Ravi Teja: ప్రేక్షకులు కొత్త రవితేజని చూస్తారు

‘‘నాకు చాలా తృప్తినిచ్చిన చిత్రం ‘ఈగల్‌’. ప్రేక్షకులు ఇందులో ఓ కొత్త రవితేజని చూస్తార’’న్నారు రవితేజ. ఆయన కథానాయకుడిగా... కార్తీక్‌ ఘట్టమనేని దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘ఈగల్‌’.

Updated : 27 Dec 2023 09:27 IST

‘‘నాకు చాలా తృప్తినిచ్చిన చిత్రం ‘ఈగల్‌’. ప్రేక్షకులు ఇందులో ఓ కొత్త రవితేజని చూస్తార’’న్నారు రవితేజ. ఆయన కథానాయకుడిగా... కార్తీక్‌ ఘట్టమనేని దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘ఈగల్‌’. పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్‌ నిర్మిస్తున్నారు. సంక్రాంతి సందర్భంగా జనవరి 13న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సినిమాకి ముందు రవితేజ - పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ కలయికలో రూపొందిన ‘ధమాకా’ విడుదలై డిసెంబరు 23తో ఏడాది పూర్తయింది. ఈ సందర్భంగా ‘ఈగల్‌ వర్సెస్‌ ధమాకా’ పేరిట ఇటీవల హైదరాబాద్‌లో ఓ వేడుకని నిర్వహించారు. ఈ సందర్భంగా రవితేజ మాట్లాడుతూ ‘‘నిన్నో మొన్నో విడుదలైనట్టుంది ‘ధమాకా’. ఏడాది అయ్యిందంటే నమ్మబుద్ధి కావడం లేదు. విశ్వప్రసాద్‌కి నా అభినందనలు. ‘ధమాకా’ కోసం సంగీత దర్శకుడు భీమ్స్‌ ఇచ్చిన పాటలు వినగానే, తనకి మంచి గుర్తింపు వస్తుందని నమ్మా. అదే నిజమైంది. ఇప్పుడు వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. మనకున్న ఉత్తమ సంగీత దర్శకుల్లో తనొకడు. మళ్లీ మేం కలిసి సినిమా చేస్తాం. శ్రీలీల కూడా నేను ఊహించినట్టే అగ్ర కథానాయికగా రాణిస్తోంది. ఇక ‘ఈగల్‌’ దర్శకుడు కార్తీక్‌ని ఇదివరకు ఛాయాగ్రాహకుడిగానే చూశాం. ఈ సినిమా విడుదల తర్వాత దర్శకుడిగా తనకి మంచి భవిష్యత్తు ఉంటుంది. తను నన్ను చాలా కొత్తగా చూపించాడు. కావ్య థాపర్‌ కూడా చాలా బాగా కనిపిస్తుంది. సంగీత దర్శకుడు దేవ్‌ జాంద్‌, గొప్పస్థాయికి చేరుకుంటాడు’’ అన్నారు.

దర్శకుడు కార్తీక్‌ ఘట్టమనేని మాట్లాడుతూ ‘‘ధమాకా’కి ఛాయాగ్రాహకుడిగా చేశా. ‘ఈగల్‌’ సినిమాకి దర్శకత్వం వహించా. రెండు సినిమాల్లోనూ రవితేజ హీరో. అయినా ఇద్దరు భిన్నమైన నటులతో పనిచేసినట్టుంది. ‘ఈగల్‌’ అన్ని వాణిజ్యాంశాలున్న మంచి చిత్రం. ఈ రెండు చిత్రాలకి అవకాశం ఇచ్చిన  విశ్వప్రసాద్‌, వివేక్‌ కూచిభొట్లకి కృతజ్ఞతలు’’ అన్నారు. ‘‘గతేడాదికి ఘన విజయంతో వీడ్కోలు పలికాం. ఈసారి విజయంతో కొత్త ఏడాదికి స్వాగతం పలుకుతాం. ‘ఈగల్‌’ సినిమాలో  రవితేజ మాస్‌ అవతారం, వినోదం కచ్చితంగా ప్రేక్షకుల్ని మెప్పిస్తాయి’’ అన్నారు టీజీ విశ్వప్రసాద్‌ ‘ధమాకా’తో ఈ ఏడాదంతా చాలా అద్భుతమైన ప్రయాణం సాగిందన్నారు శ్రీలీల. ఈ కార్యక్రమంలో వందన ప్రసాద్‌, శ్రీనివాస్‌ అవసరాల, హైపర్‌ ఆది, మంగ్లీ, భీమ్స్‌, వివేక్‌ కూచిభొట్ల తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని