Fahadh Faasil: మలయాళ సినిమాల హిట్‌కు కారణమిదే: ఫహాద్‌ ఫాజిల్‌

మలయాళ చిత్రాలు వరుస విజయాలు అందుకోవడంపై నటుడు ఫహాద్‌ ఫాజిల్‌ ఆనందం వ్యక్తంచేశారు. కంటెంట్ కొత్తగా ఉన్న కారణంగా సినిమాలు ప్రేక్షకాదరణ పొందుతున్నాయన్నారు.

Published : 23 Apr 2024 17:19 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రస్తుతం ఇండస్ట్రీలో మలయాళం సినిమాలు వరుస విజయాలు అందుకుంటున్నాయి. ఈ ఏడాదిలో విడుదలైన ‘ప్రేమలు’, ‘ఆడు జీవితం’, ‘బ్రహ్మయుగం’, ‘మంజుమ్మల్‌ బాయ్స్‌’ మంచి వసూళ్లు సాధించాయి. ఈ విషయంపై మలయాళ నటుడు ఫహాద్‌ ఫాజిల్‌ (Fahadh Faasil) తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు.

‘ఈ ఏడాది మలయాళం చిత్రాలు భారీ వసూళ్లను నమోదుచేయడం ఎంతో ఆనందంగా ఉంది. విడుదలైన ప్రతీ సినిమా ప్రేక్షకాదరణ పొందుతుంది. దానికి ప్రధాన కారణం కంటెంట్‌ భిన్నంగా ఉండడమే. కొత్త కథలను చూసేందుకు ప్రేక్షకులు థియేటర్లకు వస్తున్నారు. ఇప్పుడు దర్శక నిర్మాతలంతా చాలా ఉత్సాహంగా పని చేస్తున్నారు. కొత్త ప్రయోగాలు చేసేందుకు కూడా ఇదే సరైన సమయమని నేను భావిస్తున్నాను. నిర్మాతలకు నేనిచ్చే సలహా ఏమిటంటే.. వచ్చే ఐదేళ్లలో ఏదైనా చేయండి. డైలాగులు, సంగీతం లేకుండా సినిమా తీయండి, లేదంటే బ్లాక్‌అండ్‌ వైట్‌లో కొత్తగా చిత్రాన్ని తెరకెక్కించండి. దేనికీ భయపడొద్దు. ప్రజలు మన పరిశ్రమను ఆదరించేందుకు సిద్ధంగా ఉన్నారు. ప్రతీ చిత్రం రూ.100కోట్ల క్లబ్‌లో చేరడమే లక్ష్యంగా అర్థవంతమైన సినిమాలను ప్రేక్షకులకు అందిద్దాం’ అని కోరారు.

ప్రస్తుతం ఫహాద్‌ ఫాజిల్‌ తెలుగు, తమిళ అగ్ర నటీనటుల సినిమాల్లో వరుస అవకాశాలు అందుకుంటున్నారు. సుకుమార్‌ దర్శకత్వంలో అల్లు అర్జున్‌ హీరోగా తెరకెక్కుతోన్న  ‘పుష్ప2’లో ఎస్పీ భన్వ‌ర్‌సింగ్ షెకావ‌త్‌గా అలరించేందుకు మరోసారి సిద్ధమయ్యారు. మొదటిభాగంతో పోలిస్తే రెండో భాగంలో ఆయన పాత్ర నిడివి ఎక్కువగా ఉండనుంది. హీరోకు, ఆ పాత్రకు మధ్య చాలా యాక్షన్‌ సన్నివేశాలు ఉండనున్నాయి. అలాగే రజనీకాంత్ హీరోగా టి.జె.జ్ఞానవేల్‌ దర్శకత్వంలో రానున్న ‘వేట్టయాన్‌’లోనూ ఓ కీలకపాత్రలో కనిపించనున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని