Vijay Deverakonda: పెద్ద కార్లు ఎలా కొంటారో అనుకునేవాడిని: విజయ్‌ దేవరకొండ

‘ఫ్యామిలీ స్టార్‌’ లాంటి సినిమా ఏ హీరోకు వచ్చినా వదులుకోరని విజయ్‌ దేవరకొండ అన్నారు.

Published : 04 Apr 2024 00:08 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: విజయ్‌ దేవరకొండ హీరోగా పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన కుటుంబ కథా చిత్రం ‘ఫ్యామిలీ స్టార్‌’ (Family Star). ఏప్రిల్‌ 5న ప్రేక్షకుల ముందుకురానుంది. దీంతో చిత్రబృందం ప్రమోషన్స్‌ జోరు పెంచింది. తాజాగా దిల్‌రాజు ఓ ప్రత్యేక ఇంటర్వ్యూ చేశారు. అందులో విజయ్‌ దేవరకొండ (Vijay Deverakonda), మృణాల్‌ ఠాకూర్‌, పరశురామ్‌ పాల్గొని సినిమా విశేషాలు పంచుకున్నారు. ఏప్రిల్‌ 5 తనకెంతో ప్రత్యేకమైన తేదీ అని దిల్‌రాజు చెప్పారు. 21 ఏళ్ల క్రితం ఇదే తేదీన ‘దిల్‌’ సినిమా విడుదలైందన్నారు.

విజయ్‌ మాట్లాడుతూ.. ‘‘గీత గోవిందం’, ‘ఫ్యామిలీ స్టార్‌’ రెండు కథలు విన్నప్పుడు పరశురామ్‌ చెప్పే విధానానికే నాకు నవ్వు వచ్చింది. ఈ చిత్రం మన ఇంట్లో జరిగే కథలా ఉంటుంది. నేను బాగా కనెక్ట్‌ అయ్యా. గోవర్ధన్‌ పాత్ర అందరికీ నచ్చుతుంది. ఇలాంటి సినిమా ఏ హీరోకు వచ్చినా వదులుకోడు. ఒకప్పుడు నేను బస్‌లో వెళ్తూ రోడ్డుపై కార్లు చూసి.. ఎలా కొంటారో ఇంత పెద్ద కార్లు, డబ్బులు ఎలా వస్తాయో అనుకునేవాడిని. ఎప్పటికైనా మంచి కారు కొనాలని అనుకొన్నా. మా నాన్న నేను నటించిన ప్రతీ చిత్రం చూస్తారు. నచ్చకపోతే వెంటనే చెప్పేస్తారు. దీన్ని కూడా చూపించా. చాలా ఎంజాయ్‌ చేశారు’’ అంటూ ఆనందం వ్యక్తంచేశారు. ‘ఇందులోని చాలా సన్నివేశాలు నా నిజజీవితంలో జరిగినవే. మిడిల్‌ క్లాస్‌ వాళ్లకు ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటుంది. అదే ఈ చిత్రంలో చూపించాను. సాంగ్స్‌ బాగుంటే ప్రేక్షకులు సినిమాకు కనెక్ట్‌ అవుతారు. అందుకే ఇందులోని పాటలు సందర్భానికి తగ్గట్లే వస్తాయి. కొన్నేళ్లపాటు ఈ సినిమా గురించి మాట్లాడుకుంటారు. మా అమ్మే మా ఇంట్లో ఫ్యామిలీస్టార్‌. నేను గొప్పవాడిని అవుతానని ఆమె అప్పుడే చెప్పింది’ అని పరశురామ్ తెలిపారు. ఇలాంటి జోనర్‌ సినిమాల్లో తానెప్పుడు నటించలేదని మృణాల్ అన్నారు. ఈ చిత్రం విడుదలయ్యాక ‘ఏవండీ’ అనే పదం వైరల్ అవుతుందని.. అందరూ అదే పదంతో పిలుచుకుంటారన్నారు.

సెన్సార్‌ పూర్తి.. ఎన్ని పదాలు మ్యూటంటే!

తాజాగా ఈ సినిమా సెన్సార్‌ పూర్తి చేసుకుంది. బోర్డు ఈ చిత్రానికి యూ/ఏ సర్టిఫికెట్‌ ఇచ్చింది. అయితే కొన్ని పదాలను మాత్రం మ్యూట్‌ చేయాలని సూచించింది. 2 గంటల 43 నిమిషాల నిడివి ఉన్న ఇందులో నాలుగు పదాలను మ్యూట్‌ చేయాలని సెన్సార్‌ ఆదేశించింది. అలాగే ఒక పాటలో కూడా సీజీ(గ్రాఫిక్‌) వాడాలని సూచించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని