Family Star: హీరో అంటే హీరో పనే చేయాలి.. సినిమాను సినిమాటిక్‌గానే తీయాలి: దిల్‌ రాజు

Family Star: ఫ్యామిలీస్టార్‌ కుటుంబ ప్రేక్షకులను అలరిస్తోందని సినీ నిర్మాత దిల్‌ రాజు అన్నారు.

Published : 05 Apr 2024 21:18 IST

హైదరాబాద్‌: ఏ సినిమా అయినా ఆడిటోరియంలో 70శాతం ప్రేక్షకులకు నచ్చితే అది హిట్‌ అని సినీ నిర్మాత దిల్‌ రాజు (Dil Raju) అన్నారు. విజయ్‌ దేవరకొండ (Vijay Deverakonda) కథానాయకుడిగా పరశురామ్‌ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ఫ్యామిలీస్టార్‌’ (Family star). మృణాళ్‌ ఠాకూర్‌ కథానాయిక. శుక్రవారం ప్రేక్షకుల ముందుకువచ్చిన ఈ చిత్రం కుటుంబ ప్రేక్షకులను అలరిస్తోంది. ఈసందర్భంగా దర్శకుడితో కలిసి దిల్‌ రాజు విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. పలువురు మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చారు. తమ కుటుంబాన్ని ఉన్నత స్థానాలకు తీసుకెళ్లిన నిజమైన ఫ్యామిలీస్టార్స్‌ను కలవబోతున్నామని శనివారం నుంచి విజయ్‌, మృణాళ్‌, పరశురామ్‌తో కలిసి ఈ ప్రయాణం కొనసాగుతుందని చెప్పారు.

‘‘దర్శకుడు రాసుకున్న కథ, పాత్రను బట్టి నటీనటుల ఎంపిక ఉంటుంది. వెన్నెల కిషోర్‌ను కూడా అలాగే ఎంపిక చేసుకున్నాం. ఆయన కనిపించిన సీన్స్‌కు విపరీతంగా నవ్వుతున్నారు. పెళ్లి సాంగ్‌ మంచి హిట్‌ అయింది. అయితే, సినిమా ఫ్లో ఆగిపోతోందనే కారణంతోనే ఆ పాటను చివర పెట్టారు. పాట పూర్తిగా వేయకుండా ఆపేస్తున్నారని కొందరు అన్నారు. ఆపరేటర్లకు తెలియదు కదా.. ఇప్పుడు అందరికీ చెబుతాం. పూర్తి పాటను ప్రదర్శించాల్సిందే. సెకండాఫ్‌లో కుటుంబం కోసమే హీరో అమెరికా వెళ్తాడు. మొత్తం మూవీ ఇక్కడే తీస్తే, ‘టీవీ సీరియల్‌ తీశార్రా బాబూ’ అని మీరే అంటారు. విలన్‌ను బట్టి హీరో ఉంటాడు. రెండు జిల్లాల నుంచి మనుషులు వస్తే హీరో కొట్టకుండా ఉంటాడా? హీరో అంటే హీరో పనే చేయాలి. ఇప్పటివరకూ ఎన్నో సినిమాలు చూశాం. ఫైట్‌లో హీరో 20 మందిని కొడతాడు. నిజ జీవితంలో మనం కొడతామా? అన్ని యాక్షన్‌ మూవీలు బ్లాక్‌బస్టర్సే కదా! ఎమోషన్స్‌ కనెక్ట్‌ అయితే లాజిక్స్‌ అడగం. కొందరు నచ్చని విషయాలు చెప్పినా మేము తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఇక నుంచి ఫ్యామిలీ ఆడియెన్స్‌ కూడా థియేటర్లకు క్యూ కడతారు. సినిమాలో హీరోయిన ఎక్కడా డామినేట్‌ చేయలేదు. సెకండాఫ్‌లో మూవీ మొత్తం హీరోనే కనపడతాడు. సినిమాను సినిమాటిక్‌గానే తీయాలి. లేకపోతే డాక్యుమెంటరీ తీశారంటూ మీరే (రివ్యూవర్స్‌) అంటారు. ఇక్కడ రెండే విషయాలు గుర్తు పెట్టుకోవాలి. మూవీ ప్రేక్షకులకు నచ్చిందా? లేదా? అంతే..!’’ అంటూ దిల్‌రాజు అన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని