Animal: షారుక్‌ కామెంట్స్‌పై పరోక్షంగా స్పందించిన సందీప్ వంగా.. ఏమన్నారంటే!

కొందరికి హీరో అంటే నిజమైన అర్థం తెలియడం లేదన్నారు దర్శకుడు సందీప్ వంగా.

Updated : 08 Feb 2024 16:23 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘యానిమల్’ విజయం తర్వాత సందీప్ వంగా వరుస ఇంటర్వ్యూలతో బిజీ అయ్యారు. ఆ సినిమాపై వచ్చిన విమర్శలపై స్పందిస్తున్నారు. తాజాగా ఆయన ఓ ఆంగ్ల మీడియాతో మాట్లాడుతూ ఇటీవల షారుక్ విలన్‌ పాత్రలపై చేసిన కామెంట్స్‌పై పరోక్షంగా స్పందించారు. ప్రస్తుతం అవి వైరలవుతున్నాయి. 

ఓ అవార్డు వేడుక కార్యక్రమంలో షారుక్‌ మాట్లాడుతూ.. ‘నేను ఆశాజనకంగా, సంతోషంగా ఉండే కథలను ఎక్కువగా ఎంచుకుంటాను. నా సినిమాల్లో హీరో పాత్ర మంచి పనులే చేస్తుంది. ఎంతోమందికి ఆదర్శంగా ఉంటుంది. నేను నెగెటివ్‌ పాత్ర పోషిస్తే.. దానికి హీరో చేతిలో చావుదెబ్బలు తప్పవు. ఎందుకంటే.. చెడుపై ఎప్పటికైనా మంచే విజయం సాధిస్తుంది’’ అని అన్నారు. తాజాగా సందీప్‌ మాట్లాడుతూ.. ‘కొందరికి హీరో అంటే నిజమైన అర్థం ఏమిటో తెలియడం లేదు. ఆదర్శవంతమైన పాత్రలే చేయాలని.. అలా చేస్తేనే హీరో అవుతారని అనుకుంటారు. నేను అలా అనుకోను’ అన్నారు. దీంతో ఈ మాటలు షారుక్‌ను ఉద్దేశించే అన్నారంటూ కొందరు నెటిజన్లు పేర్కొంటున్నారు. ఇక గతంలో సందీప్ వంగా తనకు షారుక్‌తో పని చేయాలని ఉందని చెప్పిన సంగతి తెలిసిందే. ఏ దర్శకుడైనా షారుక్‌తో కలిసి పనిచేసేందుకు ఆసక్తి చూపుతారని. అలాగే, తాను కూడా ఆ అవకాశం కోసం ఎదురుచూస్తున్నట్లు చెప్పారు. భవిష్యత్తులో ఆయనతో కలిసి తప్పకుండా సినిమా చేస్తానన్నారు.

మరోవైపు మలయాళ ప్రముఖ నటుడు ఉన్ని ముకుందన్‌ ‘యానిమల్‌’పై ప్రశంసలు కురిపించారు. సినిమాను సినిమాగా మాత్రమే చూడాలన్నారు. ‘నాకెంతో ఇష్టమైన బాబీ దేవోల్‌ ‘యానిమల్‌’లో స్క్రీన్‌పై కనిపించిన సమయం తక్కువే అయినా అందరినీ ఆకట్టుకున్నారు. సినిమా అద్భుతంగా ఉంది. రణ్‌బీర్‌ కొత్తగా కనిపించారు. సినిమాలను వినోదం కోసం మాత్రమే చూడాలి. జ్ఞానం కోసం చూడొద్దు’ అన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని