Harish shankar: ప్రేక్షకుల అభిరుచికి అనుగుణంగా సర్దుకోవడం.. లేదా సర్దేసుకుని పోవడమే!

దర్శకుడు హరీశ్ శంకర్‌ తాజాగా చేసిన ఓ ట్వీట్‌ వైరల్‌ అవుతోంది.

Updated : 16 Jan 2024 17:21 IST

హైదరాబాద్‌: సామాజిక మాధ్యమాల వేదికగా ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే దర్శకుల్లో హరీశ్‌ శంకర్‌ (Harish shankar) ఒకరు. సినిమాలపైనే కాకుండా పలు సామాజిక అంశాలపైనా తన అభిప్రాయాన్ని నిర్మొహమాటంగా తెలియచేస్తారు. ట్విటర్‌ వేదికగా ఇప్పుడు ఆయన చేసిన ఓ ట్వీట్‌ బాగా వైరల్‌ అవుతోంది.

“ఇక్కడ ఎవరికీ ఎవరి మీదా నెగెటివిటీ ఉండదు. ఒకవేళ ఉన్నా ఏదో ఒక శుక్రవారం ఎవరో ఒకరు దొరికేస్తారు. ఎవడన్నా, పక్కవాడి అపజయానికి  సోలో డ్యాన్స్ వేస్తే, రేపు వాడి అపజయానికి గ్రూప్ డ్యాన్సర్లు రెడీ అవుతారు’’ అని మాస్‌ హీరో రవితేజ తనతో చెప్పారంటూ ఆ మాటలను ట్వీట్‌ చేశారు. ఇలాంటి విశాల దృక్పథం ఉండబట్టే రవితేజ అన్నయ్య ఎంతో సంతోషంగా ఉంటారని హరీశ్‌ శంకర్‌ పేర్కొన్నారు.

సంక్రాంతి సినిమాల విడుదలకు ముందు, తర్వాత తెలుగు చిత్ర పరిశ్రమలో నెలకొన్న పరిస్థితులనుద్దేశించి హరీశ్‌ శంకర్‌ ఈ ట్వీట్‌ చేశారంటూ నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. హరీశ్‌ ట్వీట్‌కు రవితేజ బదులిస్తూ ‘మరి దీనికి నీ ఎక్సటెన్షన్‌ పెట్టవేంట్రా’ అన్నారు.

‘మీకు అన్నీ గుర్తుంటాయ్‌ అన్నయ్యా.. యువర్‌ రైట్‌. మారుతున్న ప్రేక్షకుల అభిరుచికి అనుగుణంగా సర్దుకుంటూ పోవడం లేదా మొత్తం సర్దేసుకొని వెళ్లిపోవడం’ ఇదే నా ఎక్స్‌టెన్షన్‌’ అంటూ హరీశ్‌ రిప్లై ఇచ్చారు. రవితేజ (Ravi) కథానాయకుడిగా హరీశ్ శంకర్‌ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ‘మిస్టర్‌ బచ్చన్‌’ పేరుతో దీన్ని తెరకెక్కిస్తున్నారు. హిందీలో ఘన విజయం సాధించినన ‘రైడ్‌’ మూవీకి రీమేక్‌ అని టాక్‌. మరోవైపు పవన్‌ హీరోగా ‘ఉస్తాద్‌ భగత్‌సింగ్‌’ను కూడా హరీశ్‌ రూపొందిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని