వైవిధ్యమైన పనితీరు అవసరం అని నమ్ముతా.

మీరు ఓ సినిమా ఒప్పుకోవడం వెనక ఏ విషయాల్ని పరిగణనలోకి తీసుకుంటారు?

కథ, నిర్మాణ సంస్థ, నటులు... ఇలా ఒకొక్క సినిమాకీ ఒక్కో కారణం ఉంటుంది. కమర్షియల్‌ సినిమాలు డబ్బు కోసం కూడా చేస్తుంటాం కానీ, అదొక్కటే కారణం కాదు.   ‘ఫ్యామిలీస్టార్‌’ విషయానికొస్తే ఇదివరకు శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌లో ‘మహర్షి’ చేశా. విజయ్‌ దేవరకొండ అంటే ఇష్టం.  తన నటన సహజంగా ఉంటుంది. పరశురామ్‌ కథ కూడా చాలా సహజంగా ఉంటుంది. ఇలా పలు కారణాలు ఈ సినిమా చేయడానికి దోహదం చేశాయి.

మీ అమ్మాయి మాళవిక మోహనన్‌ తెలుగులో సినిమా చేస్తున్నారు. తనకి ఎలాంటి సలహాలు ఇస్తుంటారు?

తనకు తానుగా గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నంలో ఉంది. నటిగా తనేమిటో నిరూపించుకోవాల్సి వుంది. నేనెప్పుడూ ఏ సినిమాకీ తనని రెకమెండ్‌ చేయలేదు.  కథ నచ్చలేదనో లేదంటే ఇతరత్రా కారణాలనో చాలా సినిమాల్ని వదులుకుంది. తెలుగులో ప్రభాస్‌ చిత్రంతోపాటు, తమిళంలోనూ పా.రంజిత్‌ దర్శకత్వంలో విక్రమ్‌తో కలిసి ‘తంగలాన్‌’ చేస్తోంది. మాళవికకు మంచి పేరొస్తుంది.


‘‘తెలుగు సినిమా ఇప్పుడు భారతీయ మార్కెట్‌లో మంచి ప్రభావం చూపిస్తోంది. అయితే ఇప్పటికీ చాలామంది దర్శకులు పాత పద్ధతుల్నే అనుసరిస్తూ కథలు చెబుతున్నారు. సహజత్వానికి దూరంగా సినిమాల్ని రూపొందిస్తున్నారు. ప్రేక్షకుడు కోరుకుంటున్నది ఇవే అని వాళ్లపై నిందలు వేస్తున్నారు. ప్రేక్షకులు ఎప్పుడైనా స్వీకరించేవాళ్లే. మనం వాళ్లకి ఏం ఇస్తున్నామనేది కీలకం. మలయాళంలోనూ, తమిళంలోనూ ప్రయోగాలు చేస్తున్నారు. వందేళ్ల కింద రాసుకున్నట్టే డ్రామాతో కూడిన స్క్రిప్ట్‌లు ఇప్పటికీ రాసుకుంటున్నారు. దర్శకులు కొత్త ఆలోచనలతో వస్తే  ఛాయాగ్రహణంతో సహా అన్ని విభాగాలూ అలా మారుతాయి’’.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని