Drishyam: హాలీవుడ్‌కు ‘దృశ్యం’.. తొలి భారతీయ చిత్రంగా రికార్డు

విడుదలైన అన్నిచోట్ల ఘన విజయం అందుకున్న ‘దృశ్యం’ సిరీస్‌ చిత్రాలు హాలీవుడ్‌లో రీమేక్‌ కానున్నాయి. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన తాజాగా వెలువడింది.

Updated : 29 Feb 2024 12:54 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: మలయాళ, తెలుగు, హిందీ భాషల్లో ఘనవిజయం సాధించిన చిత్రం ‘దృశ్యం’ (Drishyam) ఇప్పటికే పలు రికార్డులను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ చిత్రం రీమేక్‌లలో మరో ఘనత సాధించింది. ఏకంగా హాలీవుడ్‌ నిర్మాణ సంస్థ ఈ చిత్రాన్ని ఇంగ్లిష్‌, స్పానిష్‌లలో రీమేక్‌ చేయనున్నట్లు ప్రకటించింది. దీంతో హాలీవుడ్‌లో రీమేక్‌ కానున్న మొదటి భారతీయ చిత్రంగా ‘దృశ్యం’ నిలిచింది.

తొలుత మలయాళంలో రూపొందిన ఈ సినిమా అదే పేరుతో తెలుగు, హిందీలో, ‘దృశ్య’ పేరుతో కన్నడలో, ‘పాపనాశం’ పేరుతో తమిళ్‌లో తెరకెక్కి సత్తా చాటింది. దానికి సీక్వెల్‌గా రూపొందిన ‘దృశ్యం 2’ కూడా విజయవంతమైంది. దీంతో ఈ సిరీస్ చిత్రాల కథలు కొరియన్‌లో రీమేక్‌ చేశారు. అక్కడ కూడా భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాయి. ఇప్పుడు హాలీవుడ్‌లో ప్రసిద్ధి చెందిన గల్ఫ్‌ స్ట్రీమ్ పిక్చర్స్‌, మరో నిర్మాణ సంస్థతో కలిసి ‘దృశ్యం’ కథలను హాలీవుడ్‌ ప్రేక్షకులకు అందించనుంది. ఇండియన్‌ సినిమా నిర్మాణ సంస్థ పనోరమ స్టూడియోస్‌ నుంచి ఈ చిత్రాల అంతర్జాతీయ రీమేక్‌ హక్కులను ఆ సంస్థ సొంతం చేసుకుంది. దీంతో హలీవుడ్ ‘దృశ్యం’లో నటీనటులుగా ఎవరు కనిపించనున్నారన్నది ప్రస్తుతం ఆసక్తిగా మారింది.

‘స్పిరిట్‌’ హారర్‌ సినిమా కాదు.. స్టోరీ లైన్‌ చెప్పేసిన సందీప్‌ వంగా

ముందుగా.. ‘దృశ్యం’ని మోహన్‌లాల్‌, మీనా ప్రధాన పాత్రల్లో దర్శకుడు జీతూ జోసెఫ్‌ తెరకెక్కించారు. తెలుగులో వెంకటేశ్‌ హీరోగా శ్రీప్రియ పార్ట్‌ 1 తెరకెక్కించగా, పార్ట్‌ 2ను జీతూ జోసెఫ్‌ తెరకెక్కించారు. హిందీలో అజయ్‌ దేవ్‌గణ్‌, శ్రియ ప్రధాన పాత్రల్లో నటించారు. వేర్వేరు దర్శకులు వాటిని రూపొందించారు. తమిళ్‌ విషయానికొస్తే.. కమల్‌ హాసన్‌, గౌతమి ప్రధాన పాత్రల్లో నటించారు. త్వరలోనే మలయాళంలో ‘దృశ్యం 3’ రానుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని