eagle: ఈగల్‌కే ఎక్కువ థియేటర్లు: దిల్‌రాజు

సంక్రాంతి బరి నుంచి తప్పుకున్న ‘ఈగల్‌’ సినిమాకి సోలో రిలీజ్‌ డేట్‌ ఇస్తామని తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి తరఫున దిల్‌రాజు మాటిచ్చిన సంగతి తెలిసిందే. దీనికి తగ్గట్లుగానే ఆ చిత్రాన్ని ఫిబ్రవరి 9న విడుదల చేసేందుకు పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ నిర్ణయించింది.

Updated : 30 Jan 2024 09:29 IST

ఫిబ్రవరి 16 ఊరు పేరు భైరవకోన విడుదల

సంక్రాంతి బరి నుంచి తప్పుకున్న ‘ఈగల్‌’ సినిమాకి సోలో రిలీజ్‌ డేట్‌ ఇస్తామని తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి తరఫున దిల్‌రాజు మాటిచ్చిన సంగతి తెలిసిందే. దీనికి తగ్గట్లుగానే ఆ చిత్రాన్ని ఫిబ్రవరి 9న విడుదల చేసేందుకు పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ నిర్ణయించింది. కానీ, అదే తేదీకి ‘యాత్ర 2’, ‘ఊరు పేరు భైరవకోన’, ‘లాల్‌ సలామ్‌’ చిత్రాలు విడుదలకు సిద్ధమయ్యాయి. అయితే వీటిలో ‘ఊరు పేరు భైరవకోన’ను వారం ఆలస్యంగా విడుదల చేసేందుకు ఆ చిత్ర నిర్మాత రాజేష్‌ దండా ఒప్పుకున్నట్లు నిర్మాత, తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి అధ్యక్షుడు దిల్‌రాజు ప్రకటించారు. ఈ మేరకు సోమవారం హైదరాబాద్‌లో ఫిల్మ్‌ ఛాంబర్‌ తరఫున విలేకర్ల సమావేశం ఏర్పాటు చేశారు. రాజకీయ కారణాల దృష్ట్యా ‘యాత్ర 2’ని వాయిదా వేయడానికి నిర్మాతలు ఒప్పుకోలేదని, రజనీకాంత్‌ అతిథి పాత్రలో నటించిన ‘లాల్‌ సలామ్‌’ కూడా ఫిబ్రవరి 9నే విడుదల కానుందని దిల్‌రాజు తెలిపారు.  ఇదే విషయాన్ని పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీకి తెలియజేయగా తమకేం ఇబ్బంది లేదన్నారని ఆయన వెల్లడించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ‘ఈగల్‌’ ఎక్కువ థియేటర్స్‌లో విడుదల కానుందని చెప్పారు. ఈ సందర్భంగా దిల్‌రాజు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డితో జరిగిన భేటీపైనా స్పందించారు. చిత్ర పరిశ్రమలో ఉన్న అన్ని సమస్యల్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లగా.. వాటికి పరిష్కారాల్ని కూడా తీసుకొస్తే ప్రభుత్వం తరపున ఏ సహాయం చేయడానికైనా సిద్ధంగా ఉన్నామని మాటిచ్చినట్లు తెలిపారు. ఈసీ మీటింగ్‌లో ఈ సమస్యలపై అందరితో చర్చించి.. వాటి పరిష్కారాల్ని తీసుకొని త్వరలో సీఎంను మళ్లీ కలుస్తామని చెప్పారు. అనంతరం నిర్మాత రాజేష్‌ దండా మాట్లాడుతూ.. ‘‘తమ ‘ఊరు పేరు భైరవకోన’ చిత్రాన్ని ఫిబ్రవరి 16న విడుదల చేయనున్నామ’ని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో నిర్మాతలు దామోదర్‌ ప్రసాద్‌, వివేక్‌ కూచిభొట్ల, వైవీఎస్‌ చౌదరి, రాజేష్‌ దండా, టి.ప్రసన్న కుమార్‌, ఏకే రాజు, సునీల్‌ నారంగ్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని