Devil: ‘డెవిల్‌’ వివాదం.. దర్శకుడిగా క్రెడిట్‌ ఇవ్వకపోవడం బాధించింది: నవీన్‌ మేడారం

‘డెవిల్‌’ (Devil) సినిమా దర్శకత్వం విషయంలో నెలకొన్న వివాదంపై నవీన్‌ మేడారం (Naveen Medaram) స్పందించారు. ఈ చిత్రానికి తానే దర్శకత్వం వహించినట్లు ప్రకటించారు.

Updated : 27 Dec 2023 15:04 IST

హైదరాబాద్‌: కల్యాణ్‌ రామ్‌ (Kalyan Ram) ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘డెవిల్‌’ (Devil). అనుకోని కారణాల వల్ల దర్శకుడు నవీన్‌ మేడారం ఈ ప్రాజెక్ట్‌ నుంచి వైదొలగినట్లు గతంలో వార్తలు వచ్చాయి. దీంతో ఈ చిత్రానికి దర్శక-నిర్మాతగా అభిషేక్‌ నామా (Abhishek Nama) పేరు తెరపైకి వచ్చింది. ‘డెవిల్‌’ దర్శకత్వం విషయంలో నెలకొన్న వివాదంపై తాజాగా నవీన్‌ మేడారం స్పందించారు. ఈ చిత్రానికి తానే దర్శకత్వం వహించినప్పటికీ తనకు క్రెడిట్‌ ఇవ్వలేదంటూ ఇన్‌స్టాలో పోస్ట్ పెట్టారు.

‘‘డెవిల్’ చిత్రానికి ప్రాణం పోసేందుకు దాదాపు మూడేళ్లు శ్రమించా. స్క్రిప్ట్‌, స్క్రీన్‌ప్లే రాయడం, కాస్ట్యూమ్స్, సెట్స్‌, లొకేషన్స్‌ ఎంపిక.. ఇలా సినిమాలోని ప్రతి అంశాన్ని నా ఆలోచనకు తగ్గట్టుగా తీర్చిదిద్దా. హైదరాబాద్‌, వైజాగ్‌, కారైకుడి వంటి ప్రాంతాల్లో షూట్‌ చేశా. చిన్న చిన్న సన్నివేశాల చిత్రీకరణ మినహా.. దాదాపు 105 రోజులు కష్టపడి.. నేను అనుకున్నవిధంగా ‘డెవిల్‌’ను తెరకెక్కించా. నా వరకూ ఇది కేవలం ప్రాజెక్ట్‌ మాత్రమే కాదు. ఇది నా బిడ్డలాంటిది. ఎవరు ఎన్ని చెప్పినా సరే.. ఇది పూర్తిగా నా చిత్రమే.

The Archies: ‘ది ఆర్చీస్‌’ నాకు నచ్చలేదు: బాలీవుడ్‌ నటుడు

ఇప్పటి వరకూ ఎలాంటి పరిస్థితులు వచ్చినా నేను మౌనంగా ఉన్నా. అయితే, నా మౌనాన్ని కొందరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. ఈ చిత్రాన్ని తెరకెక్కించడంలో నేను ఎలాంటి తప్పు చేయలేదని క్లారిటీ ఇచ్చేందుకే ఈ పోస్ట్‌ పెడుతున్నా. అహంకారం, దురాశతో తీసుకున్న కొన్ని నిర్ణయాల ఫలితంగానే నేడు ఇలాంటి వివాదం మొదలైంది. ఇటీవల ప్రచురితమవుతోన్న కథనాల్లో చెప్పినట్లు.. సినిమా, లేదా చిత్రబృందానికి సంబంధించిన ఏ వ్యక్తిపైనా నేను చట్టపరమైన చర్యలు తీసుకోవడం లేదు. దర్శకుడిగా నాకు క్రెడిట్‌ ఇవ్వనందుకు ఎంతో బాధపడుతున్నా. నా నైపుణ్యంపై నాకు నమ్మకం ఉంది. శ్రద్ధ, నిబద్ధతతో కెరీర్‌లో ముందుకు వెళ్లాలనుకుంటున్నా. మరింత ధైర్యంగా కమ్‌బ్యాక్‌ ఇవ్వాలనుకుంటున్నా.

‘డెవిల్‌’ కోసం కల్యాణ్‌రామ్‌ ఎంతో శ్రమించారు. ఈ చిత్రాన్ని తెరకెక్కించడంలో నాకు అండగా నిలిచిన కల్యాణ్‌రామ్‌తోపాటు ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. ‘డెవిల్‌’ తప్పకుండా బ్లాక్‌బస్టర్‌ అవుతుందని నమ్ముతున్నా. డిసెంబర్‌ 29న ప్రతి ఒక్కరూ ఈ చిత్రాన్ని వీక్షించాలని కోరుకుంటున్నా. కొత్త చిత్రానికి సంతకం చేశా. ఆసక్తికరమైన స్క్రిప్ట్‌ కోసం వర్క్‌ చేస్తున్నా. త్వరలోనే వివరాలు వెల్లడిస్తా’’ అని నవీన్‌ రాసుకొచ్చారు. సస్పెన్స్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రంలో సంయుక్త కథానాయిక. అభిషేక్‌ పిక్చర్స్‌ పతాకంపై దీనిని నిర్మించారు. శ్రీకాంత్‌ విస్సా కథను అందించారు.

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని