Nabha Natesh: మిస్టర్‌.. కామెంట్‌ చేసేముందు మాటలు జాగ్రత్త: నటుడికి నభా నటేశ్‌ రిప్లై

నటి నభా నటేశ్‌కు నటుడు ప్రియదర్శికి మధ్య జరిగిన సంభాషణ ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. ‘కామెంట్‌ చేసేముందు మాటలు సరి చూసుకోవాలి’ అని ఆమె సూచించారు.

Updated : 18 Apr 2024 11:06 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ‘ఇస్మార్ట్‌ శంకర్‌’తో తెలుగు ప్రేక్షకుల మనసు గెలుచుకున్నారు నటి నభా నటేశ్‌ (Nabha Natesh). రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఆమె కొంతకాలంగా చిత్ర పరిశ్రమకు దూరంగా ఉన్నారు. ఇప్పుడిప్పుడే తిరిగి సినిమాల్లోకి వస్తున్నారు. ఇదిలా ఉండగా.. సోషల్‌మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉండే ఈ భామకు నటుడు ప్రియదర్శికి మధ్య తాజాగా జరిగిన సంభాషణ నెట్టింట వైరల్‌గా మారింది. కామెంట్‌ చేసేముందు మాటలు సరిచూసుకోవాలంటూ ఆమె ప్రియదర్శికి సూచించారు. ఇంతకీ ఏం జరిగిందంటే..

‘‘హాయ్‌ డార్లింగ్స్‌ ఎలా ఉన్నారు!!’’ అంటూ నభా నటేశ్ తాజాగా ఎక్స్‌లో ఓ సరదా వీడియో షేర్‌ చేశారు. ప్రభాస్‌ వాయిస్‌తో ఆమె దీనిని క్రియేట్‌ చేశారు. ఇది నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది. దీనిపై ప్రియదర్శి స్పందిస్తూ.. ‘‘వావ్‌ సూపర్‌ డార్లింగ్‌.. కిర్రాక్‌ ఉన్నావు’’ అని రిప్లై ఇచ్చాడు. తనని డార్లింగ్ అని పిలవడంపై నభా ఒకింత అసహనం వ్యక్తం చేశారు. ‘‘ఐపీసీ సెక్షన్‌ 354A ప్రకారం పరిచయం లేని ఒక మహిళను డార్లింగ్‌ అని పిలవడం లైంగిక వేధింపులతో సమానం’’ అని రాసి ఉన్న ఒక ఇమేజ్‌ను షేర్‌ చేస్తూ.. ‘‘మిస్టర్‌. కామెంట్‌ చేసేముందు మాటలు జాగ్రత్త’’ అని బదులిచ్చారు.

‘‘మనం పరిచయం లేని వ్యక్తులనే విషయం నాకు తెలియదు. మీరైతే డార్లింగ్‌ అనొచ్చు మేము అంటే మాత్రం సెక్షన్సా? లైట్‌ తీసుకో డార్లింగ్‌’’ అని ప్రియదర్శి కామెంట్‌ చేయగా.. ‘‘ఆహా!! హద్దు దాటి ప్రవర్తించకు. చూసుకుందాం’’ అని సమాధానమిచ్చారు. నెట్టింట వైరల్‌గా మారిన ఈ చాట్‌పై నెటిజన్లు భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది వీరి మధ్య నిజంగానే మాటల యుద్ధం జరిగిందని అనుకొంటున్నారు. మరి కొంతమంది మాత్రం సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఇలా మాట్లాడుకుని ఉంటారని భావిస్తున్నారు.

‘నన్ను దోచుకుందువటే’తో ఈ కన్నడ నటి టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. ‘అదిగో’, ‘ఇస్మార్ట్‌ శంకర్‌‌’, ‘డిస్కోరాజా’, ‘సోలో బ్రతుకే సో బెటర్‌’, ‘అల్లుడు అదుర్స్‌’ చిత్రాలతో అలరించారు. నితిన్‌ హీరోగా నటించిన ‘మ్యాస్ట్రో’ తర్వాత ఆమె సినిమాల్లో కనిపించలేదు. వెండితెరకు దూరంగా ఉండటంపై గతేడాది ఓ లేఖను విడుదల చేశారు. ‘‘కొన్నిరోజుల నుంచి సినిమాలకు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. 2022లో నాకు రోడ్డు ప్రమాదం జరిగింది. దాని వల్ల నా ఎడమ భుజానికి గాయమైంది. చాలా శస్త్రచికిత్సలు చేయాల్సి వచ్చింది. మానసికంగా, శారీరకంగా భరించలేని బాధను అనుభవించా. ఇప్పుడు పూర్తిగా కోలుకున్నా. మళ్లీ సినిమాలతో మిమ్మల్ని అలరించేందుకు సిద్ధంగా ఉన్నా’’ అని దానిలో తెలిపారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని