Sandeep Vanga: ‘స్పిరిట్‌’.. ‘యానిమల్‌’లా కాదు.. మహేశ్‌తో సినిమా ఉంటుంది: సందీప్‌

తాను దర్శకత్వం వహించిన తాజా చిత్రం ‘యానిమల్‌’ డిసెంబరు 1న విడుదల కానున్న సందర్భంగా సందీప్‌ రెడ్డి వంగా పలు ఇంటర్వ్యూల్లో ఆసక్తికర విశేషాలు పంచుకున్నారు.

Published : 30 Nov 2023 02:04 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘అర్జున్‌రెడ్డి’తో తొలి ప్రయత్నంలోనే దర్శకుడిగా మంచి గుర్తింపు పొందారు సందీప్‌ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga). ఆయన తెరకెక్కించిన తాజా చిత్రం ‘యానిమల్‌’ (Animal). రణ్‌బీర్‌ కపూర్‌ (Ranbir Kapoor), రష్మిక (Rashmika Mandanna) హీరో, హీరోయిన్లుగా నటించారు. అనిల్ కపూర్‌, బాబీ దేవోల్‌ కీలక పాత్రలు పోషించారు. డిసెంబరు 1న (Animal Release Date) సినిమా విడుదలకానున్న సందర్భంగా సందీప్‌ పలు ఇంటర్వ్యూల్లో పాల్గొని ఆసక్తికర విశేషాలు పంచుకున్నారు. గతంలో తెరకెక్కించిన సినిమా సంగతులతోపాటు కొత్త ప్రాజెక్టు గురించి మాట్లాడారు. ఆ విశేషాలు ఆయన మాటల్లోనే..

సినిమా చూస్తే పూర్తిగా అర్థమవుతుంది!

ట్రైలర్‌లో రష్మిక హీరోపై మండిపడే సన్నివేశంపై సందీప్‌ స్పందిస్తూ.. ‘‘ఆ సన్నివేశానికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తుందని ముందే తెలుసు. భావోద్వేగానికి గురైతే ఎవరైనా పళ్లు బిగించి మాట్లాడడం సహజం. ఎమోషనల్‌ సీన్‌ కాబట్టి హీరోయిన్‌ క్యారెక్టర్‌ అలా ప్రవర్తించింది. సినిమా చూస్తే ఆ పాత్ర లోతు అర్థమవుతుంది’’ అని అన్నారు.

మహేశ్‌బాబు, విజయ్‌లతో సినిమాలు..

‘‘మహేశ్‌ బాబుకు ఓ పాయింట్‌ వినిపించా. ఆయన సినిమా చేద్దామని చెప్పిన సమయానికి నేను సిద్ధంగా లేను. స్క్రిప్టు పూర్తి చేసేందుకు చాలా సమయం తీసుకున్నా. మధ్యలో బాలీవుడ్‌కు వెళ్లా. అలా మా కాంబోలో సినిమా తెరకెక్కలేదు. అంతేగానీ ఆయన నేను చెప్పిన కథను తిరస్కరించలేదు. ఆయనతో తప్పకుండా సినిమా చేస్తా. ఎప్పుడనేది చెప్పలేను. విజయ్‌ దేవరకొండతోనూ మళ్లీ కలిసి చేయాలని ఉంది’’ అని తెలిపారు.

స్పిరిట్‌.. ఆసక్తికరం

‘‘ప్రభాస్‌తో తెరకెక్కించబోయే ‘స్పిరిట్‌’ సినిమా కథ ఆసక్తికరంగా ఉంటుంది. అది ‘యానిమల్‌’లా ఎక్కువ నిడివితో రూపొందేది కాదు. 2:25 నుంచి 3 :00 గంటల రన్‌టైమ్‌ ఉండొచ్చు’’ అని సందీప్‌ అంచనా వేశారు.

రణ్‌వీర్‌ తిరస్కరించారు..

‘‘కబీర్‌సింగ్‌’ (అర్జున్‌రెడ్డి రీమేక్‌) సినిమాలో హీరోగా ముందు రణ్‌వీర్‌ సింగ్‌ను అనుకున్నా. కానీ, తనకు సెట్‌కాదని ఆయన తిరస్కరించారు. దాంతో, షాహిద్‌ కపూర్‌ను ఎంపిక చేశా. ప్రస్తుతానికి రీమేక్‌ మళ్లీ రీమేక్స్‌ చేయాలనే ఆలోచన లేదు’’ అని తెలిపారు.

ఎవరూ సీరియస్‌గా తీసుకోలేదా..!

అల్లు అర్జున్‌కు ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు రావడంపై స్పందిస్తూ.. ‘‘అల్లు అర్జున్‌కు అవార్డు రావడం ఆనందంగా ఉంది. కానీ, ఇన్నేళ్ల నుంచి ఎవరూ సీరియస్‌గా తీసుకొని జాతీయ అవార్డులకు అప్లై చేయలేదా?’ అని అనిపించింది’’ అని అభిప్రాయం వ్యక్తం చేశారు. 

యానిమల్‌ సెన్సార్‌ రిపోర్టు..

తండ్రి, కొడుకుల సెంటిమెంట్‌తో యాక్షన్‌ థ్రిల్లర్‌గా రూపొందిన యానిమల్‌ సినిమా నిడివి 3:21 గంటలు. ఈ చిత్రానికి సెన్సార్‌ బోర్డు ‘ఏ’ సర్టిఫికెట్‌ జారీ చేసింది. సన్నివేశాలు, సంభాషణలు కలిపి మొత్తం ఆరు కట్స్‌ సూచించినట్లు తెలుస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని