Devara: ‘దేవర’ యాక్షన్‌ పార్ట్‌ ఫినిష్‌.. లేటెస్ట్‌ అప్‌డేట్‌ ఇదే!

Devara: ఎన్టీఆర్‌, కొరటాల శివ మూవీ షూటింగ్‌కు సంబంధించిన ఆసక్తికర విషయాలు బయటకు వచ్చాయి.

Published : 15 Feb 2024 16:41 IST

హైదరాబాద్‌: ఎన్టీఆర్‌ (NTR) కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్‌ డ్రామా ఫిల్మ్‌ ‘దేవర’ (Devara). జాన్వీకపూర్‌ (Janhvi Kapoor) కథానాయిక. శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటున్న ఈ సినిమాకు సంబంధించి యాక్షన్‌ పార్ట్‌ షూటింగ్‌ పూర్తయినట్లు చిత్రవర్గాలు తెలిపాయి. హాలీవుడ్‌ స్టంట్‌ కొరియోగ్రాఫర్‌ కెన్నీ బేట్స్‌ తీర్చిదిద్దిన ఫైట్స్‌ సినిమాకే హైలైట్‌గా నిలుస్తాయట. ఇక ఈ ‘దేవర’లో అండర్‌ వాటర్‌ సీక్వెన్స్‌ ప్రత్యేకంగా నిలవనుంది. వీటికి సంబంధించిన చిత్రీకరణ ఇదివరకే పూర్తిచేయగా, తెరపై ప్రేక్షకులకు అద్భుతమైన అనుభూతిని పంచేందుకు వీఎఫ్‌ఎక్స్‌ సైతం జోడించనున్నారు. మరోవైపు కీలకపాత్రలకు సంబంధించిన టాకీ పార్ట్‌ కూడా దాదాపు పూర్తయింది. మిగిలిన దానిని కూడా పూర్తి చేసి, పాటల చిత్రీకరణకు వెళ్లనున్నారు. ఇప్పటికే ఒక మాంటేజ్‌ సాంగ్‌ షూట్‌ చేశారు. మరో నాలుగు పాటల చిత్రీకరణ మిగిలిఉంది. బాలీవుడ్‌ నటుడు సైఫ్‌ అలీఖాన్‌ ఇందులో ప్రతినాయకుడిగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల చిత్రీకరణలో ఆయన గాయపడగా, ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నారు. సైఫ్‌ కోలుకున్న వెంటనే షూటింగ్‌ మొదలుపెట్టే అవకాశం ఉంది.

ఆ స్పష్టత వచ్చాకే విడుదల తేదీపై ప్రకటన

తొలుత అనుకున్న షెడ్యూల్‌ ప్రకారం.. ఏప్రిల్‌ 5న ‘దేవర’ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనుకున్నారు. అయితే, పాన్‌ ఇండియా స్థాయిలో విడుదలవుతున్న నేపథ్యంలో అందుకు తగినవిధంగా సన్నివేశాలు చిత్రీకరిస్తుండటంతో షూటింగ్‌ ఆలస్యమవుతూ వస్తోంది. ఈ క్రమంలోనే సైఫ్ గాయపడటంతో ఇది మరింత ఆలస్యమవుతోంది. దీంతో విడుదల తేదీని వాయిదా వేశారు. కొత్త తేదీ విషయంలో చిత్ర బృందం ఆచితూచి వ్యవహరిస్తోంది. ఈసారి తేదీ ప్రకటిస్తే, ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తగ్గకూడదని, కీలకమైన పనులన్నీ ఒక కొలిక్కి వచ్చిన తర్వాతే ప్రకటన చేయాలని చూస్తోంది. యువ సుధ ఆర్ట్స్‌, ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌ పతాకంపై సుధాకర్‌ మిక్కిలినేని, కొసరాజు హరికృష్ణ, నందమూరి కల్యాణ్‌రామ్‌ ‘దేవర’ నిర్మిస్తున్నారు. అనిరుధ్‌ రవిచందర్‌ సంగీతం అందిస్తున్నారు. కొన్ని రోజుల కిందట విడుదల చేసిన గ్లింప్స్‌నకు అభిమానులు, ప్రేక్షకుల నుంచి విశేష స్పందన వచ్చిన సంగతి తెలిసిందే. రూ.300 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్న ఈ మూవీ రెండు భాగాలుగా విడుదల కానుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని