Hanuman: ఈ క్షణాలను జీవితాంతం గుర్తు పెట్టుకుంటా: ‘హనుమాన్‌’ దర్శకుడు ప్రశాంత్‌ వర్మ

‘హనుమాన్‌’ (Hanuman) విజయంపై మరోసారి స్పందించారు చిత్ర దర్శకుడు ప్రశాంత్‌ వర్మ (Prasanth varma). ఈ సినిమా విడుదలై వందరోజులు దాటిన సందర్భంగా ఆయన సోషల్‌ మీడియాలో ఓ పోస్ట్‌ పెట్టారు.

Published : 22 Apr 2024 13:42 IST

హైదరాబాద్‌: ‘హనుమాన్‌’ (Hanuman) విడుదలై నేటితో 100 రోజులవుతోంది. తేజ సజ్జా హీరోగా ప్రశాంత్‌ వర్మ రూపొందించిన ఈ చిత్రం ఇప్పటికీ పలు థియేటర్లలో ప్రదర్శిస్తున్నారు. దీనిపై ప్రశాంత్‌ వర్మ హర్షం వ్యక్తం చేశారు. ‘‘ఈ అద్భుత ప్రయాణంలో భాగమైన వారికి నా కృతజ్ఞతలు. ఆనందంతో మనసు నిండిపోయింది. పలు థియేటర్లలో ‘హనుమాన్‌’ శత దినోత్సవం చేసుకోవడం సంతోషంగా ఉంది. ఈ క్షణాలను జీవితాంతం గుర్తుపెట్టుకుంటా. థియేటర్లలో ఒక సినిమా 100 రోజులు ఆడటమనేది అరుదుగా మారిన సమయంలో.. మాకు ఇలాంటి ఆనందాన్ని అందించిన ప్రేక్షకులకు ఎప్పటికీ రుణపడి ఉంటా. నాకెంతో సపోర్ట్‌ చేసిన చిత్రబృందానికి, మీడియా మిత్రులకు థ్యాంక్యూ’’ అని ఆయన ‘ఎక్స్‌’లో పోస్ట్‌ పెట్టారు. 

తేజ సజ్జా సైతం ఈ విషయంపై ఆనందం వ్యక్తం చేశారు. ‘‘ఆనందంతో మనసు నిండింది. మీ వల్లే దీనిని సాధించాననే విషయాన్ని ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటా. ‘హనుమాన్‌’.. నాకు జీవితాంతం గుర్తుండే ఓ మధుర జ్ఞాపకం’’ అని పేర్కొన్నారు. సంక్రాంతి కానుకగా విడుదలై విశేష ప్రేక్షకాదరణ పొందిన చిత్రం ‘హనుమాన్‌’ (HanuMan). అమృతా అయ్యర్‌ కథానాయిక. వినయ్‌ రాయ్‌, వరలక్ష్మి శరత్‌కుమార్‌, వెన్నెల కిషోర్‌ కీలక పాత్రలు పోషించారు. ఇప్పటి వరకూ ఇది ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ.300 కోట్లు రాబట్టినట్లు సమాచారం. ఈ చిత్రానికి కొనసాగింపుగా ‘జై హనుమాన్‌’ రానున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నట్లు సమాచారం. 2025లో ఇది విడుదల కానుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని