Eesha Rebba: ప్రతి పది నిమిషాలకీ ఒక సర్‌ప్రైజ్‌!

‘‘వినోదం.. భావోద్వేగాలు.. థ్రిల్‌.. అన్ని మిళితమై ఉన్న చిత్రం ‘మామా మశ్చీంద్ర’. ఊహించని మలుపులతో ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతుంది’’ అంది నటి ఈషా రెబ్బా.

Updated : 01 Oct 2023 13:55 IST

‘‘వినోదం.. భావోద్వేగాలు.. థ్రిల్‌.. అన్ని మిళితమై ఉన్న చిత్రం ‘మామా మశ్చీంద్ర’. ఊహించని మలుపులతో ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతుంది’’ అంది నటి ఈషా రెబ్బా. సుధీర్‌బాబు త్రిపాత్రాభినయం చేసిన చిత్రమిది. ఈ చిత్రంలో ఈషా ఓ నాయికగా నటించింది. హర్షవర్ధన్‌ తెరకెక్కించారు. సినిమా ఈ నెల 6న థియేటర్లలోకి వస్తోంది. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్‌లో శనివారం విలేకర్లతో చిత్ర విశేషాలు పంచుకుంది ఈషా.

‘‘హర్షవర్ధన్‌ నటించిన ‘అమృతం’ నాకు చాలా ఇష్టం. అలాగే ‘మనం’, ‘గుండెజారి గల్లంతయ్యిందే’ చిత్రాల్లో ఆయన రైటింగ్‌ బాగా నచ్చుతుంది. అలాంటిది ఆయన దర్శకత్వం వహిస్తున్న సినిమా కోసం నన్ను సంప్రదించినప్పుడు చాలా ఆనందంగా అనిపించింది. నిజానికి ఈ చిత్రంలో ఓ కథానాయిక పాత్రకు నేను బాగుంటానని సుధీర్‌బాబు చెప్పారట. అది తెలిసి సంతోషపడ్డా’’.

  •  ‘‘ఈ చిత్రంలో నా పాత్ర పేరు వైరల్‌ విశాలాక్షి. చాలా హైపర్‌గా ఉంటుంది. టిక్‌టాక్‌ వీడియోలు చేస్తుంటుంది. ఇలాంటి పాత్ర చేయడం నాకు కొత్తగా అనిపించింది. దీంట్లో నేను సుధీర్‌బాబు పోషించిన దుర్గ పాత్రకు జోడీగా కనిపిస్తా. ట్రైలర్‌ చూసి కథ ఇదేనేమో అనుకుంటే పొరపడినట్లే. సినిమా మీ ఊహలకు అందని విధంగా ఉంటుంది. ప్రతి పది నిమిషాలకు ఒక సర్‌ప్రైజ్‌ ఉంటుంది. బోలెడన్ని ట్విస్ట్‌లు ఉన్నాయి’’.

  • ‘‘ఈ సినిమాలో సుధీర్‌బాబు మూడు భిన్నమైన పాత్రల్లో కనిపిస్తారు. ఆయన గెటప్స్‌తో పాటు సంభాషణలు విభిన్నంగా ఉంటాయి. బొద్దుగా ఉండే దుర్గ పాత్ర కోసం ఆయన చాలా కష్టపడ్డారు. ప్రోస్థటిక్‌ మేకప్‌లో ఆయన్ని సెట్లో తొలిసారి చూసినప్పుడు అసలు గుర్తుపట్టలేకపోయా. అలాగే దీంట్లో ప్రతి పాత్రకు ప్రాముఖ్యత ఉంటుంది. దానికొక బ్యాక్‌ స్టోరీ ఉంటుంది. ప్రీక్వెల్‌.. సీక్వెల్‌ తీసుకునేంత స్కోప్‌ ఈ కథలో ఉంది’’.

  • ‘‘అరవింద సమేత’ చిత్రం నాకెంతో పేరు తీసుకొచ్చింది. అయితే ఆ తర్వాత అన్నీ ఆ తరహా కథలు, పాత్రలే నా దగ్గరకొచ్చాయి. దీంతో వాటన్నింటికీ నో చెప్పా. ఎందుకంటే నాకు ఒకే తరహా మూస పాత్రలు చేయాలని లేదు. విభిన్నమైన మరిన్ని మంచి పాత్రలు చేయాలని ఉంది. ప్రస్తుతం తమిళంలో విక్రమ్‌ ప్రభుతో ఓ సినిమా చేస్తున్నా. తెలుగులో ఓ చిత్రం చేయనున్నా. ‘దయ 2’ సిరీస్‌ చేయాల్సి ఉంది’’.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని