Deadpool 3: ప్రపంచ రికార్డును సృష్టించిన ‘డెడ్‌పూల్‌ అండ్‌ వోల్వరైన్‌’ టీజర్‌

Deadpool 3: వేడ్‌ విల్సన్‌ కీలక పాత్రలో షాన్‌ లెవీ తీసిన ‘డెడ్‌పూల్3’ టీజర్‌ రికార్డు వ్యూస్‌ సొంతం చేసుకుంది.

Updated : 14 Feb 2024 17:41 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ‘డెడ్‌పూల్‌’.. అమెరికన్‌ సూపర్‌ హీరోల సినిమాలను చూసేవారికి పరిచయం అక్కర్లేని పేరు. 2016లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద ఘన విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత విడుదలైన ‘డెడ్‌పూల్‌-2’ కూడా అలరించింది. ఇప్పుడు ఈ సిరీస్‌ను కొనసాగిస్తూ రాబోతున్న మరో సరికొత్త సూపర్‌ హీరో యాక్షన్‌ ఫిల్మ్‌ ‘డెడ్‌ పూల్‌ అండ్‌ వోల్వరైన్‌’ (Deadpool & Wolverine). రేయాన్‌ రేనాల్డ్స్‌, హ్యూ జాన్‌మెన్‌ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాను షాన్‌ లెవీ తెరకెక్కించారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ వేసవి కానుకగా జులై 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో విడుదల చేసిన టీజర్‌ రికార్డు వ్యూస్‌ సాధించింది. కేవలం 24 గంటల్లోనే 365 మిలియన్‌ వ్యూస్‌ను సొంతం చేసుకుని, సరికొత్త ప్రపంచ రికార్డును సృష్టించింది. ప్రపంచ సినీ చరిత్రలో ఇప్పటివరకూ ఏ చిత్రం 24 గంటల్లో ఈ స్థాయి వ్యూస్‌ను దక్కించుకోలేదు. ఈ ఘనత సాధించిన తొలి చిత్రంగా ‘డెడ్‌ పూల్‌ అండ్‌ వోల్వరైన్‌’ నిలిచింది.

డెడ్‌పూల్‌ కథేంటంటే: వేడ్‌ విల్సన్‌ (రేయాన్‌) కెనడియన్‌ స్పెషల్‌ ఫోర్స్‌లో పనిచేసి బయటకు వచ్చేస్తాడు. దొరికిన పని చేసుకుంటూ జీవనం సాగిస్తుంటాడు. ఈ క్రమంలోనే వానెస్సా (మోరెనా) అనే వ్యభిచారిణి పరిచయమవుతుంది. ఆమెతో కొంతకాలం సహజీవనం చేసి, వివాహం చేసుకోవాలనుకుంటాడు. ఈ క్రమంలో అతడికి క్యాన్సర్‌ ఉందనే విషయం తెలుస్తుంది. తాను చనిపోవడం వానెస్సా చూడకూడదని ఆ ఊరు విడిచి వెళ్లిపోతాడు. క్యాన్సర్‌ నయం చేయడానికి రహస్యంగా చేస్తున్న ఎడ్‌స్క్రీన్‌ (ఫ్రాన్సిస్‌ ఫ్రీమెన్‌) గురించి తెలియడంతో ఆ ప్రయోగాల్లో తాను భాగం అవుతాడు. ప్రయోగాల సమయంలో తీవ్ర చిత్ర హింసలకు గురవుతాడు. అయితే, ఆ ప్రయోగాల వల్ల వేడ్ శరీరం తీవ్ర మార్పులకు లోనవుతుంది. ఎవరూ గుర్తుపట్టలేనంత అసహ్యంగా తయారవుతుంది. అదే సమయంలో ఏ గాయమైనా దానంతట అదే మానిపోయేలా శరీరం స్పందిస్తుంది. ఆ ప్రయోగశాల నుంచి బయట పడిన వేడ్‌.. ఎడ్‌స్క్రీన్‌ను అంతం చేసేందుకు బయలు దేరతాడు. మరి అతడు అనుకున్నది సాధించాడా? ఎడ్‌స్క్రీన్‌ను ఎలా ఎదుర్కొన్నాడన్నది మిగిలిన కథ.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని