imran khan: నేను ఎప్పటికీ అలాంటి పాత్రలు పోషించను: ఆ సన్నివేశాలు ఇబ్బంది పెట్టాయి!

బాలీవుడు నటుడు ఇమ్రాన్‌ ఖాన్‌ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఇండస్ట్రీకి దూరంగా ఉండటంపై స్పందించారు.

Published : 21 Apr 2024 18:39 IST

ముంబయి: బాలీవుడ్‌ స్టార్‌ హీరో ఆమిర్‌ఖాన్‌ మేనల్లుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు నటుడు ఇమ్రాన్‌ ఖాన్‌. ‘కిడ్నాప్‌’, ‘లక్‌’, ‘ఐ హేట్‌ లవ్‌ స్టోరీస్‌’ చిత్రాలతో అనతి కాలంలోనే నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న ఆయన 2015 నుంచి ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు. చాలా సంవత్సరాల విరామం తర్వాత తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. తన కెరీర్‌లో ఎదుర్కొన్న ఎత్తుపల్లాలు, తనపై వచ్చిన రూమర్స్‌ గురించి స్పందించారు.

‘‘2015లో విడుదలైన ‘కట్టి బట్టి’తో పరాజయంతో కాస్త విరామం తీసుకుందామనుకున్నా. వారాలు, నెలలు, సంవత్సరాలు గడిచాయి. ఇండస్ట్రీకి దూరంగా ఉన్నా. రోజులు గడిచే కొద్దీ నా మనసు ఇక్కడ లేదని అర్థమైంది. స్పై థ్రిల్లర్‌ నేపథ్యంలో డిస్నీ + హాట్‌స్టార్‌తో నేనొక ప్రాజెక్ట్‌ చేయాల్సింది. అనుకోని కారణాలతో అది ఆగిపోయింది. అందుకు నేనేమీ బాధపడలేదు. ఎందుకంటే, తుపాకులతో సమస్యలను పరిష్కరించే పాత్రలు పోషించడం నాకు నచ్చదు’’ అని చెప్పారు. ఇటీవల సినిమాల్లో హింసను ఎక్కువగా చూపిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. హీరో ఎక్కువగా గన్స్‌ వాడటం.. ప్రత్యర్థుల తలపై గురిపెట్టి ఏడెనిమిది సార్లు కాల్చడం వంటివి ఈ మధ్య సినిమాల్లో ఎక్కువగా చూపిస్తున్నారు తెలిపారు. అలాంటి సన్నివేశాలు చూసి తాను ఇబ్బంది పడినట్లు చెప్పారు. ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌గా మారాయి. దీనిపై పలువురు నెటిజన్లు స్పందిస్తూ.. ఇమ్రాన్‌ మాట్లాడింది రణ్‌బీర్‌ హీరోగా నటించిన ‘యానిమల్‌’ను ఉద్దేశించేనని అనుకుంటున్నారు.

రణ్‌బీర్‌ కపూర్‌ హీరోగా సందీప్‌ రెడ్డి వంగా దర్శకత్వం వహించిన చిత్రం ‘యానిమల్‌’. రష్మిక కథానాయిక. తండ్రీ కొడుకుల సెంటిమెంట్‌తోనే ఇది రూపుదిద్దుకున్నప్పటికీ పలు సన్నివేశాల్లో హింసను తీవ్ర స్థాయిలో చూపించారని పలువురు అభిప్రాయం వ్యక్తం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని