Krishna Chaitanya: ఈ కథకు మూలం మహాభారతమే!

‘‘ప్రతి దర్శకుడిలోనూ ప్రత్యేకంగా ఓ బలం ఉంటుంది. నా బలం భావోద్వేగాలే. గుండెల్ని తాకే అనుభూతిని పంచే భావోద్వేగాలతో ‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ చిత్రాన్ని తీశా’’ అన్నారు కృష్ణచైతన్య.

Published : 30 May 2024 02:11 IST

‘‘ప్రతి దర్శకుడిలోనూ ప్రత్యేకంగా ఓ బలం ఉంటుంది. నా బలం భావోద్వేగాలే. గుండెల్ని తాకే అనుభూతిని పంచే భావోద్వేగాలతో ‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ చిత్రాన్ని తీశా’’ అన్నారు కృష్ణచైతన్య. విష్వక్‌సేన్‌ కథానాయకుడిగా రూపొందిన ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా ఆయన పంచుకున్న చిత్ర విశేషాలివీ..

‘‘పేరు చూసి చాలామంది ఇదొక గ్యాంగ్‌స్టర్‌ సినిమానా.. అని అడుగుతున్నారు. గ్యాంగ్స్‌ ఉన్న సినిమానే తప్ప... ఇది గ్యాంగ్‌స్టర్‌ సినిమా కాదు. ఓబు, యాదు, దొరసామి, నానాజీ.. ఇలా నలుగురు ఈ కథలో కీలకం. గోదావరి నేపథ్యం అనగానే కొబ్బరి చెట్లు, పచ్చని వాతావరణంతో అంతా ప్రశాంతం అన్నట్టుగా సినిమాల్లో చూపిస్తుంటారు. నిజానికి అక్కడా నేరాలు జరుగుతాయి. ప్రాంతాల్నిబట్టి కాకుండా, మనుషుల్నిబట్టే నేరాలు చోటు చేసుకుంటాయి. ఆ ఆలోచనతో పాటు, మహాభారతంలోని ‘నా అనేవాడే నీకు మొదటి శత్రువు’ అనే నాకు ఇష్టమైన మాట ఈ కథకి మూలం. నాకు దొరికిన అవకాశాన్ని, స్వేచ్ఛ ఆధారంగా ఈ కథని తెరపై ఆవిష్కరించే ప్రయత్నం చేశా’’. 

  • ‘మొదట ఈ కథని శర్వానంద్, రాశీఖన్నా జంటగా తీయాలనుకున్నా. తీవ్ర భావోద్వేగాలున్న ఈ సినిమాని కొన్నాళ్లు ఆగాక చేస్తే బాగుంటుందన్నారు. ఇది ఆలస్యమైతే ఎక్కువ విరామం వస్తుందనే భయం మొదలైంది. త్రివిక్రమ్‌ సర్‌ సూచనతో విష్వక్‌సేన్‌కి కథ చెప్పా. అలా ప్రయాణం మొదలైంది. తెలంగాణలో పుట్టి పెరిగిన విష్వక్‌ నెల రోజుల్లోనే గోదావరి మాండలీకాన్ని నేర్చుకుని రంగంలోకి దిగాడు. చెన్నైలో డీటీఎస్‌ పనులు చేయిస్తున్నప్పుడు ‘ఓ తెలుగు నటుడి నుంచి ఇంత గాఢమైన నటనని ఊహించలేద’ని చెప్పారు అక్కడివాళ్లు. యువన్‌ శంకర్‌రాజా గొప్ప నేపథ్య సంగీతాన్ని అందించారు’’. 
  • ‘‘పాటల రచయితగా నా వల్ల ఎప్పుడూ ఎవరికీ ఆలస్యమయ్యేది కాదు. రచనలో అయినా, దర్శకత్వం విషయంలో అయినా మనకంటూ కొన్ని ఇష్టాలు ఉంటాయి. అయితే ఈ స్థాయిలో ఓ సినిమా చేస్తున్నప్పుడు మన ఇష్టాలు అందరికీ నచ్చవు. అందరికీ నచ్చేలా మన పనితీరుని బ్యాలెన్స్‌ చేసుకుంటూ ప్రయాణం చేయాల్సి ఉంటుంది. అది ఈ సినిమాతో నేర్చుకున్నా. అయితే ఆ క్రమంలో అందరికీ నచ్చాలని నా అభిప్రాయాన్ని మాత్రం పూర్తిగా మార్చుకోను. అనుకున్నది అనుకున్నట్టు చేశామని ఏ దర్శకుడైనా చెప్పారంటే అది అబద్ధమనేది నా అభిప్రాయం’’. 
  • ‘‘బడ్జెట్‌ పరిమితుల వల్లే నేను ముందు అనుకున్న ‘పవర్‌పేట’ సినిమా ఆగింది. నేను ఓ మంచి హిట్‌ సినిమా తీస్తేనే, ఆ కథకి పెట్టుబడి పెట్టే ధైర్యం నిర్మాతలకి వస్తుందని అర్థమైంది. అందుకే ఈ కథ రాసుకుని చేశా. నాకు పవన్‌కల్యాణ్‌ అంటే చాలా ఇష్టం. ఆయనతో సినిమా తీయాలనేది నా కల. ‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ కొనసాగింపు కోసం పూర్తిస్థాయి కథ లేదు కానీ, ఓ లైన్‌ ఉంది. విజయం వచ్చిందంటే ఆ ఉత్సాహంలో కొనసాగింపు కథ ఎంతసేపు? నెల రోజుల్లో రాసేస్తా’’.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని