Dhruva Natchathiram: ‘ధృవ నక్షత్రం’ రిలీజ్‌కు తప్పని ఇబ్బందులు.. ట్వీట్‌ చేసిన దర్శకుడు

‘ధృవ నక్షత్రం’ (Dhruva Natchathiram) చిత్రం రిలీజ్‌ మరోసారి వాయిదా పడింది. ఈవిషయాన్ని తెలియజేస్తూ దర్శకుడు గౌతమ్‌ మేనన్ తాజాగా ట్వీట్‌ చేశారు. 

Published : 24 Nov 2023 13:24 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: విక్రమ్‌ (Vikram) హీరోగా గౌతమ్‌ మేనన్ దర్శకత్వం వహించిన చిత్రం ‘ధృవ నక్షత్రం’ (Dhruva Natchathiram). స్పై యాక్షన్‌ థ్రిల్లర్‌ తెరకెక్కిన ఈ సినిమా రిలీజ్‌కు ఇబ్బందులు తప్పడం లేదు. ఆరేళ్ల క్రితమే విడుదల కావాల్సిన ఈ సినిమా ఆర్థిక సమస్యల కారణంగా వాయిదా పడింది. ఎట్టకేలకు శుక్రవారం విడుదల చేయాలని చిత్రబృందం ప్లాన్‌ చేయగా.. అనుకోని కారణాలతో అది మరోసారి వాయిదా పడింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ దర్శకుడు గౌతమ్‌ తాజాగా ట్వీట్‌ చేశారు.

‘‘ధృవ నక్షత్రం’ను ఈ రోజు విడుదల చేయలేకపోతున్నందుకు క్షమించండి. సినిమాని రిలీజ్‌ చేయడం కోసం మేము ఎంతగానో ప్రయత్నం చేశాం. ప్రస్తుతం పరిస్థితులు చూస్తుంటే మరో రెండు రోజులు సమయం పట్టేలా ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులకు మంచి అనుభూతిని ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నాం. మీరు మా సినిమాపై చూపిస్తోన్న ప్రేమాభిమానానికి ధన్యవాదాలు’’ అని ఆయన అన్నారు.

Rashmika: విజయ్‌ దేవరకొండ ‘అర్జున్‌ రెడ్డి’పై రష్మిక ఆసక్తికర వ్యాఖ్యలు..

2016లోనే ఈ సినిమా పట్టాలెక్కింది. 2017లో విడుదల చేయాలని చిత్ర బృందం భావించింది. ఆర్థిక ఇబ్బందులతో సినిమా విడుదల నిలిచిపోయింది. శుక్రవారం విడుదల చేయాలని భావించగా గురువారం మద్రాసు హైకోర్టు నిబంధన విధించింది. శింబు హీరోగా గౌతమ్‌ మేనన్‌ ‘సూపర్‌ స్టార్‌’ అనే చిత్రాన్ని తెరకెక్కించేందుకు ఒప్పందం కుదుర్చుకుని, ఆ మేరకు రూ.2.40 కోట్లు తీసుకున్నారని, కానీ ఆయన సినిమాని పూర్తి చేయలేదని.. డబ్బు తిరిగి ఇవ్వలేదని ఆల్‌ ఇన్‌ పిక్చర్స్‌ తరఫున హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. నగదు తిరిగి చెల్లించేవరకూ ‘ధృవ నక్షత్రం’ విడుదలపై నిషేధం విధించాలని పిటిషన్‌లో కోరారు. గురువారం ఈ కేసు విచారణకు రాగా న్యాయస్థానం సినిమా విడుదలకు షరతు విధించింది. ఈ క్రమంలోనే మరోసారి ‘ధృవ నక్షత్రం’ విడుదల వాయిదా పడినట్లు తెలుస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని