Dil Raju: నన్ను తిట్టుకోవద్దు.. ఈసారి నేను ఎలాంటి లీకులు ఇవ్వలేను: దిల్‌రాజు

రామ్‌చరణ్‌ (Ram Charan) పుట్టినరోజు సందర్భంగా బుధవారం సాయంత్రం హైదరాబాద్‌లో వేడుకలు జరిగాయి. పలువురు సినీ ప్రముఖులు ఇందులో సందడి చేశారు. చరణ్‌తో తమకున్న అనుబంధాన్ని పంచుకున్నారు.

Published : 28 Mar 2024 10:40 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: రామ్‌చరణ్‌ (Ram Charan) పుట్టినరోజును పురస్కరించుకుని హైదరాబాద్‌లో నిర్వహించిన వేడుకల్లో సినీ ప్రముఖులు సందడి చేశారు. ఈ సందర్భంగా నిర్మాత దిల్‌రాజు (Dil Raju) ‘గేమ్‌ఛేంజర్‌’(Game Changer)పై ఆసక్తికర అప్‌డేట్స్‌ ఇచ్చారు. సినిమా చిత్రీకరణ తుది దశకు చేరుకుందన్నారు. కీలక అప్‌డేట్స్‌ కోసం కాస్త ఓపిక పట్టమని అభిమానులను కోరారు.

‘‘మీ ఓపికకు ఎంతో పరీక్ష పెడుతున్నాం. ఒక తుపాను వచ్చే ముందు కాస్త ఓపిక పట్టక తప్పదు. రామ్‌చరణ్‌ ఇప్పుడు మెగా పవర్‌స్టార్‌ కాదు.. గ్లోబల్‌ స్టార్‌. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ తర్వాత వస్తోన్న సినిమా కాబట్టి ఆ స్థాయికి రీచ్‌ అయ్యేలా శంకర్‌ దీనిని తీర్చిదిద్దుతున్నారు. మరో రెండు నెలల్లో షూట్‌ పూర్తి కానుంది. ఐదు నెలల్లో రిలీజ్‌ చేస్తాం. చరణ్‌ బర్త్‌డేను పురస్కరించుకుని ‘జరగండి జరగండి’ పాట విడుదల చేశాం. సాంగ్‌లో చూసింది కేవలం రెండు శాతం మాత్రమే. 98 శాతం దాచి ఉంచాం. థియేటర్‌లో ఈ పాట చూసి ప్రేక్షకులు తప్పకుండా డ్యాన్స్‌ చేస్తారు. ఐదు నెలలు కాస్త నన్ను తిట్టుకోకుండా ఓపిక పట్టండి. ‘దిల్‌ మామా.. మాకొక అప్‌డేట్‌ ఇవ్వు’ అంటూ మీరు పెడుతున్న కామెంట్స్‌ చూస్తున్నా. ఈ చిత్రానికి సంబంధించి నేను ఎలాంటి లీకులు ఇవ్వలేను. శంకర్‌ అప్‌డేట్‌ ఇవ్వమంటే నేను ఇస్తా అంతే’’ అని దిల్‌ రాజు అన్నారు.

రామ్‌చరణ్‌ - శంకర్‌ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న చిత్రం ‘గేమ్‌ ఛేంజర్‌’. కియారా అడ్వాణీ కథానాయిక. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై దిల్‌రాజు, శిరీష్‌ నిర్మిస్తున్నారు. రామ్‌చరణ్‌ యువ ఐఏఎస్‌ అధికారిగా కనిపించనున్నారు. పాన్‌ ఇండియా స్థాయిలో ఇది విడుదల కానుంది. శ్రీకాంత్‌, ఎస్‌.జె.సూర్య, సునీల్‌, అంజలి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. దీని తర్వాత చరణ్‌... ‘ఉప్పెన’ ఫేమ్‌ బుచ్చిబాబు దర్శకత్వంలో సినిమా చేయనున్నారు. ‘ఆర్‌సీ 16’గా ఇది ప్రచారంలో ఉంది. జాన్వీ కపూర్‌ కథానాయిక. ఏఆర్‌ రెహమాన్‌ స్వరాలు అందించనున్నారు. ఇప్పటికే మూడు పాటలు కంపోజింగ్‌ పూర్తైందని.. రెహమాన్‌ అద్భుతంగా స్వరాలు అందించారని ఈ వేడుకల్లో బుచ్చిబాబు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని